Tata Punch: దేశంలో టాప్ నెంబర్ 1 ఎస్యూవీగా టాటా పంచ్ హవా.. లక్షలాది విక్రయాలతో రికార్డు
భారత మార్కెట్లో టాటా పంచ్ నెంబర్ వన్ ఎస్యూవీగా నిలిచింది. 2027 ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో 1.23 లక్షలకు పైగా యూనిట్లు అమ్ముడయ్యాయి.
Tata Punch
Tata Punch: భారతీయ కార్ల మార్కెట్లో టాటా మోటార్స్ తన సత్తా చాటుతోంది. ముఖ్యంగా దేశీయంగా అత్యంత ఆదరణ పొందిన కాంపాక్ట్ ఎస్యూవీ విభాగంలో టాటా పంచ్ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఆర్థిక సంవత్సరం 2027 తొలి ఆరు నెలల్లో (ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య) ఏకంగా 1.23 లక్షలకు పైగా యూనిట్ల అమ్మకాలను నమోదు చేసి అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. చిన్న కార్ లవర్లను అమితంగా ఆకట్టుకుంటున్న ఈ వాహనం మార్కెట్లో ఉన్న ఇతర దిగ్గజ కంపెనీల కార్లకు గట్టి పోటీ ఇస్తోంది.
రెండో స్థానంలోనూ టాటా హవా
టాటా పంచ్ తర్వాత అమ్మకాల పరంగా రెండో స్థానంలో కూడా టాటా కంపెనీకి చెందిన మరో ప్రముఖ ఎస్యూవీ నెక్సాన్ నిలవడం విశేషం. ఈ కాలంలో నెక్సాన్ ఏకంగా 1.11 లక్షలకు పైగా యూనిట్లను విక్రయించి తన పట్టును నిరూపించుకుంది. ఈ జాబితాలో కేవలం నాలుగు మోడళ్లు మాత్రమే లక్షకు పైగా అమ్మకాలను సాధించగా, అందులో టాటా మోటార్స్ కార్లే ముందుండటం విశేషం. మారుతి ఫ్రాంక్స్ మూడో స్థానంలో నిలవగా, మహీంద్రా స్కార్పియో నాలుగో స్థానాన్ని దక్కించుకుంది.
తక్కువ ధరలో బెస్ట్ ఫీచర్లు
భారత మార్కెట్లో లభించే అత్యంత సరసమైన ఎస్యూవీలలో టాటా పంచ్ ముందుంటుంది. దీని ప్రారంభ ఎక్స్ షోరూమ్ ధర కేవలం రూ.5.75 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. తక్కువ బడ్జెట్లో ఆకర్షణీయమైన లుక్, విశాలమైన ఇంటీరియర్, అద్భుతమైన సేఫ్టీ రేటింగ్ ఉండటంతో మధ్యతరగతి ప్రజలు ఈ కారును కొనుగోలు చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. దీని కారణంగానే హ్యుందాయ్ క్రెటా, మార్ుతి బ్రెజా వంటి అగ్రశ్రేణి కార్ల అమ్మకాలు సైతం కొద్దిగా తగ్గుముఖం పట్టాయి.
మారుతి విక్టోరిస్ రికార్డ్ గ్రోత్
టాటా కార్లతో పాటు ఇతర ఆటోమొబైల్ సంస్థల కార్లు కూడా మంచి అమ్మకాలను నమోదు చేస్తున్నాయి. ముఖ్యంగా మారుతి విక్టోరిస్ ఈ ఏడాది ఏకంగా 1581 శాతం వృద్ధిని సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. అలాగే కియా సెల్టోస్, హ్యుందాయ్ వెన్యూ కార్లకు కూడా మార్కెట్లో మంచి స్పందన లభిస్తోంది. మొత్తంగా చూస్తే భారతీయ రోడ్లపై ఎస్యూవీల హవా రోజురోజుకూ విపరీతంగా పెరిగిపోతోందని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.




