Tata Motors : పెట్రోల్, ఈవీల తర్వాత వస్తున్న కొత్త రకం కారు.. ఒక్క ఇంజిన్‌తో ఏ ఇంధనమైనా వాడొచ్చు
Tata Motors : టాటా మోటార్స్ తన మొదటి ఫ్లెక్స్ ఫ్యూయల్ కారును 2026 చివరి నాటికి విడుదల చేయనుంది. ఎథనాల్‌తో నడిచే టాటా పంచ్ ద్వారా ఇంధన ఖర్చులను తగ్గించేందుకు కంపెనీ సిద్ధమైంది.
Tata Motors
Tata Motors : దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ ఇంధన రంగంలో సరికొత్త విప్లవానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే పెట్రోల్, డీజిల్, సీఎన్జీ, ఎలక్ట్రిక్ కార్లలో రారాజుగా వెలుగొందుతున్న టాటా.. ఇప్పుడు తన మొట్టమొదటి ఫ్లెక్స్ ఫ్యూయల్ కారును విడుదల చేయడానికి ముహూర్తం ఖరారు చేస్తోంది. భారత ప్రభుత్వం పర్యావరణ హితమైన ఎథనాల్ ఇంధనాన్ని ప్రోత్సహిస్తున్న నేపథ్యంలో, టాటా మోటార్స్ ఈ దిశగా వడివడిగ అడుగులు వేస్తోంది. 2026 చివరి నాటికి లేదా 2027 ఆరంభంలో ఈ కొత్త టెక్నాలజీ కారు రోడ్లపైకి రానుంది.
భారతదేశంలో 2026 ఏప్రిల్ 1 నుంచి దేశవ్యాప్తంగా E20 పెట్రోల్ (20% ఎథనాల్ కలిపిన పెట్రోల్) అందుబాటులోకి వచ్చింది. అయితే ప్రభుత్వం ఇప్పుడు అంతకు మించి E85, E100 వంటి అధిక ఎథనాల్ కలిపిన ఇంధనాలను వాడాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఫ్లెక్స్ ఫ్యూయల్ ఇంజిన్ అంటే.. ఇది కేవలం పెట్రోల్‌తోనే కాకుండా, 85% నుంచి 100% వరకు ఎథనాల్ కలిపిన ఇంధనంతో కూడా నడుస్తుంది. చెరకు, మొక్కజొన్న వంటి పంటల నుంచి తయారయ్యే ఎథనాల్ వల్ల కాలుష్యం తగ్గడమే కాకుండా, విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ముడి చమురుపై ఆధారపడటం కూడా తగ్గుతుంది.
మీడియా కథనాల ప్రకారం.. టాటా మోటార్స్ నుంచి రాబోతున్న మొట్టమొదటి ఫ్లెక్స్ ఫ్యూయల్ కారు టాటా పంచ్ అయ్యే అవకాశం ఉంది. గతేడాది జరిగిన భారత్ మొబిలిటీ షోలో కంపెనీ ఈ మోడల్‌ను ప్రదర్శించింది. ఇందులో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌ను అమర్చారు, కానీ దీన్ని ఎథనాల్ మిశ్రమాలకు అనుగుణంగా ప్రత్యేకంగా రీ-డిజైన్ చేశారు. ఈ కారు E85 ఇంధనంపై సులభంగా నడుస్తుంది. టాటా మోటార్స్ ఎండీ శైలేష్ చంద్ర మాట్లాడుతూ.. కనీసం ఒక ఫ్లెక్స్ ఫ్యూయల్ వేరియంట్‌ను త్వరలోనే లాంచ్ చేస్తామని ధృవీకరించారు.
ఫ్లెక్స్ ఫ్యూయల్ కార్ల వల్ల సామాన్యుడికి ఇంధన ఖర్చులు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. పెట్రోల్ ధరలతో పోలిస్తే ఎథనాల్ ధర తక్కువగా ఉంటుంది కాబట్టి, వాహన నిర్వహణ చౌకగా మారుతుంది. ఇప్పటికే టాటా కార్ల ఇంజిన్లు E20 పెట్రోల్‌కు అనుగుణంగా సిద్ధమై ఉన్నాయి. ఇప్పుడు E85 ప్రమాణాలకు తగ్గట్లుగా ఫ్యూయల్ సిస్టమ్, సెన్సార్లను మార్చడం ద్వారా వినియోగదారులకు ఇంధన ఎంపికలో పూర్తి స్వేచ్ఛ లభిస్తుంది. రాబోయే రోజుల్లో మారుతి సుజుకి, టయోటా కూడా ఇలాంటి మోడళ్లను మార్కెట్లోకి తెచ్చేందుకు పోటీ పడుతున్నాయి.




