Tata Motors: తగ్గేదేలే.. ఎలక్ట్రిక్ కార్ల విక్రయాల్లో టాటా మోటార్స్ ఆల్‌టైమ్ రికార్డు

Tata Motors: భారత ఆటోమొబైల్ రంగాన్ని శాసిస్తున్న టాటా మోటార్స్ విక్రయాల్లో సరికొత్త ఆల్‌టైమ్ రికార్డులను నమోదు చేసింది.

CR Reddy
Published on: 8 Sept 2026 10:07 AM IST
Tata Motors
X

Tata Motors

Tata Motors: భారత ప్యాసింజర్ వాహనాల మార్కెట్లో మార్కెట్ లీడర్ మారుతి సుజుకి తర్వాతి స్థానంలో ఉన్న టాటా మోటార్స్, ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాల్లో తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంది. కస్టమర్ల అవసరాలకు తగ్గట్లుగా వేర్వేరు మోడళ్లను మార్కెట్లోకి తీసుకురావడమే ఈ ఘనతకు ప్రధాన కారణం. గత ఆగస్టు నెలలో కంపెనీ ఏకంగా 16,549 ఎలక్ట్రిక్ వాహనాల హోల్‌సేల్ విక్రయాలను సాధించి ఆల్‌టైమ్ హై రికార్డును నెలకొల్పింది. గతేడాది ఆగస్టు నెలలో నమోదైన 8,540 యూనిట్లతో పోలిస్తే ఇది ఏకంగా 94 శాతం వృద్ధి కావడం విశేషం. ఈ ఏడాది మే నెలలో తొలిసారి పది వేల మైలురాయిని దాటిన టాటా ఈవీ విక్రయాలు, ఆ తర్వాత జూన్, జులై, ఆగస్టు నెలల్లో వరుసగా పెరుగుతూ సరికొత్త చరిత్ర సృష్టించాయి.

ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్టు వరకు ఎనిమిది నెలల కాలంలో టాటా మోటార్స్ మొత్తం 93,164 ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయించింది. గతేడాది ఇదే సమయానికి నమోదైన 47,831 యూనిట్లతో పోలిస్తే ఇది 95 శాతం కంటే ఎక్కువ వృద్ధి. ఈ ఒక్క ఎనిమిది నెలల విక్రయాలతోనే గతేడాది పూర్తి సంవత్సరంలో సాధించిన 81,125 యూనిట్ల రికార్డును టాటా దాటేసింది. మే నెల మధ్యలో పెట్రోల్, డీజిల్, సీఎన్‌జీ ధరలు పెరగడం, వినియోగదారులు పర్యావరణహిత ఈ-మోబిలిటీ వైపు వేగంగా మొగ్గు చూపడంతో కంపెనీ తన ఈవీ సరఫరాను మరింత పెంచింది. జులై నెలలో అత్యధికంగా 14,310 యూనిట్ల రిటైల్ విక్రయాలు జరగడం విశేషం.

కేవలం ఎలక్ట్రిక్ వాహనాలే కాకుండా ఓవరాల్ ప్యాసింజర్ వాహనాల విక్రయాల్లోనూ టాటా మోటార్స్ సంచలనం సృష్టిస్తోంది. ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్టు వరకు కేవలం ఎనిమిది నెలల్లోనే కంపెనీ 5,07,922 ప్యాసింజర్ వాహనాలను కస్టమర్లకు అందించింది. గతేడాది ఇదే సమయంలో నమోదైన 3,50,488 యూనిట్లతో పోలిస్తే ఇది 45 శాతం వార్షిక వృద్ధి. ప్రతి నెలా సగటున 60 వేలకు పైగా వాహనాలు విక్రయమవుతుండగా, అందులో ఎలక్ట్రిక్ వాహనాల వాటా కూడా క్రమంగా పెరుగుతోంది. జనవరిలో ఓవరాల్ విక్రయాల్లో 12.89 శాతంగా ఉన్న ఈవీల వాటా, ఆగస్టు నాటికి ఏకంగా 25.36 శాతానికి చేరింది.

ప్రస్తుతం కంపెనీ విక్రయిస్తున్న మొత్తం ప్యాసింజర్ వాహనాల్లో ప్రతి నాలుగు కార్లలో ఒకటి ఎలక్ట్రిక్ కారు కావడం గమనార్హం. పెట్రోల్, డీజిల్ వాహనాలకు ఏమాత్రం తీసిపోని రీతిలో ఎలక్ట్రిక్ మోడళ్లను అందుబాటులోకి తీసుకురావడం, మెరుగైన రేంజ్ అందించడం టాటా మోటార్స్‌కు కలిసివచ్చింది. భారత మార్కెట్లో విద్యుత్ వాహనాల విస్తరణను మరింత వేగవంతం చేయడంలో టాటా మోటార్స్ కీలక పాత్ర పోషిస్తోంది.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story