Toyota Rumion: కేజీ సీఎన్‌జీకి 26 కిమీ మైలేజ్.. ఎర్టిగా, కారెన్స్‌లకు గట్టి పోటీ ఇచ్చే కారు
Toyota Rumion: భారత ఆటోమొబైల్ మార్కెట్లో సీఎన్‌జీ వాహనాలకు డిమాండ్ రోజురోజుకూ పెరుగుతోంది.
Toyota Rumion CNG
Toyota Rumion: భారత ఆటోమొబైల్ మార్కెట్లో సీఎన్‌జీ వాహనాలకు డిమాండ్ రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా పెద్ద కుటుంబాలకు ఉపయోగపడే 7-సీటర్ విభాగంలో కొత్త కార్లు సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలో మారుతి ఎర్టిగా, కియా క్యారెన్స్‌లకు గట్టి పోటీ ఇస్తూ టోయోటా రుమియాన్ సీఎన్‌జీ మార్కెట్‌లో తన ఏకఛత్రాధిపత్యాన్ని చాటుకుంటోంది. తక్కువ ఖర్చుతో ఎక్కువ మైలేజ్ ఇచ్చే కారుగా ముద్ర వేసుకున్న ఈ 7-సీటర్ వాహనం, అమ్మకాల పరంగా సరికొత్త రికార్డులను సృష్టిస్తూ మిగిలిన కార్లను వెనక్కి నెట్టేసింది.
సీఎన్‌జీ విభాగంలో రికార్డు విక్రయాలు
టోయోటా కంపెనీకి చెందిన సీఎన్‌జీ మోడళ్లలో రుమియాన్ అత్యధిక సేల్స్‌తో మొదటి స్థానంలో నిలిచింది. సెప్టెంబర్ నెలలో ఏకంగా 2,079 సీఎన్‌జీ యూనిట్ల విక్రయాలు నమోదు చేసింది. గతేడాది సెప్టెంబర్‌లో నమోదైన 475 యూనిట్లతో పోలిస్తే ఇది భారీ వృద్ధిని సూచిస్తోంది. టోయోటాకు చెందిన హ్యైరైడర్, టైజర్, గ్లాంజా వంటి మోడళ్లను దాటుకుని రుమియాన్ సీఎన్‌జీ కార్ల విక్రయాల్లో అగ్రస్థానంలో నిలవడం విశేషం. కుటుంబంతో కలిసి ప్రయాణించే వారికి ఇది మొదటి ఎంపికగా మారుతోందని అమ్మకాల గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
కేజీ సీఎన్‌జీకి 26 కిలోమీటర్ల మైలేజ్
మారుతి సుజుకి అర్టిగా ప్లాట్‌ఫామ్‌పైనే టోయోటా రుమియాన్‌ను రూపొందించారు. ఇంజిన్, బాడీ ప్లాట్‌ఫామ్ రెండూ అర్టిగాతో పంచుకున్నప్పటికీ, దీని డిజైన్ లభించే విధానం ప్రీమియం లుక్‌ని ఇస్తుంది. ఈ కారు కేజీ సీఎన్‌జీకి ఏకంగా 26.11 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. భారత్‌లో దీని సీఎన్‌జీ మోడల్ S MT CNG పేరిట సింగిల్ వేరియంట్‌లో అందుబాటులో ఉంది. దీని ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధర రూ. 11.69 లక్షలుగా నిర్ణయించారు.
శక్తివంతమైన ఇంజిన్.. అధునాతన ఫీచర్లు
టోయోటా రుమియాన్ కారులో 1.5-లీటర్ పెట్రోల్ సీఎన్‌జీ ఇంజిన్‌ను అమర్చారు. సీఎన్‌జీ మోడ్‌లో ఈ ఇంజిన్ 87 బిహెచ్‌పి పవర్, 121.5 ఎన్ఎమ్ టార్క్‌ని విడుదల చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో అందుబాటులో ఉంది. ఫీచర్ల విషయానికి వస్తే, 7-ఇంచీల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ కనెక్టివిటీ, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వెనుక సీట్ల కోసం ప్రత్యేక ఏసీ వెంట్స్‌ను అందించారు. 55 కంటే ఎక్కువ ఫీచర్లు ఉన్న టోయోటా ఐ-కనెక్ట్ టెక్నాలజీ కూడా ఇందులో కలదు.
భద్రతకు పెద్దపీట
భద్రత విషయంలో ఈ 7-సీటర్ ఎంపీవీ ఎక్కడా తగ్గేదేలే అంటోంది. ప్రయాణికుల రక్షణ కోసం డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్స్, హిల్ హోల్డ్ అసిస్ట్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ వంటి భద్రతా ఫీచర్లను పొందుపరిచారు. సీటు బెల్ట్ రిమైండర్, వెనుక పార్కింగ్ సెన్సార్లు, చిన్న పిల్లల రక్షణకు ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్లను కూడా ఇందులో ఇచ్చారు. తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ మైలేజ్, మెరుగైన సేఫ్టీ ఫీచర్లు కోరుకునే వారికి టోయోటా రుమియాన్ సరైన ఎంపికగా మారింది.




