Tesla: భారత మార్కెట్లో బుకింగ్స్ ఓపెన్ చేసిన టెస్లా ఎగిరే కారు.. అడ్వాన్స్‌గా అరకోటి

Tesla: ప్రపంచ ప్రఖ్యాత ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా తన సరికొత్త ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కార్ రోడ్ స్టర్ బుకింగ్‌లను భారత మార్కెట్లో అధికారికంగా ప్రారంభించింది.

CR Reddy
Published on: 18 Oct 2026 11:48 AM IST
Tesla Roadster
X

Tesla Roadster

Tesla: ప్రపంచ ప్రఖ్యాత ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా తన సరికొత్త ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కార్ రోడ్ స్టర్ బుకింగ్‌లను భారత మార్కెట్లో అధికారికంగా ప్రారంభించింది. అమెరికాలోని టెక్సాస్‌లో ప్రదర్శించిన ఈ కారుకు సంబంధించి పెర్ఫార్మెన్స్ వెర్షన్‌ను రిజర్వ్ చేసుకోవడానికి భారత కస్టమర్లు రూ.50.06 లక్షలు చెల్లించాల్సి ఉంటుందని కంపెనీ వెల్లడించింది. అయితే ఈ మొత్తం కారు తుది ధర కాదని, కేవలం ముందస్తు రిజర్వేషన్ కోసం మాత్రమే అని స్పష్టం చేశారు. ఈ వినూత్న ఎలక్ట్రిక్ కారు ఉత్పత్తిని 2028 నాటికి ప్రారంభించాలని టెస్లా లక్ష్యంగా పెట్టుకుంది.

ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్ ప్రేరేపిత డిజైన్ అలాగే ఫీచర్లు

ఈ టెస్లా రోడ్ స్టర్ డిజైన్ ఎస్సార్-71 అలాగే ఎఫ్-35 వంటి ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్‌ల నుంచి ప్రేరణ పొంది రూపొందించబడింది. ఇందులో దాగి ఉండే హెడ్‌లైట్లు, తొలగించగల గ్లాస్ రూఫ్, వెనుక భాగంలో యాక్టివ్ రియర్ వింగ్ అమర్చారు. ఈ వింగ్ అత్యధిక వేగంలో కారును అదుపులో ఉంచడంతో పాటు ఎయిర్‌బ్రేక్‌గా కూడా పనిచేస్తుంది. కేబిన్ లోపల సాధారణ స్టీరింగ్ వీల్‌కు బదులుగా ప్రత్యేకమైన స్టీరింగ్ యోక్, టచ్‌స్క్రీన్ ప్యానెల్స్, అడ్జస్టబుల్ పెడల్స్ ఇవ్వడం ద్వారా దీనికి ఫ్యూచరిస్టిక్ లుక్ తీసుకువచ్చారు.

పవర్ ఫుల్ మోటార్లు అలాగే అద్భుతమైన రేంజ్

ఈ స్పోర్ట్స్ కారు పనితీరు అత్యంత పవర్ ఫుల్ గా ఉండేలా రూపకల్పన చేశారు. వెనుక చక్రాలను తిప్పడానికి రెండు ఎలక్ట్రిక్ మోటార్లు ఇవ్వగా, వీటి మొత్తం పవర్ దాదాపు 1,341 హెచ్‌పిగా ఉంటుందని అంచనా. ఇందులో అత్యాధునిక సెల్ బ్యాటరీ ప్యాక్ అమర్చనుండగా, ఒక్కసారి ఛార్జ్ చేస్తే 483 కిలోమీటర్లకు పైగా దూరం ప్రయాణించవచ్చని కంపెనీ చెబుతోంది. కేవలం 10 నుంచి 12 నిమిషాల్లోనే బ్యాటరీని వేగంగా ఛార్జ్ చేసుకునే సదుపాయం కూడా ఇందులో లభించనుంది. కార్బన్ సిరామిక్ బ్రేకులు, హైట్ అడ్జస్టబుల్ సస్పెన్షన్ దీని ప్రత్యేకతలు.

విభిన్న వేరియంట్లు అలాగే వేగంలో రికార్డులు

టెస్లా రోడ్ స్టర్ కార్లలో పెర్ఫార్మెన్స్, థ్రస్ట్ అలాగే రాకెట్ అనే మూడు వేరియంట్లు అందుబాటులో ఉండనున్నాయి. పెర్ఫార్మెన్స్ వెర్షన్ కేవలం 1.6 సెకన్లలోనే గంటకు 0 నుంచి 96 కి.మీ వేగాన్ని అందుకోగలదు. రాకెట్ వెర్షన్‌లో ప్రత్యేక థ్రస్టర్లు ఉండటం వల్ల అత్యంత వేగంగా దూసుకెళ్లే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. అయితే భారత్‌లో బుకింగ్ చేసుకునే వారు ముందుగా రూ.5.01 లక్షలు చెల్లించి, మిగిలిన మొత్తాన్ని నిర్ణీత గడువులోగా చెల్లించాల్సి ఉంటుంది. అధునాతన సాంకేతికతతో రానున్న ఈ సూపర్ కార్ కోసం ఆటోమొబైల్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.