CNG Cars: రూ.4.81 లక్షలకే ఏకంగా 34కిమీ మైలేజ్.. సిటీలో తిరిగేందుకు టాప్ 5 సీఎన్‌జీ కార్లు ఇవే

CNG Cars: ప్రస్తుత తరుణంలో రోజువారీ ఆఫీసు ప్రయాణాలు లేదా నగరంలో తిరిగే వారికి సీఎన్‌జీ కార్లు తక్కువ ఖర్చుతో కూడిన ప్రత్యామ్నాయంగా మారుతున్నాయి.

CR Reddy
Published on: 15 Sept 2026 11:29 AM IST
CNG Cars
X

CNG Cars

CNG Cars: పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకు విపరీతంగా పెరుగుతున్నాయి. ప్రస్తుత తరుణంలో రోజువారీ ఆఫీసు ప్రయాణాలు లేదా నగరంలో తిరిగే వారికి సీఎన్‌జీ కార్లు తక్కువ ఖర్చుతో కూడిన ప్రత్యామ్నాయంగా మారుతున్నాయి. పెట్రోల్ కార్లతో పోలిస్తే సీఎన్‌జీ కార్ల ప్రారంభ ధర కొంచెం ఎక్కువగా ఉన్నప్పటికీ, ఇంధన ఖర్చు చాలా తక్కువగా ఉండటం వల్ల దీర్ఘకాలంలో మంచి ఆదా అవుతుంది. ముఖ్యంగా మార్కెట్లో లభిస్తున్న కొన్ని కార్లు కిలోకు ఏకంగా 32 నుంచి 34 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తాయని కంపెనీలు పేర్కొంటున్నాయి. తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణించాలనుకునే వారి కోసం మార్కెట్లో అందుబాటులో ఉన్న బెస్ట్ 5 సీఎన్‌జీ కార్ల వివరాలు ఇక్కడ చూద్దాం.

1. మారుతి సుజుకీ డిజైర్ సీఎన్‌జీ

ఈ సెడాన్ కారులో 1.2-లీటర్ 3-సిలిండర్ Z-సిరీస్ ఇంజిన్‌ను అందించారు. పెట్రోల్ మోడ్‌లో ఇది 81 bhp పవర్, 111.7 Nm టార్క్‌ను ఇస్తుంది. దీని ఏఆర్‌ఏఐ ధృవీకరించిన మైలేజ్ కిలోకు 33.73 కిలోమీటర్లు. అలాగే పెట్రోల్ మాన్యువల్ వేరియంట్ 24.79 kmpl, ఏఎంటీ వేరియంట్ 25.71 kmpl మైలేజ్ ఇస్తుంది. దీని ప్రారంభ ఎక్స్ షోరూమ్ ధర రూ.8.03 లక్షలుగా ఉంది.

2. మారుతి సుజుకీ వ్యాగన్ ఆర్ సీఎన్‌జీ

భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన కుటుంబ కారు వ్యాగన్ ఆర్. ఇందులో 998cc 3-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. సీఎన్‌జీ మోడ్‌లో ఇది 55.9 bhp పవర్, 82.1 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు కిలోకు 34.05 కిలోమీటర్ల అద్భుతమైన మైలేజీని ఇస్తుంది. దీని ప్రారంభ ఎక్స్ షోరూమ్ ధర రూ.5.88 లక్షలు. తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ మైలేజ్ కోరుకునే వారికి ఇది పర్ఫెక్ట్ ఛాయిస్.

3. మారుతి సుజుకీ సెలెరియో సీఎన్‌జీ

అత్యధిక మైలేజ్ అందించే కార్లలో సెలెరియో ముందుంటుంది. ఇందులో కూడా 998cc ఇంజిన్‌నే వాడారు. దీని ఏఆర్‌ఏఐ సర్టిఫైడ్ మైలేజ్ కిలోకు ఏకంగా 34.43 కిలోమీటర్లు. ఇది దేశంలోనే అత్యధిక మైలేజ్ ఇచ్చే సీఎన్‌జీ కార్లలో ఒకటిగా నిలిచింది. దీని ప్రారంభ ఎక్స్ షోరూమ్ ధర రూ. 5.97 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.

4. మారుతి సుజుకీ స్విఫ్ట్ సీఎన్‌జీ

యువతను ఎంతగానో ఆకట్టుకునే స్విఫ్ట్ కారులో కూడా డిజైన్ లాంటి 1.2-లీటర్ Z-సిరీస్ ఇంజిన్‌ను ఇచ్చారు. ఇది కిలోకు 32.85 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది. స్పోర్టి లుక్, మెరుగైన డ్రైవింగ్ అనుభవం కోరుకునే వారికి ఇది సరిగ్గా సరిపోతుంది. దీని ప్రారంభ ఎక్స్ షోరూమ్ ధర రూ.7.44 లక్షలుగా ఉంది.

5. మారుతి సుజుకీ ఆల్టో K10 సీఎన్‌జీ

అత్యంత అడుగు బడ్జెట్‌లో సీఎన్‌జీ కారు కొనాలనుకునే మధ్యతరగతి ప్రజలకు ఆల్టో K10 ఒక అద్భుతమైన వరం. ఇందులో 998cc ఇంజిన్ ఉండగా, కిలోకు 33.85 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. ఈ జాబితాలో అత్యంత తక్కువ ధర కలిగిన కారు ఇదే కావడం విశేషం. దీని ప్రారంభ ఎక్స్ షోరూమ్ ధర కేవలం రూ.4.81 లక్షల నుంచి మాత్రమే ప్రారంభమవుతుంది.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.