Toyota : టయోటా పరువు గంగలో కలిపిన కారు.. క్రాష్ టెస్టులో ఏకంగా సున్నా చుట్టేసింది
Toyota : టయోటా స్టార్లెట్ కారు గ్లోబల్ ఎన్‌క్యాప్ క్రాష్ టెస్ట్‌లో జీరో రేటింగ్ సాధించింది. మారుతి బలేనోకు రీబ్యాజ్డ్ వెర్షన్ అయిన ఈ కారు సేఫ్టీలో ఎందుకు విఫలమైందో తెలుసుకుందాం.
Toyota Starlet
Toyota : టయోటా కార్లంటేనే ధృడత్వానికి, నాణ్యతకు మారుపేరు. కానీ, తాజాగా జరిగిన గ్లోబల్ ఎన్‌క్యాప్ క్రాష్ టెస్ట్‌లో టయోటాకు చెందిన ఒక పాపులర్ కారు ఘోరంగా విఫలమైంది. సేఫ్టీ విషయంలో అత్యంత పేలవమైన ప్రదర్శన కనబరిచి సున్నా మార్కులు పొందింది. ఈ వార్త ఇప్పుడు వాహన రంగంలో హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా భారత వినియోగదారులకు ఈ విషయం ఎందుకు ఆసక్తికరంగా ఉందంటే.. ఈ కారుకు మన దేశంలో విపరీతమైన క్రేజ్ ఉన్న మారుతి సుజుకి బలేనోతో విడదీయలేని సంబంధం ఉంది.
క్రాష్ టెస్ట్‌లో జీరో రేటింగ్ తెచ్చుకున్న కారు పేరు టయోటా స్టార్లెట్. నిజానికి ఇది మారుతి బలేనోకు రీబ్యాజ్డ్ వెర్షన్. అంటే, బలేనో కారునే టయోటా సంస్థ కొద్దిపాటి మార్పులతో సౌతాఫ్రికా, మారిషస్, నైజీరియా వంటి దేశాల్లో స్టార్లెట్ పేరుతో విక్రయిస్తోంది. మన దేశంలో టయోటా సంస్థ బలేనోను గ్లాంజా పేరుతో అమ్ముతున్నట్లే, విదేశాల్లో స్టార్లెట్ పేరుతో అమ్ముతారన్నమాట. లుక్స్ పరంగా, ఇంజిన్ పరంగా ఇది అచ్చం బలేనోలాగే ఉంటుంది.
గ్లోబల్ ఎన్‌క్యాప్ సంస్థ సేఫర్ కార్స్ ఫర్ ఆఫ్రికా ప్రోగ్రామ్ కింద ఈ కారును పరీక్షించింది. అడల్ట్ సేఫ్టీ విషయంలో ఈ కారు 34 పాయింట్లకు గాను కేవలం 19.99 పాయింట్లు మాత్రమే సాధించింది. చైల్డ్ సేఫ్టీ విషయంలో 49 పాయింట్లకు 29.33 పాయింట్లు వచ్చాయి. మొత్తంగా చూస్తే సేఫ్టీ రేటింగ్ సున్నాగా నమోదైంది. అయితే, టెస్ట్ చేసిన కారులో కేవలం 2 ఎయిర్‌బ్యాగ్‌లు మాత్రమే ఉండటం ఈ ఘోర పరాజయానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. అదే మన ఇండియాలో దొరికే బలేనో లేదా గ్లాంజా మోడళ్లలో 6 ఎయిర్‌బ్యాగ్‌లు ఉండటం గమనార్హం.
స్టార్లెట్ కారులో ఆధునిక ఫీచర్లకైతే కొదవ లేదు. వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్, రియర్ పార్క్ డిస్టెన్స్ కంట్రోల్ (PDC), హిల్ అసిస్ట్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి. లోపల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ వంటి హంగులు కూడా కల్పించారు. ఇంటీరియర్ డిజైన్ కూడా చాలా ప్రాక్టికల్‌గా ఉంటుంది. కానీ, ప్రమాదం జరిగినప్పుడు ప్రయాణికులను కాపాడటంలో మాత్రం ఈ కారు విఫలమైందని పరీక్షలు చెబుతున్నాయి. తక్కువ బడ్జెట్ హ్యాచ్‌బ్యాక్ కావడంతో కొన్ని కీలకమైన సేఫ్టీ ఫీచర్లను విదేశీ వెర్షన్‌లో తగ్గించినట్లు కనిపిస్తోంది.




