Hatchback Cars: కార్ల లవర్లకు గుడ్‌న్యూస్.. త్వరలో మార్కెట్లోకి 4 కొత్త హ్యాచ్‌బ్యాక్ కార్లు

Hatchback Cars: భారత మార్కెట్లో ఎస్‌యూవీల క్రేజ్ ఉన్నప్పటికీ హ్యాచ్‌బ్యాక్ కార్లకు ఎప్పుడూ ఉండే డిమాండ్ వేరు. రాబోయే 12 నెలల్లో ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీల నుంచి నాలుగు అద్భుతమైన కొత్త హ్యాచ్‌బ్యాక్ కార్లు విడుదల కానున్నాయి.

CR Reddy
Published on: 1 Oct 2026 10:26 AM IST
Hyundai Grand i10 Nios
X

Hyundai Grand i10 Nios

Hatchback Cars: భారతదేశ ఆటోమొబైల్ మార్కెట్లో కాంపాక్ట్, సబ్-కాంపాక్ట్ ఎస్‌యూవీల హవా ఎంత ఎక్కువగా ఉన్నప్పటికీ, హ్యాచ్‌బ్యాక్ కార్ల ప్రత్యేకత ఎప్పటికీ ప్రత్యేకమే. ముఖ్యంగా మొదటిసారి కారు కొనుగోలు చేసే మధ్యతరగతి ప్రజలు, నగరాల్లోని రద్దీ రోడ్లపై ప్రతిరోజూ ప్రయాణించే వారికి ఇవి మొదటి ఎంపికగా నిలుస్తున్నాయి. అద్భుతమైన మైలేజ్, బడ్జెట్ ధర, నడపడానికి సులభంగా ఉండటం వల్ల వీటికి డిమాండ్ తగ్గదు. ఈ నేపథ్యంలో రాబోయే పన్నెండు నెలల్లో దేశీయ మార్కెట్లోకి నాలుగు సరికొత్త ఫీచర్లతో కూడిన హ్యాచ్‌బ్యాక్ కార్లు అడుగుపెట్టబోతున్నాయి.

1. టయోటా గ్లాంజా ఫేస్‌లిఫ్ట్

ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ టయోటా తన పాపులర్ హ్యాచ్‌బ్యాక్ గ్లాంజా కొత్త ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను లాంచ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. టయోటా సిగ్నేచర్ డిజైన్, సరికొత్త ఫ్రంట్ లుక్, ఆకర్షణీయమైన అల్లాయ్ వీల్స్‌తో ఈ కారు రానుంది. కేబిన్ లోపల 9 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, వెంటిలేటెడ్ సీట్లు, 360-డిగ్రీ కెమెరా, హెడ్-అప్ డిస్‌ప్లే, లెవెల్ 2 ఏడీఏఎస్ వంటి అత్యాధునిక భద్రతా ఫీచర్లు ఇవ్వనున్నారు. ఇందులో నూతన 1.2 లీటరు జెడ్-సిరీస్ 3-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ అందించనుండగా, ఇది మాన్యువల్ అలాగే ఏఎంటీ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లలో లభిస్తుంది.

2. మారుతి సుజుకి వ్యాగన్‌ఆర్ ఫేస్‌లిఫ్ట్

ప్రతి ఇంటిలోనూ ప్రత్యేక గుర్తింపు ఉన్న మారుతి వ్యాగన్‌ఆర్ కారు సరికొత్త రూపంలో రోడ్లపై టెస్టింగ్ జరుపుకుంటోంది. దీని టాల్-బాయ్ డిజైన్ అలాగే ఉన్నప్పటికీ, ఎక్స్టీరియర్ ఇంటీరియర్ డిజైన్లలో ఆధునిక మార్పులు చేశారు. హుడ్ కింద ఉన్న పాత ఇంజిన్‌‌కు బదులుగా సరికొత్త 1.2 లీటరు జెడ్-సిరీస్ 3-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌ను అమర్చనున్నారు. అంతేకాకుండా సీఎన్జీ వేరియంట్‌లో కూడా మొదటిసారిగా ఏఎంటీ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్ అందించే అవకాశం ఉంది.

3. కొత్త హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్

భారత వినియోగదారుల కోసం హ్యుందాయ్ సంస్థ నూతన తరం గ్రాండ్ ఐ10 నియోస్ కారును అభివృద్ధి చేస్తోంది. వచ్చే ఏడాదిలో లాంచ్ కానున్న ఈ హ్యాచ్‌బ్యాక్ సరికొత్త ప్లాట్‌ఫారమ్‌పై రూపుదిద్దుకుంటోంది. దీనివల్ల కారు బాహ్య రూపం పూర్తిగా మారిపోతుంది. లోపలి భాగంలో పెద్ద టచ్‌స్క్రీన్, సన్‌రూఫ్, వెంటిలేటెడ్ సీట్లు, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే వంటి లగ్జరీ ఫీచర్లు ఉంటాయి. ఇందులో నమ్మకమైన 1.2 లీటరు పెట్రోల్ ఇంజిన్‌ను మాన్యువల్, ఏఎంటీ, సీఎన్జీ ఆప్షన్లతో అందుబాటులో ఉంచనున్నారు.

4. కొత్త హ్యుందాయ్ ఐ20

హ్యుందాయ్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ ఐ20 నాలుగో తరం మోడల్ కే3 ప్లాట్‌ఫారమ్‌పై తయారవుతోంది. ఇది కొంచెం క్రాస్‌ఓవర్ లాంటి లుక్‌తో మునుపటి కంటే పెద్ద సైజులో రానుంది. కేబిన్‌ను పూర్తిగా రీ-డిజైన్ చేయగా, డ్యూయల్ 12.3 అంగుళాల స్క్రీన్లు, లెవెల్ 2 ఏడీఏఎస్, వైర్‌లెస్ ఛార్జింగ్ వంటి ఫీచర్లు కల్పిస్తున్నారు. భారత మార్కెట్లో ఈ కారును 2027 నాటికి విడుదల చేసే అవకాశం ఉంది. ఇందులో 1.2 లీటరు నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్, 1.0 లీటరు టర్బో-పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లు కొనసాగుతాయి.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.