Tata Nexon EV: ఎలక్ట్రిక్ మార్కెట్లో టాటాదే రాజ్యం.. నెక్సాన్ జోరు చూస్తే షాకవ్వాల్సిందే

Tata Nexon EV: భారతీయ ఆటోమొబైల్ మార్కెట్‌లో ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్ వేగంగా దూసుకుపోతోంది.

CR Reddy
Published on: 15 Sept 2026 11:56 AM IST
Tata Nexon EV
X

Tata Nexon EV

Tata Nexon EV: భారతీయ ఆటోమొబైల్ మార్కెట్‌లో ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్ వేగంగా దూసుకుపోతోంది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతుండటం, ఈ20 పెట్రోల్ అమలులోకి రావడం వంటి కారణాలతో ఎలక్ట్రిక్ కార్ల కొనుగోళ్లకు వినియోగదారులు ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో హైబ్రిడ్ కార్లను సైతం వెనక్కి నెడుతూ ఈవీ కార్లు మార్కెట్‌లో అగ్రగామిగా నిలుస్తున్నాయి. ముఖ్యంగా దేశీయ దిగ్గజం టాటా మోటార్స్ ఈ విభాగంలో నంబర్-వన్ స్థానంలో కొనసాగుతోంది. 2026 మొదటి అర్ధభాగం (జనవరి - జూన్) అమ్మకాల గణాంకాలను పరిశీలిస్తే టాటా ఎలక్ట్రిక్ కార్ల హవా ఏ స్థాయిలో ఉందో స్పష్టమవుతోంది.

టాటా మోటార్స్ నుంచి మార్కెట్లోకి వచ్చిన ఎలక్ట్రిక్ కార్లలో టాటా నెక్సాన్ ఈవీ అత్యధికంగా అమ్ముడవుతున్న మోడల్‌గా రికార్డు సృష్టించింది. 2026 తొలి ఆరు నెలల్లో ఏకంగా 16,567 యూనిట్ల నెక్సాన్ ఈవీలు అమ్ముడయ్యాయి. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే దీని అమ్మకాల్లో భారీ వృద్ధి కనిపిస్తోంది. ఇక రెండో స్థానంలో టాటా పంచ్ ఈవీ నిలిచింది. ఈ కాలంలో 15,683 యూనిట్ల పంచ్ ఈవీలు అమ్ముడై, నెక్సాన్‌కు గట్టి పోటీ ఇస్తున్నాయి.

ఇతర మోడళ్ల అమ్మకాల వివరాలు ఇవే

టాటాకు చెందిన ఇతర ఎలక్ట్రిక్ కార్లు కూడా మార్కెట్లో మంచి అమ్మకాలను నమోదు చేస్తున్నాయి.

* టాటా హారియర్ ఈవీ : ఈ మోడల్ 10,499 యూనిట్ల అమ్మకాలతో మూడో స్థానంలో నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచింది.

* టాటా కర్వ్ ఈవీ : కూపే డిజైన్‌తో వచ్చిన ఈ కారు 7,281 యూనిట్లు అమ్ముడైంది.

* టాటా టియాగో ఈవీ : బడ్జెట్ ధరలో లభించే ఈ కారు 6,816 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది.

* టాటా టిగోర్ ఈవీ, సియెర్రా ఈవీ: ఈ మోడళ్లు వరుసగా 1,643, 1,516 యూనిట్ల చొప్పున అమ్ముడయ్యాయి.

టాటా నెక్సాన్ ఈవీ ప్రత్యేకతలు

టాటా నెక్సాన్ ఈవీ విజయానికి కారణం కంపెనీ ఎప్పటికప్పుడు అందిస్తున్న అప్‌డేట్లే. ఇందులో లభిస్తున్న కొత్త 45kWh బ్యాటరీ ప్యాక్ మెరుగైన పర్ఫామెన్స్ ఇస్తుంది. దీని ARAI సర్టిఫైడ్ రేంజ్ 489 కిలోమీటర్లు కాగా, రియల్ వరల్డ్ రేంజ్ సుమారు 350 కిలోమీటర్ల వరకు ఉంటుంది. అలాగే ఇది కేవలం 48 నిమిషాల్లోనే 10 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ అవుతుంది. BNCAP క్రాష్ టెస్ట్‌లో 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ పొందిన ఈ కారు, మార్కెట్లో ఎంజీ విండ్సర్ ఈవీ, హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్, మహీంద్రా XUV400 వంటి కార్లకు గట్టి పోటీ ఇస్తోంది.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.