Toyota Innova: టయోటా నుంచి అదిరిపోయే అప్‌డేట్.. త్వరలో మార్కెట్లోకి ఇన్నోవా హైక్రాస్ ఫేస్‌లిఫ్ట్
Toyota Innova: భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో అత్యంత ఆదరణ పొందిన లగ్జరీ ఎంపీవీలలో టయోటా ఇన్నోవా హైక్రాస్ ముందు వరుసలో ఉంటుంది.
Toyota Innova
Toyota Innova: భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో అత్యంత ఆదరణ పొందిన లగ్జరీ ఎంపీవీలలో టయోటా ఇన్నోవా హైక్రాస్ ముందు వరుసలో ఉంటుంది. ఇప్పుడు ఈ పాపులర్ కారుకు మరింత మెరుగులు దిద్దేందుకు టయోటా సంస్థ సన్నాహాలు చేస్తోంది. ఈ ఏడాది చివరి నాటికి ఈ కారును మార్కెట్లోకి తీసుకువచ్చే అవకాశం ఉందని ఆటోమొబైల్ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికే రోడ్లపై ఈ కొత్త ఫేస్‌లిఫ్ట్ మోడల్ టెస్టింగ్ దశలో పలుమార్లు కెమెరాకు చిక్కింది. డిజైన్ పరంగా మరియు ఫీచర్ల పరంగా ఇందులో అనేక ఆకర్షణీయమైన మార్పులు ఉండనున్నట్లు తెలుస్తోంది.
హిలక్స్ నుంచి ప్రేరణ పొందిన సరికొత్త డిజైన్
ఈ కొత్త ఇన్నోవా హైక్రాస్‌లో ప్రధానంగా ఫ్రంట్ డిజైన్‌లో భారీ మార్పులు కనిపించనున్నాయి. కంపెనీ తన పాపులర్ పికప్ ట్రక్ హిలక్స్ నుంచి ప్రేరణ పొంది దీని ముందు భాగాన్ని డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. ముందు భాగంలో కొత్త గ్రిల్, హనీకాంబ్ పాటర్న్ ఉన్న బంపర్, మరింత ఆకర్షణీయమైన హెడ్‌లైట్లు, కొత్త డిజైన్ కలిగిన అల్లాయ్ వీల్స్‌ను అమర్చనున్నారు. కారు ఓవరాల్ షేప్ పాత మోడల్ మానే ఉన్నప్పటికీ, ఈ కాస్మోటిక్ మార్పుల వల్ల కారు మరింత స్టైలిష్‌గా, దూకుడుగా కనిపించనుంది.
అడ్వాన్సుడ్ ఫీచర్లు, భారీ టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే
ఇంటీరియర్ పరంగా కూడా ఈ కారులో పెద్ద మార్పులు చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న 8-ఇంచ్ లేదా 10.1-ఇంచ్ స్క్రీన్‌ల స్థానంలో ఏకంగా 12.3-ఇంచుల భారీ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను ఇవ్వనున్నారు. అలాగే డ్రైవర్ డిస్‌ప్లే కూడా 12.3-ఇంచ్‌లతో రానుంది. ప్రయాణికుల సౌకర్యం కోసం రేర్ వెంటిలేటెడ్ సీట్లు, అప్‌గ్రేడెడ్ ఏడీఏఎస్ భద్రతా ఫీచర్లు, హెడ్-అప్ డిస్‌ప్లే, పవర్డ్ కో-డ్రైవర్ సీటు వంటి ప్రీమియం ఫీచర్లు ఈ కొత్త ఫేస్‌లిఫ్ట్ మోడల్‌లో జత చేయబడే అవకాశం ఉంది.
పవర్ఫుల్ ఇంజిన్ ఆప్షన్లు, లాంచ్ వివరాలు
ఇంజిన్ పరంగా ప్రస్తుత మోడల్‌లో ఉన్న పవర్‌ఫుల్ ఆప్షన్లే కొనసాగనున్నాయి. ఇందులో 2.0-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ (168bhp పవర్, 204Nm టార్క్) సీవీటీ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది. అలాగే 2.0-లీటర్ పెట్రోల్ స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజిన్ (186bhp పవర్, 206Nm కంబైండ్ అవుట్‌పుట్) ఈ-సీవీటీ ఆప్షన్‌తో వస్తుంది. మొదట ఈ కారును 2027 ప్రారంభంలో లాంచ్ చేస్తారనే ప్రచారం జరిగినప్పటికీ, టెస్టింగ్ వేగంగా జరుగుతుండటంతో ఈ ఏడాది చివరి నాడే మార్కెట్లోకి వచ్చే ఛాన్స్ ఉంది.




