Upcoming Cars: పెట్రోల్ బాదుడుకు చెక్.. త్వరలోనే మార్కెట్లోకి 3 సరికొత్త సీఎన్జీ కార్లు

Upcoming Cars: భారతీయ ఆటోమొబైల్ మార్కెట్‌లో సీఎన్జీ వాహనాలకు డిమాండ్ విపరీతంగా పెరుగుతోంది.

CR Reddy
Published on: 7 Sept 2026 10:35 AM IST
Upcoming Cars
X

Upcoming Cars

Upcoming Cars: భారతీయ ఆటోమొబైల్ మార్కెట్‌లో సీఎన్జీ వాహనాలకు డిమాండ్ విపరీతంగా పెరుగుతోంది. పెరుగుతున్న ఇంధన ధరలకు చెక్ పెడుతూ ప్రముఖ దిగ్గజ సంస్థలు టోయోటా, కియా, రెనాల్ట్ సరికొత్త సీఎన్జీ కార్లను మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. అద్భుతమైన మైలేజ్‌తో పాటు అధునాతన టర్బో ఇంజిన్ల హంగులతో ఇవి సందడి చేయనున్నాయి.

రెనాల్ట్ ట్రైబర్ టర్బో సీఎన్జీ

ఫ్రెంచ్ దిగ్గజం రెనో తన ప్రాచుర్యం పొందిన 7-సీటర్ ఎంపీవీ ట్రైబర్ మోడల్‌ను మరింత పవర్ఫుల్ అవతారంలో తీసుకొస్తోంది. ఇందులో కైగర్ కారులో వాడే 1.0-లీటర్ 3-సిలిండర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్‌ను అమర్చనున్నారు. ఇది 100 పీఎస్ పవర్, 160 ఎన్ఎమ్ టాప్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ శక్తివంతమైన ఇంజిన్‌తో పాటు ఫ్యాక్టరీ-ఫిట్టెడ్ సీఎన్జీ ఆప్షన్ అందించనుండటం విశేషం. బూట్ ఫ్లోర్ కింద డ్యూయల్-సిలిండర్ సీఎన్జీ సెటప్ ఏర్పాటు చేయడం వల్ల కారు లోపల లగేజీ స్థలానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఈ మోడల్ ఆర్జీఈపీ ప్లాట్‌ఫారమ్‌పై రూపుదిద్దుకోనుంది.

టయోటా గ్లాంజా ఫేస్‌లిఫ్ట్ సీఎన్జీ వేరియంట్

టయోటా కంపెనీ తన పాపులర్ హ్యాచ్‌బ్యాక్ గ్లాంజా ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను భారీ మార్పులతో మార్కెట్లోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. కొత్త 1.2-లీటర్ 3-సిలిండర్ జెడ్12ఈ పెట్రోల్ ఇంజిన్‌తో ఇది రానుంది. సీఎన్జీ మోడ్‌లో ఇది 76.5 బీహెచ్‌పీ పవర్, 98.5 ఎన్ఎమ్ టార్క్‌ను అందిస్తుంది. అగ్ర శ్రేణి వేరియంట్లలో 10.1-అంగుళాల భారీ టచ్‌స్క్రీన్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, 360-డిగ్రీ కెమెరా, లెవెల్-1 అడాస్ వంటి అడ్వాన్సుడ్ సేఫ్టీ ఫీచర్లను జోడించనుండటం విశేషం.

కియా కారన్స్ క్లావిస్ ఫ్యాక్టరీ ఫిట్టెడ్ సీఎన్జీ

దక్షిణ కొరియా ఆటో సంస్థ కియా తన ప్రాచుర్యం పొందిన కారన్స్ క్లావిస్ ఫ్యాక్టరీ-ఫిట్టెడ్ సీఎన్జీ మోడల్‌ను అధికారికంగా ప్రదర్శించింది. 1.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేసే ఈ కారు సీఎన్జీ మోడ్‌లో 93 బీహెచ్‌పీ పవర్, 123 ఎన్ఎమ్ టార్క్‌ను విడుదల చేస్తుంది. దీనిని 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జత చేశారు. కారు అడుగుభాగంలో 60 లీటర్ల సామర్థ్యం గల భారీ సీఎన్జీ ట్యాంక్‌ను అమర్చారు. అదనపు బరువును తట్టుకునేలా సస్పెన్షన్ వ్యవస్థను మెరుగుపరచడంతో పాటు ఫ్రంట్ డిస్క్ బ్రేకులను సైతం అప్‌గ్రేడ్ చేశారు.

మధ్యతరగతి ప్రయాణికులకు మైలేజ్ మ్యాజిక్

భారతీయ రోడ్లపై నిత్యం ప్రయాణించే కుటుంబాలకు ఈ కొత్త సీఎన్జీ మోడళ్లు ఎంతో మేలు చేయనున్నాయి. అత్యుత్తమ ఇంధన పొదుపు, విస్తృతమైన లోపలి స్థలం, నమ్మకమైన భద్రతా ఫీచర్లు ఉన్న ఈ కార్లు రాబోయే రోజుల్లో మార్కెట్ నంబర్-1 స్థానాల కోసం గట్టి పోటీని ఇవ్వనున్నాయి.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story