Upcoming Cars : ఇక రోడ్లు లేకపోయినా హ్యాపీగా దూసుకెళ్లొచ్చు... ఇండియన్ మార్కెట్లోకి 5 పవర్ఫుల్ SUVలు
Upcoming Cars : భారత్‌లో అడ్వెంచర్, ఆఫ్-రోడింగ్ ప్రియుల కోసం 2028 నాటికి 5 కొత్త పవర్‌ఫుల్ SUVలు రాబోతున్నాయి.
Upcoming Cars
Upcoming Cars : భారతదేశంలో ఆఫ్-రోడింగ్, అడ్వెంచర్ ట్రావెల్‌పై వాహనదారుల క్రేజ్ రోజురోజుకూ వేగంగా పెరుగుతోంది. రాళ్లు, రప్పలతో కూడిన కఠినమైన రహదారులు, కొండ ప్రాంతాల్లో ప్రయాణించడానికి బలమైన ఫీచర్లు ఉన్న వాహనాల అవసరం ఎంతగానో ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రముఖ కార్ల తయారీ సంస్థలు సరికొత్త ఆఫ్-రోడ్ ఎస్‌యూవీలపై దృష్టి సారించాయి. 2028 నాటికి భారత మార్కెట్లో కనీసం 5 కొత్త మరియు అత్యంత పవర్‌ఫుల్ ఆఫ్-రోడ్ కార్లు లాంచ్ కానున్నాయి. వీటిలో మహింద్రా, టయోటా, హ్యుందాయ్, JSW వంటి దిగ్గజ బ్రాండ్ల మోడళ్లు ఉన్నాయి.
1. న్యూ మహీంద్రా థార్
ఆఫ్-రోడింగ్ అభిమానులకు అత్యంత ప్రియమైన వాహనం మహీంద్రా థార్. ఈ ఏడాది చివరి నాటికి మహీంద్రా థార్ 2-డోర్ మోడల్ సరికొత్త ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ మార్కెట్లోకి రానుంది. ఈ కారు డిజైన్ చాలా వరకు థార్ రాక్స్ మోడల్‌ను పోలి ఉంటుంది. ఇందులో కొత్తగా 6-స్లాట్ గ్రిల్, సి-షేప్ డిఆర్‌ఎల్‌లతో కూడిన ఎల్‌ఈడీ హెడ్‌లైట్లు రానున్నాయి. కేబిన్ లోపల పుష్-బటన్ స్టార్ట్, పాసివ్ కీ-లెస్ ఎంట్రీ, వైర్‌లెస్ ఛార్జర్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు వంటి మోడర్న్ కంఫర్ట్ ఫీచర్లు యాడ్ కానున్నాయి. అయితే దీని ఇంజిన్, గేర్‌బాక్స్ ఆప్షన్లలో ఎలాంటి మార్పులు ఉండవు.
2. JSW ప్లగ్-ఇన్ హైబ్రిడ్ SUV
JSW గ్రూప్ ఈ ఏడాది సెప్టెంబర్‌లో JSW మోటార్స్ పేరుతో భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లోకి అధికారికంగా అడుగుపెట్టబోతోంది. ఈ సంస్థ విడుదల చేయనున్న మొదటి కారు చెరీ కంపెనీకి చెందిన జెటూర్ ట్రావెలర్ C-DM ఆధారిత రీబ్రాండెడ్ మోడల్. ఈ 5-సీటర్ D-సగ్‌మెంట్ ఎస్‌యూవీ 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్, రెండు ఎలక్ట్రిక్ మోటార్లతో వస్తుంది. ఇందులో 27.2 kWh, 43.4 kWh బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లు ఉంటాయి. అత్యంత విశేషమేమిటంటే.. ఈ కారు కేవలం ఎలక్ట్రిక్ మోడ్‌లోనే ఏకంగా 100 కిలోమీటర్లకు పైగా దూరం ప్రయాణించగలదు.
3. నెక్స్ట్-జెన్ టయోటా ఫార్చ్యూనర్
ఇండియన్ మార్కెట్లో తిరుగులేని క్రేజ్ ఉన్న ఫార్చ్యూనర్ ఎస్‌యూవీలో మూడో జనరేషన్ మోడల్‌ను టయోటా సిద్ధం చేస్తోంది. భారతదేశంలో దీనిని 2027 ప్రథమార్ధంలో లాంచ్ చేసే అవకాశాలు ఉన్నాయి. కొత్త ఫార్చ్యూనర్ లుక్ గతంలో కంటే మరింత షార్ప్‌గా, కేబిన్ ఎంతో ప్రీమియంగా ఉండనుంది. ఫీచర్ల విషయానికొస్తే ఎలక్ట్రిక్ పవర్ స్టీరింగ్, 12.3-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లే, పనోరమిక్ సన్‌రూఫ్, ఆటో-హోల్డ్‌తో కూడిన ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, లెవెల్-2 ADAS వంటి అడ్వాన్స్‌డ్ ఫీచర్లు ఉంటాయి. ఇంజిన్, గేర్‌బాక్స్ ప్రస్తుత మోడల్ తరహాలోనే కొనసాగుతాయి.
4. హ్యుందాయ్ ఆఫ్-రోడ్ SUV
హ్యుందాయ్ సంస్థ కూడా భారత్ కోసం ఒక కొత్త ఆఫ్-రోడ్ ఎస్‌యూవీని తీసుకొస్తున్నట్లు స్పష్టం చేసింది. ఈ కారు మోనోకోక్ ప్లాట్‌ఫారమ్ పై ఆధారపడి తయారవుతుంది. ఇది పెట్రోల్, పెట్రోల్-ఎలక్ట్రిక్ హైబ్రిడ్ ఆప్షన్లలో లభించనుంది. స్టాండర్డ్ వేరియంట్లలో ఫ్రంట్-వీల్ డ్రైవ్ రాగా, హైబ్రిడ్ వేరియంట్‌లో ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్‌ను అందించనున్నారు. ఈ సరికొత్త హ్యుందాయ్ ఆఫ్-రోడ్ కారు 2028 నాటికి భారత మార్కెట్లోకి అడుగుపెట్టే అవకాశం ఉంది.
5. టయోటా ల్యాండ్ క్రూజర్ FJ
టయోటా కంపెనీ 2028 చివరి నాటికి భారతదేశంలో ల్యాండ్ క్రూజర్ FJని లాంచ్ చేయనుంది. ఇది ఫార్చ్యూనర్ కంటే కాస్త దిగువన స్థానంలో ఉండే 5-సీటర్ లైఫ్ స్టైల్ ఆఫ్-రోడ్ SUV. ఈ కారులో 2.7-లీటర్ పెట్రోల్ ఇంజిన్, 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్, పార్ట్-టైమ్ 4WD సిస్టమ్ ఉంటాయి. భవిష్యత్తులో దీనికి సంబంధించి హైబ్రిడ్, ప్లగ్-ఇన్ హైబ్రిడ్ మోడళ్లను కూడా భారత్‌కు తేనున్నారు. ఈ కారును భారతదేశంలోనే తయారు చేయనుండటం వల్ల దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ.30 లక్షల వద్ద ఉండే అవకాశం ఉంది.




