6 Airbag Cars: రూ.10 లక్షల లోపే ప్రాణాలకు రక్షణ..6 ఎయిర్‌బ్యాగ్‌లతో వస్తున్న టాప్-5 కార్లు ఇవే
6 Airbag Cars: భారతీయ మార్కెట్లో 6 ఎయిర్‌బ్యాగ్‌లతో లభిస్తున్న టాప్ 5 అఫోర్డబుల్ కార్ల వివరాలు అందుబాటులో ఉన్నాయి.
6 Airbag Cars
6 Airbag Cars: కారు కొనేటప్పుడు ఒకప్పుడు కేవలం మైలేజ్ మాత్రమే చూసేవారు, కానీ కాలం మారింది. ఇప్పుడు మైలేజ్‌తో పాటు ప్రాణ రక్షణగా నిలిచే సేఫ్టీ ఫీచర్లకు కస్టమర్లు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ విషయాన్ని గ్రహించిన ఆటోమొబైల్ కంపెనీలు బడ్జెట్ కార్లలో కూడా భద్రతను గణనీయంగా పెంచాయి. రూ.10 లక్షల కంటే తక్కువ బడ్జెట్‌లో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు ప్రామాణికంగా లభిస్తున్న టాప్ 5 పాపులర్ కార్ల వివరాలు, వాటి ధరలు మీకోసం ప్రత్యేకంగా అందుబాటులో ఉన్నాయి.
మారుతి ఆల్టో K10
బడ్జెట్ ఫ్యామిలీస్ మొదటి ఎంపిక మారుతి ఆల్టో K10 ఈ జాబితాలో మొదటి స్థానంలో నిలిచింది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.3.70 లక్షల నుంచి ప్రారంభమై రూ.5.45 లక్షల వరకు ఉంటుంది. గతంలో ఇందులో కేవలం రెండు ఎయిర్‌బ్యాగ్‌లు మాత్రమే ఉండేవి. ఇటీవలి అప్‌డేట్‌లో భాగంగా మారుతి కంపెనీ ఆరు ఎయిర్‌బ్యాగ్‌లను ప్రామాణికంగా జోడించి వినియోగదారులకు మరింత భద్రతను అందించింది.
మారుతి సెలెరియో
మారుతి నుంచి వస్తున్న మరొక ప్రాచుర్యం పొందిన హ్యాచ్‌బ్యాక్ మోడల్ సెలెరియో. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.4.70 లక్షల నుంచి ప్రారంభమై రూ.6.75 లక్షల వరకు ఉంది. మోడల్ అప్‌గ్రేడ్‌లో భాగంగా కంపెనీ అన్ని వేరియంట్లలో 6 ఎయిర్‌బ్యాగ్‌లను అందుబాటులోకి తెచ్చింది. భద్రతా పరీక్షల్లో ఈ కారు మునుపటి కంటే మెరుగైన ప్రదర్శన కనబరిచి కొనుగోలుదారులను ఆకట్టుకుంటోంది.
టాటా టియాగో
టాటా మోటార్స్ మేకింగ్ అనగానే మనకు భద్రతే గుర్తొస్తుంది. కంపెనీకి చెందిన చిన్న కారు టియాగోలో కూడా 6 ఎయిర్‌బ్యాగ్‌లను ప్రామాణికంగా ఆఫర్ చేస్తున్నారు. ఈ కారు ధర రూ.4.77 లక్షల నుంచి రూ.8.62 లక్షల వరకు ఉంటుంది. బాడీషెల్ అత్యంత దృఢంగా ఉండటంతో పాటు ప్రీమియం సేఫ్టీ ఫీచర్లు లభిస్తుండటంతో ఈ చిన్న కారుకు మార్కెట్లో నిరంతరం మంచి డిమాండ్ కొనసాగుతోంది.
మారుతి వ్యాగన్ ఆర్
ఎక్కువ స్థలం, మైలేజ్ కోరుకునే వారికి మారుతి వ్యాగన్ ఆర్ ఎల్లప్పుడూ బెస్ట్ ఆప్షన్. ఈ కారు ఎక్స్-షోరూమ్ ధర రూ.4.99 లక్షల నుంచి ప్రారంభమై రూ.7.24 లక్షల వరకు అందుబాటులో ఉంది. లగేజ్ స్పేస్‌కు పేరుగాంచిన ఈ ఫ్యామిలీ కారులో 6 ఎయిర్‌బ్యాగ్‌లను తప్పనిసరి ఫీచర్‌గా చేర్చడంతో ప్రయాణికులకు ప్రమాదాల నుంచి పూర్తి స్థాయిలో రక్షణ లభిస్తుంది.
హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్
హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్ మోడల్ రూ.5.60 లక్షల నుంచి రూ.8.09 లక్షల మధ్య లభిస్తోంది. హ్యుందాయ్ సంస్థ తమ అన్ని మోడళ్లలో 6 ఎయిర్‌బ్యాగ్‌లను ప్రామాణికం చేసే వ్యూహంలో భాగంగా ఈ కారును కూడా పూర్తిగా అప్‌గ్రేడ్ చేసింది. ప్రీమియం ఇంటీరియర్, ఆధునిక సేఫ్టీ ఫీచర్లతో విపణిలో దూసుకుపోతున్న ఈ మోడల్ సిటీ డ్రైవింగ్‌కు సూపర్ ఛాయిస్.




