Toyota: భారత మార్కెట్లో జోరు కొనసాగిస్తున్న టయోటా.. రికార్డు స్థాయిలో కార్ల సేల్స్

Toyota: భారత మార్కెట్లో టయోటా కార్లకు విపరీతమైన డిమాండ్ కొనసాగుతోంది. సెప్టెంబర్ నెలలో కంపెనీ ఏకంగా 28,218 వాహనాలను విక్రయించి సరికొత్త రికార్డు సృష్టించింది.

CR Reddy
Published on: 3 Oct 2026 9:29 AM IST
Toyota
X

Toyota

Toyota: భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో జపాన్ దిగ్గజం టయోటా కార్లకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కంపెనీ తయారు చేసే వాహనాలకు దేశవ్యాప్తంగా ఎప్పుడూ భారీ డిమాండ్ ఉంటుంది. సరిగ్గా ఇదే జోరును కొనసాగిస్తూ సెప్టెంబర్ నెలలో టయోటా సంస్థ అద్భుతమైన విక్రయాలను నమోదు చేసింది. కేవలం ఒక్క నెల వ్యవధిలో కంపెనీ మొత్తం 28,218 వాహనాలను విక్రయించి సంచలనం సృష్టించింది. ఇందులో దేశీయ మార్కెట్లోనే ఏకంగా 25,027 కార్లు అమ్ముడుపోగా, మరో 3,191 వాహనాలను విదేశాలకు ఎగుమతి చేశారు.

కేవలం ఒక్క నెల గణాంకాలే కాకుండా ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటివరకు టయోటా సాధించిన వృద్ధి ఎంతో ఆకట్టుకునేలా ఉంది. జనవరి నుంచి సెప్టెంబర్ వరకు గల తొమ్మిది నెలల కాలంలో కంపెనీ దేశీయంగా, అంతర్జాతీయంగా కలిపి మొత్తం 2,94,914 కార్లను విక్రయించింది. కేవలం భారత్ మార్కెట్లోనే చూస్తే 2,69,619 యూనిట్లు అమ్ముడయ్యాయి. గత సంవత్సరంతో పోలిస్తే దేశీయ విక్రయాలలో సుమారు తొమ్మిది శాతం వృద్ధి నమోదైంది. పండుగ సీజన్ ప్రారంభం కావడంతో దేశవ్యాప్తంగా ఉన్న డీలర్‌షిప్‌లలో కస్టమర్ల సందడి భారీగా పెరిగింది.

భారత రోడ్లపై టయోటా బ్రాండ్ నిలదొక్కుకోవడానికి ప్రధాన కారణం దాని శక్తివంతమైన ఎస్‌యూవీ అలాగే ఎంపీవీ కార్లే. కర్ణాటకలోని బిదాది ప్లాంటులో తయారయ్యే ఫార్చ్యూనర్, లెజెండర్, ఇన్నోవా క్రిస్టా, ఇన్నోవా హైక్రాస్ కార్లకు ఇప్పటికీ తిరుగులేదు. కుటుంబ యజమానుల మొదటి ఎంపికగా ఈ మోడల్స్ నిలుస్తున్నాయి. వీటితో పాటు అర్బన్ క్రూజర్ హైరైడర్, గ్లాంజా, రూమియన్ కార్లు కూడా నిలకడైన అమ్మకాలను నమోదు చేస్తున్నాయి. లగ్జరీ విభాగంలో వెల్ ఫైర్, ల్యాండ్ క్రూజర్ 300 కార్లు కూడా సంపన్న వర్గాల నుంచి మంచి ఆదరణ పొందుతున్నాయి.

ప్రస్తుత పండుగ సీజన్‌లో తన అమ్మకాల జోరును మరింత పెంచేందుకు టయోటా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ఈ నెలలో పాపులర్ హ్యాచ్‌బ్యాక్ గ్లాంజా కొత్త ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. అలాగే వచ్చే ఏడాది ప్రారంభంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఇన్నోవా హైక్రాస్ ఫేస్‌లిఫ్ట్‌‌ను కూడా లాంచ్ చేయనున్నారు. బిదాడి ప్లాంట్ల ద్వారా సంవత్సరానికి సుమారు మూడు లక్షలకు పైగా కార్లను ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని కంపెనీ పూర్తిగా సద్వినియోగం చేసుకుంటోంది.

ఈ ఏడాది చివరి మూడు నెలల్లో పండుగ డిమాండ్‌ను పూర్తిగా క్యాష్ చేసుకోవాలని టయోటా భావిస్తోంది. ఇప్పటికే తొలి 9 నెలల్లో దాదాపు 3 లక్షల యూనిట్ల అమ్మకాలకు చేరువ కావడంతో, ఏడాది ముగిసేసరికి సరికొత్త చారిత్రాత్మక రికార్డు సృష్టించేందుకు ఆ సంస్థ సిద్ధమైంది. నమ్మకమైన ఇంజిన్ పనితీరు, అద్భుతమైన రీసేల్ వాల్యూ కారణంగా కస్టమర్లు టయోటా కార్ల వైపు మొగ్గు చూపుతున్నారు. రాబోయే రోజుల్లో ఈ బ్రాండ్ నుంచి మరిన్ని అడ్వాన్స్‌డ్ కార్లు మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.