Tata Sierra EV : 500 కిమీ రేంజ్.. అదిరిపోయే ఏడీఏఎస్ ఫీచర్లు..టాటా సియెర్రా ఈవీ లాంచ్ ఎప్పుడంటే?

Tata Sierra EV : టాటా మోటార్స్ తన ఐకానిక్ సియెర్రా ఈవీని 2026 జూలై-సెప్టెంబర్ మధ్య లాంచ్ చేయనుంది. 500 కి.మీ రేంజ్, ఏడీఏఎస్ ఫీచర్లతో వస్తున్న ఈ కారు విశేషాలు తెలుసుకుందాం.

CR Reddy
Published on: 18 May 2026 9:16 AM IST
Tata Sierra EV
X

Tata Sierra EV

Tata Sierra EV : టాటా మోటార్స్ తన మోస్ట్ వెయిటెడ్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ టాటా సియెర్రా ఈవీ లాంచ్‌పై ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చింది. గత కొన్ని నెలలుగా టెస్టింగ్ దశలో ఉన్న ఈ కారు, 2026-27 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో (జూలై - సెప్టెంబర్ 2026 మధ్య) భారత మార్కెట్లోకి అడుగుపెట్టనుంది. టాటా ఎలక్ట్రిక్ వాహనాల పోర్ట్‌ఫోలియోలో ఇది కర్వ్ ఈవీకి పైన, హారియర్ ఈవీకి దిగువన ఉండబోతోంది. పాత సియెర్రా లుక్‌ను గుర్తు చేస్తూనే, అత్యాధునిక టెక్నాలజీతో వస్తున్న ఈ కారు ఎలక్ట్రిక్ వాహన ప్రియుల్లో భారీ అంచనాలను పెంచుతోంది.

టాటా సియెర్రా ఈవీని యాక్టి.ఈవీ+ ప్లాట్‌ఫామ్‌పై నిర్మిస్తున్నారు. ఇందులో వినియోగదారుల కోసం రెండు బ్యాటరీ ఆప్షన్లను టాటా ఆఫర్ చేస్తోంది. కర్వ్ ఈవీ నుంచి తీసుకున్న 55 kWh బ్యాటరీ ప్యాక్‌తో పాటు, లాంగ్ రేంజ్ కోసం భారీ 65 kWh బ్యాటరీ యూనిట్‌ను అందించనున్నారు. ఈ పెద్ద బ్యాటరీని ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 500 కిలోమీటర్ల కంటే ఎక్కువ రేంజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. అంతేకాకుండా ఇందులో సింగిల్-మోటార్, డ్యూయల్-మోటార్ కాన్ఫిగరేషన్లు అందుబాటులో ఉండనున్నాయి. దీనివల్ల ఆఫ్-రోడింగ్ ప్రియులకు కూడా సియెర్రా ఈవీ మంచి ఛాయిస్ కానుంది.

కారు ఇంటీరియర్ పూర్తిగా లగ్జరీగా ఉండబోతోంది. కేబిన్‌లో మొత్తం మూడు స్క్రీన్ల లేఅవుట్ ఉండే అవకాశం ఉంది. ఇందులో 12.3 అంగుళాల మెయిన్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డ్రైవర్ కోసం 12.3 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, ముందు ప్యాసింజర్ కోసం ప్రత్యేకంగా మరో 12.3 అంగుళాల డిస్‌ప్లేను అమర్చనున్నారు. ఓటీఏ అప్‌డేట్స్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, వీ2ఎల్ (V2L - వెహికల్ టు లోడ్), వీ2వీ (V2V - వెహికల్ టు వెహికల్) ఛార్జింగ్ సదుపాయాలు ఈ కారు సొంతం. అంటే మీ కారు బ్యాటరీతో ఇతర ఎలక్ట్రిక్ పరికరాలను లేదా మరో ఎలక్ట్రిక్ కారును కూడా ఛార్జ్ చేసుకోవచ్చు.

టాటా కార్లు అంటేనే సేఫ్టీకి కేరాఫ్ అడ్రస్. సియెర్రా ఈవీలో లెవల్-2 ADAS సిస్టమ్, 360-డిగ్రీల కెమెరా, 6 ఎయిర్‌బ్యాగ్‌లు, పవర్డ్ ఫ్రంట్ సీట్లు, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ వంటి అడ్వాన్సుడ్ ఫీచర్లు ఉండబోతున్నాయి. ఇక డిజైన్ విషయానికి వస్తే, పాత ఐకానిక్ సియెర్రా తరహాలోనే వెనుక వైపు పెద్ద గ్లాస్ ఏరియా ఉండబోతోంది. ఫ్రంట్ గ్రిల్ క్లోజ్డ్ మోడల్‌లో ఉండి మోడ్రన్ లుక్‌ను ఇస్తుంది.

భారత మార్కెట్లో టాటా సియెర్రా ఈవీ ప్రారంభ ధర సుమారు రూ.17.5 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ఉండవచ్చని అంచనా. ఇది మార్కెట్లోకి వస్తే మారుతి సుజుకి ఈ-విటారా, హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్, మహీంద్రా ఎక్స్‌ఈవీ 9ఈ వంటి దిగ్గజ కార్లతో పోటీ పడనుంది. తన పాత జ్ఞాపకాలను, కొత్త టెక్నాలజీని మిళితం చేస్తూ వస్తున్న సియెర్రా ఈవీ.. టాటా మోటార్స్ ఈవీ ప్రస్థానంలో మరో మైలురాయి కానుంది.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story