Tata Motors : కొత్త కారు కొనేవారికి బిగ్ షాక్..!
Tata Motors: డిసెంబర్ 1, 2026 నుంచి టాటా మోటార్స్ తన పెట్రోల్, డీజిల్, సీఎన్‌జీ , ఎలక్ట్రిక్ కార్ల ధరలను సగటున 0.5% పెంచుతోంది.
Tata Motors price hike: కొత్త కారు కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్న వినియోగదారులకు దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ లిమిటెడ్ షాకింగ్ న్యూస్ చెప్పింది. ఎంపిక చేసిన మోడళ్ల ధరలను పెంచుతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. పెంచిన కొత్త ధరలు డిసెంబర్ 1, 2026 నుంచే అమలులోకి రానున్నాయి. కార్ల ధరలను సగటున 0.5 శాతం మేర పెంచుతున్నట్లు కంపెనీ వెల్లడించింది. ముఖ్యంగా ఈ ధరల సవరణ కేవలం పెట్రోల్, డీజిల్, సీఎన్‌జీ వాహనాలకే కాకుండా, సంస్థ విక్రయిస్తున్న ఎలక్ట్రిక్ వాహనాల శ్రేణికి సైతం వర్తిస్తుందని స్పష్టం చేసింది.
ఉక్కు, అల్యూమినియం, బ్యాటరీ విడిభాగాల వంటి ముడి సరుకుల వ్యయాలు, రవాణా ఖర్చులు నిరంతరం పెరుగుతుండడమే ఈ ధరల పెంపునకు ప్రధాన కారణమని కంపెనీ పేర్కొంది. ఇప్పటివరకు పెరిగిన ఉత్పత్తి వ్యయంలో అధిక భాగాన్ని సంస్థే భరిస్తూ వచ్చిందని, అయితే వ్యయాల ఒత్తిడి కొనసాగుతుండటంతో కొంత భారాన్ని కస్టమర్లకు బదిలీ చేయక తప్పడం లేదని టాటా మోటార్స్ పీవీ వివరించింది. ఇప్పటికే మారుతీ సుజుకీ, హ్యుందాయ్ వంటి దిగ్గజ కంపెనీలు ధరలను పెంచాయి. మారుతీ సుజుకీ అయితే ఈ ఏడాదిలో పలుమార్లు ధరలు పెంచి కొనుగోలుదారులకు షాక్ ఇవ్వగా, ఇప్పుడు టాటా మోటార్స్ సైతం వాటి సరసన చేరింది.
టాటా మోటార్స్ ప్రకటన ప్రకారం ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ నుంచి ప్రీమియం ఎస్‌యూవీల వరకు అన్ని ICE, EV మోడళ్లపై ధరల పెంపు ప్రభావం ఉంటుంది.
సాధారణ మోడళ్లు : టియాగో , టిగోర్, ఆల్ట్రోజ్, పంచ్, నెక్సాన్ , కర్వ్, హారియర్, సఫారీ.
ఎలక్ట్రిక్ మోడళ్లు : టియాగో ఈవీ, పంచ్ ఈవీ, నెక్సాన్ ఈవీ, కర్వ్ ఈవీ, హారియర్ ఈవీ.
సగటు పెంపు 0.5 శాతంగా ఉన్నప్పటికీ, మోడల్, వేరియంట్, ఫీచర్లను బట్టి పెంపు మారుతుంది. అంచనాల ప్రకారం, ఎంట్రీ లెవల్ టియాగో బేస్ వేరియంట్‌పై సుమారు రూ. 2,400 నుంచి టాప్ స్పెక్ హారియర్ ఈవీ వేరియంట్‌పై గరిష్ఠంగా రూ. 15,300 వరకు ధరలు పెరిగే అవకాశం ఉంది. డిసెంబర్ 1 నుంచి కొత్త ధరలు అమలులోకి రానున్నందున, కారు కొనాలనుకునే వారు ఈ కింది జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా పెరిగిన ధరల భారం నుంచి తప్పించుకోవచ్చు.
ఆటోమొబైల్ కంపెనీల నిబంధనల ప్రకారం, కారు బుక్ చేసుకున్న తేదీ కాకుండా వాహనం ఇన్వాయిస్ అయ్యే తేదీ నాటి ధరలే వర్తిస్తాయి. కాబట్టి నవంబర్ 30, 2026 లోపు బిల్లింగ్ , డెలివరీ పూర్తయ్యేలా డీలర్‌తో మాట్లాడుకుంటే పాత ధరలకే కారు సొంతం చేసుకోవచ్చు. నవంబర్ - డిసెంబర్ నెలల్లో డీలర్ల వద్ద 2026 తయారీ స్టాక్‌పై ఆకర్షణీయమైన నగదు డిస్కౌంట్లు , ఎక్స్ఛేంజ్ బోనస్‌లు అందుబాటులో ఉంటాయి. ధర పెంపునకు ముందే వీటిని వినియోగించుకోవడం ద్వారా డబుల్ బెనిఫిట్ పొందవచ్చు.




