New Cars: కొత్త నెక్సాన్ నుంచి మినీ స్కార్పియో వరకు.. 2027 మోస్ట్ అవేటెడ్ కార్లు ఇవే

ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజాలైన టాటా మోటార్స్, కియా, అలాగే మహారాష్ట్ర దిగ్గజం మహీంద్రా తమ సరికొత్త మోడళ్లను మార్కెట్లోకి తీసుకువచ్చేందుకు భారీ సన్నాహాలు చేస్తున్నాయి.

CR Reddy
Published on: 12 Nov 2026 10:41 AM IST
Next Gen Tata Nexon
X

Next Gen Tata Nexon

New Cars: భారతదేశ సబ్-4 మీటర్ల కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో రాబోయే రోజుల్లో పోటీ మరింత తీవ్రం కానుంది. ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజాలైన టాటా మోటార్స్, కియా, అలాగే మహారాష్ట్ర దిగ్గజం మహీంద్రా తమ సరికొత్త మోడళ్లను మార్కెట్లోకి తీసుకువచ్చేందుకు భారీ సన్నాహాలు చేస్తున్నాయి. నెక్సాన్ నూతన తరం మోడల్, రెండో తరం కియా సొనెట్, అలాగే అత్యంత ఆసక్తి రేకెత్తిస్తున్న మహీంద్రా విజన్ S ప్రొడక్షన్ వెర్షన్ త్వరలోనే రోడ్లపైకి రానున్నాయి. ఈ మూడు అద్భుతమైన ఎస్‌యూవీలను 2027 సంవత్సరపు మొదటి అర్ధభాగంలో లాంచ్ చేసే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

నెక్సాన్ నయా మోడల్

టాటా మోటార్స్ అత్యంత ప్రజాదరణ పొందిన నెక్సాన్ ఎస్‌యూవీని సరికొత్త హంగులతో తీర్చిదిద్దుతోంది. ఇంటర్నల్‌గా దీనికి ప్రాజెక్ట్ గరుడ్ అనే కోడ్‌నేమ్ కేటాయించారు. దీని ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ.8 లక్షల నుంచి రూ.17 లక్షల వరకు ఉండవచ్చని అంచనా. 2027 ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించి అదే ఏడాది మధ్య నాటికి దీనిని మార్కెట్లో విడుదల చేయాలని కంపెనీ భావిస్తోంది. ప్రస్తుత ప్లాట్‌ఫారమ్‌కు బదులుగా ఈసారి ఆధునిక ఆర్కిటెక్చర్‌ను ఉపయోగించనున్నారు. డిజైన్ పరంగా అత్యాధునిక ఎల్‌ఈడీ లైటింగ్, ఆకర్షణీయమైన బంపర్‌లు, అప్‌డేటెడ్ డ్యాష్‌బోర్డ్ లేఅవుట్ లభించనున్నాయి. ఇంజిన్ పరంగా పెట్రోల్, డీజిల్‌తో పాటు ఫ్యాక్టరీ ఫిట్టెడ్ సీఎన్‌జీ ఆప్షన్ కూడా లభించే అవకాశం ఉంది.

రెండో తరం కియా సొనెట్

కొరియన్ కార్ల తయారీ సంస్థ కియా తన విజయవంతమైన సొనెట్ ఎస్‌యూవీకి సెకండ్ జెନరేషన్ మోడల్‌ను పరిచయం చేస్తోంది. దీని ధర కూడా రూ.8 లక్షల నుంచి రూ.17 లక్షల శ్రేణిలో ఉండొచ్చు. 2027 తొలి త్రైమాసికంలో ఇది షోరూమ్‌లకు రానుంది. గత మోడల్‌లో వినియోగదారులు ఎదుర్కొన్న వెనుక సీట్ల స్పేస్ సమస్యను పూర్తిగా పరిష్కరించేలా దీనిని డిజైన్ చేస్తున్నారు. పెద్ద డ్యూయల్-స్క్రీన్ సెటప్, ఓటీఏ అప్‌డేట్లు, ఆరు స్టాండర్డ్ ఎయిర్‌బ్యాగ్‌లతో పాటు లెవెల్ 2 ఏడీఏఎస్ భద్రతా హంగులు ఇందులో చేర్చనున్నారు. పెట్రోల్, డీజిల్ ఇంజిన్‌లతో పాటు భవిష్యత్తులో హైబ్రిడ్ వెర్షన్‌ను కూడా ప్రవేశపెట్టే ఆలోచనలో కంపెనీ ఉంది.

మహీంద్రా విజన్ S

మహీంద్రా సంస్థ నుంచి రానున్న విజన్ S కాన్సెప్ట్ ఆధారిత ప్రొడక్షన్ ఎస్‌యూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనిని మినీ స్కార్పియోగా అభివర్ణిస్తున్నారు. జనవరి లేదా ఫిబ్రవరి 2027 నాటికి ఇది రోడ్లపైకి వచ్చే ఛాన్స్ ఉంది. దీని ధర సుమారు రూ. 8 లక్షల నుంచి రూ. 15 లక్షల మధ్య ఉండవచ్చని తెలుస్తోంది. బాక్సీ డిజైన్, ఆకర్షణీయమైన లుక్స్ దీని సొంతం. మహీంద్రాకు చెందిన సరికొత్త ప్లాట్‌ఫారమ్పై తయారవుతున్న తొలి ఎస్‌యూవీ ఇదే కావడం విశేషం. పెద్ద వీల్‌బేస్ కారణంగా కేబిన్లో విశాలమైన స్థలం లభిస్తుంది. ఆధునిక టచ్‌స్క్రీన్ డిస్‌ప్లేలు, పనోరమిక్ సన్‌రూఫ్ వంటి ప్రీమియం ఫీచర్లు ఈ కొత్త వాహనంలో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.