Tesla : పేరు గొప్ప.. ఊరు దిబ్బ.. కార్లు అమ్మలేక తలపట్టుకున్న మస్క్ మామ

Tesla : భారత మార్కెట్లో గ్లోబల్ ఈవీ దిగ్గజం టెస్లాకు చుక్కెదురైంది. అట్టహాసంగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఏడాదిలో 500 కార్లు కూడా విక్రయించలేకపోయింది.

CR Reddy
Published on: 18 July 2026 9:06 AM IST
Tesla
X

Tesla

Tesla : ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ కార్ల రంగంలో తిరుగులేని బ్రాండ్ ఇమేజ్ ఉన్న ఎలోన్ మస్క్‌కు చెందిన టెస్లా కంపెనీకి భారత మార్కెట్‌లో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న భారత ఆటోమొబైల్ మార్కెట్లోకి టెస్లా గతేడాది జూలై 15, 2025న ఎంతో అట్టహాసంగా అడుగుపెట్టింది. అనంతరం సెప్టెంబర్ నెల నుంచి తన పాపులర్ మోడల్ టెస్లా మోడల్ Y డెలివరీలను కూడా ప్రారంభించింది. అయితే తాజాగా విడుదలైన పరిశ్రమల విక్రయాల గణాంకాల ప్రకారం.. గతేడాది సెప్టెంబర్ నుంచి జూన్ 2026 వరకు అంటే దాదాపు పది నెలల కాలంలో టెస్లా భారత్‌లో కేవలం 450 కార్లను మాత్రమే విక్రయించగలిగింది. అంటే నెలకు సగటున 50 కార్ల అమ్మకాలను కూడా అందుకోలేకపోయింది. గ్లోబల్ మార్కెట్‌లో ఎంత క్రేజ్ ఉన్నప్పటికీ, భారత ప్రీమియం కార్ మార్కెట్‌లో స్థానం సంపాదించడం ఎంత కష్టమో ఈ గణాంకాలు నిరూపిస్తున్నాయి.

టెస్లాను దాటేసిన జర్మన్ లగ్జరీ కార్లు

టెస్లా అమ్మకాలతో పోలిస్తే జర్మనీకి చెందిన ప్రముఖ లగ్జరీ కార్ల కంపెనీలు భారత మార్కెట్‌లో భారీ విక్రయాలతో దూసుకుపోతున్నాయి. మనీకంట్రోల్ సేకరించిన ఇండస్ట్రీ సేల్స్ డేటా ప్రకారం.. టెస్లా తన మోడల్స్ డెలివరీ చేసిన ఇదే కాలంలో (సెప్టెంబర్ నుంచి జూన్ 2026 మధ్య) బీఎండబ్ల్యూ ఏకంగా 3,433 కార్లను విక్రయించింది. అలాగే మరో లగ్జరీ బ్రాండ్ మర్సిడెస్ బెంజ్ కూడా 1,116 కార్ల అమ్మకాలతో స్థిరంగా సాగుతోంది. కొన్ని నెలల్లో అయితే బీఎండబ్ల్యూ కంపెనీ ఒంటరిగానే.. టెస్లా తన మొదటి ఏడాదిలో సాధించిన మొత్తం అమ్మకాల కంటే ఎక్కువ కార్లను విక్రయించడం విశేషం. టెస్లా అంతర్జాతీయ ప్రత్యర్థి అయిన చైనా ఈవీ దిగ్గజం BYD కూడా భారత్‌లో మంచి అమ్మకాలనే నమోదు చేసింది. వివిధ ధరల శ్రేణిలో బహుళ మోడళ్లను అందుబాటులో ఉంచడమే BYD విజయ రహస్యమని నిపుణులు చెబుతున్నారు.

ధరలు తగ్గించినా కలగని కలిసిరాని అదృష్టం

భారతదేశంలో లాంచ్ అయిన సమయంలో టెస్లా తన బేస్ మోడల్ Y ఎక్స్-షోరూమ్ ధరను రూ.59.89 లక్షలుగా నిర్ణయించింది. కస్టమర్లను ఆకర్షించేందుకు మే 2026 నాటికి ఈ ధరను రూ.50.89 లక్షలకు తగ్గించింది. అయినప్పటికీ ఆశించిన స్థాయిలో అమ్మకాలు పెరగలేదు. దీనికి ప్రధాన కారణం టెస్లా కార్లు విదేశాల నుంచి పూర్తిగా తయారై దిగుమతి అవుతుండటమే. దీనివల్ల వాటిపై పన్నుల భారం ఎక్కువగా ఉంటుంది. ఇదే సమయంలో భారతీయ మార్కెట్లోకి స్వదేశీ దిగ్గజం మహీంద్రా సంస్థ తీసుకొచ్చిన మహీంద్రా BE 6, మహీంద్రా XEV 9E వంటి సరికొత్త ఎలక్ట్రిక్ కార్లు టెస్లాకు గట్టి పోటీని ఇస్తున్నాయి. తక్కువ ధరలోనే ఎక్కువ ఫ్యూచరిస్టిక్ ఫీచర్లు, అద్భుతమైన లుక్స్‌తో లభిస్తుండటంతో ప్రీమియం కొనుగోలుదారులు టెస్లా వైపు కాకుండా వీటి వైపు మొగ్గు చూపుతున్నారు.

టెస్లా వైఫల్యానికి ఆటోమొబైల్ నిపుణులు చెబుతున్న కారణాలు ఇవే

టెస్లా ఆశించిన స్థాయిలో రాణించకపోవడంపై గ్లోబల్ మొబిలిటీ అసోసియేట్ డైరెక్టర్ గౌరవ్ వంగల్ ఆసక్తికర విశ్లేషణ చేశారు. "భారతదేశంలో టెస్లా బ్రాండ్ గురించి అందరికీ తెలుసు, ఇక్కడ అవేర్‌నెస్ సమస్య కాదు. అసలు సమస్యల్లా.. కేవలం ఒకే ఒక మోడల్ బాడీ స్టైల్‌ను అందుబాటులో ఉంచడం, కారును పూర్తిగా విదేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకోవడం వల్ల దానిపై పడే భారీ పన్నుల గణితమే" అని ఆయన పేర్కొన్నారు. రెండు దశాబ్దాలుగా భారత మార్కెట్లో పటిష్టమైన సర్వీస్ నెట్‌వర్క్, విభిన్న మోడళ్లతో కస్టమర్ల నమ్మకాన్ని గెలుచుకున్న బీఎండబ్ల్యూ, మర్సిడెస్ బెంజ్‌లతో టెస్లా పోటీ పడటం అంత సులువు కాదు. బ్రాండ్ ఇమేజ్ మాత్రమే చూపిస్తే సరిపోదని, భారతీయ వినియోగదారుల బడ్జెట్, అవసరాలకు సరిపోయే సరైన మోడళ్లను సరైన ధరలో అందించినప్పుడే టెస్లా ఇక్కడ సక్సెస్ అవుతుందని మార్కెట్ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story