Toyota Fortuner : షాక్ ఇస్తున్న ఫార్చ్యూనర్ ధరలు.. ఏకంగా లక్ష రూపాయల వరకు బాదుడు..
Toyota Fortuner : టయోటా కార్లంటేనే క్వాలిటీకి , పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్‌కు కేరాఫ్ అడ్రస్, అందులోనూ టయోటా ఫార్చ్యూనర్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు..
Toyota-Fortuner
Toyota Fortuner : టయోటా కార్లంటేనే క్వాలిటీకి , పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్‌కు కేరాఫ్ అడ్రస్, అందులోనూ టయోటా ఫార్చ్యూనర్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే, ఈ ఎస్‌యూవీని సొంతం చేసుకోవాలనుకునే వారికి కంపెనీ గట్టి షాక్ ఇస్తూ ధరలను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం టయోటా ఫార్చ్యూనర్ మార్కెట్లో రూ.34.76 లక్షల నుండి రూ.50.46 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరల శ్రేణిలో అందుబాటులో ఉంది. కంపెనీ ఈసారి గరిష్టంగా రూ.87,000 వరకు ధరలను పెంచగా, అత్యధికంగా టాప్-స్పెక్ మోడల్ అయిన GR-S 4X4 AT వేరియంట్ ధర పెరిగింది. ఎంట్రీ-లెవల్ పెట్రోల్ 4X2 AT మోడల్ ధర ఇప్పుడు రూ.60,000 మేర పెరగగా, డీజిల్ వేరియంట్ల విషయానికి వస్తే, 4X2 MT డీజిల్ ధర రూ.60,000, 4X2 AT డీజిల్ ధర రూ.65,000 , 4X4 MT డీజిల్ ధర సుమారు రూ.67,000 పెరిగాయి.
ఖరీదైనవిగా మారిన లెజెండర్ వేరియంట్లు
ఫార్చ్యూనర్‌లో ప్రీమియం లుక్‌తో ఉండే లెజెండర్ వేరియంట్లు కూడా ఇప్పుడు మరింత కాస్ట్లీగా మారాయి. లెజెండర్ 4X2 వేరియంట్ ధర సుమారు రూ.75,000 పెరగగా, 4X4 MT వేరియంట్ ధర రూ.78,000 , 4X4 AT వేరియంట్ ధర ఏకంగా రూ.83,000 వరకు పెరిగింది. అంతేకాకుండా, డీజిల్ మైల్డ్ హైబ్రిడ్ 4X4 AT వేరియంట్ ధర కూడా రూ.75,000 మేర పెరిగింది. ధరలు పెరిగినప్పటికీ, ఫార్చ్యూనర్ ప్రేమికులకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే, నెక్స్ట్ జనరేషన్ ఫార్చ్యూనర్ త్వరలోనే మార్కెట్లోకి రాబోతోంది. ఇది 2026 చివరి నాటికి ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది, ఆ తర్వాత త్వరలోనే భారతదేశంలో కూడా లాంచ్ అవుతుంది.
కొత్త తరం ఫార్చ్యూనర్.. అదిరిపోయే ఫీచర్లతో ఎంట్రీ..
తాజాగా బయటకు వచ్చిన స్పై చిత్రాలను బట్టి చూస్తే, కొత్త మోడల్‌లో అధునాతన ADAS (Advanced Driver Assistance System) ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఒక టెస్ట్ మోడల్ బంపర్‌పై ADAS రాడార్ మాడ్యూల్ , విండ్‌స్క్రీన్ వెనుక కెమెరాలను గుర్తించడం ఇందుకు బలాన్నిస్తోంది. కొత్త ఫార్చ్యూనర్‌లో కంఫర్ట్ , టెక్నాలజీకి పెద్దపీట వేయబోతున్నారు, ఇందులో పెద్ద 12.3-అంగుళాల టచ్‌స్క్రీన్ సిస్టమ్, ఫుల్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 360-డిగ్రీ కెమెరా, సన్‌రూఫ్ , వెంటిలేటెడ్ పవర్డ్ ఫ్రంట్ సీట్లు ఉండనున్నాయి. అలాగే OTA (ఓవర్-ది-ఎయిర్) అప్‌డేట్‌లు , అప్‌డేట్ చేసిన కనెక్టివిటీ ఫీచర్లు ఇందులో చేర్చబోతున్నారు.
ఇంజిన్ విషయానికి వస్తే, ప్రస్తుత తరం మాదిరిగానే 166 bhp 2.7-లీటర్ పెట్రోల్ , 204 bhp 2.8-లీటర్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్లతో ఇది లభిస్తుంది. ముఖ్యంగా డీజిల్ ఇంజిన్‌ను 48V మైల్డ్ హైబ్రిడ్ సిస్టమ్‌తో కూడా అందించబోతున్నారు, దీనివల్ల మైలేజ్ , పర్ఫార్మెన్స్ మరింత మెరుగ్గా ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతానికి పెరిగిన ధరలు వినియోగదారులకు కొంత భారంగా అనిపించినా, రాబోయే కొత్త మోడల్ కోసం ఆసక్తిగా ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది.




