Toyota: 30 కిమీ మైలేజ్‌తో రికార్డులు తిరగరాస్తున్న టయోటా కారు.. ఏకంగా 30 వేల మంది కొనేశారు

Toyota: భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో టయోటా అర్బన్ క్రూజర్ హైరైడర్ ఊహించని రీతిలో రికార్డులు సృష్టిస్తోంది.

CR Reddy
Published on: 27 Aug 2026 8:56 AM IST
Toyota
X

Toyota

Toyota: భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో టయోటా అర్బన్ క్రూజర్ హైరైడర్ ఊహించని రీతిలో రికార్డులు సృష్టిస్తోంది. లీటరుకు దాదాపు 30 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తూ కస్టమర్లను అమితంగా ఆకట్టుకుంటోంది. 2026 తొలి అర్ధభాగంలో ఏకంగా 30,000 మందికి పైగా ఈ కారును కొనుగోలు చేయడం ఆటోమొబైల్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. టయోటా విక్రయిస్తున్న పెట్రోల్ కార్లలో అర్బన్ క్రూజర్ హైరైడర్ అత్యధికంగా అమ్ముడవుతున్న మోడల్‌గా నిలిచింది. 2026 జనవరి నుంచి జూన్ మధ్య కాలంలో ఈ కారు 30,153 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. గత ఏడాది ఇదే సమయానికి నమోదైన 17,123 యూనిట్లతో పోలిస్తే ఏకంగా 76 శాతం వృద్ధి సాధించింది. పెట్రోల్ మోడళ్లతో పాటు సీఎన్‌జీ, హైబ్రిడ్ వేరియంట్లు అందుబాటులో ఉండటం దీని విజయానికి ప్రధాన కారణంగా నిలిచింది. ఈ కారు ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.10.99 లక్షల నుంచి రూ.20.19 లక్షల వరకు ఉంది.

ఆగస్టు ఆఫర్ల వర్షం, రూ.1.27 లక్షల వరకు లబ్ధి

కస్టమర్లను మరింతగా ఆకట్టుకోవడానికి టయోటా సంస్థ ఈ నెలలో భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. హైబ్రిడ్ మోడల్‌పై రూ.25,000 క్యాష్ డిస్కౌంట్, రూ. 52,500 ఫైనాన్స్ సబ్సిడీ, రూ.50,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ.10,000 స్పెషల్ ఎక్స్ఛేంజ్, రూ.25,000 కార్పొరేట్ ఆఫర్ కలిపి దాదాపు రూ.1.27 లక్షల వరకు ప్రయోజనం చేకూరుస్తోంది. న్యూ డ్రైవ్, సీఎన్‌జీ వేరియంట్లపై కూడా రూ.1.40 లక్షలకు పైగా వివిధ ప్రయోజనాలను అందిస్తోంది.

అద్భుతమైన మైలేజ్, పవర్‌ఫుల్ ఇంజిన్

ఈ కారులోని సీఎన్‌జీ మోడల్ 1.5-లీటర్ కే-సిరీస్ ఇంజిన్‌తో వస్తుంది. ఇది 86.63 బిహెచ్‌పి పవర్, 121.5 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో వచ్చే సీఎన్‌జీ వెర్షన్ కేజీకి 26.6 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. ఇక అందరినీ ఆశ్చర్యపరిచేలా స్ట్రాంగ్-హైబ్రిడ్ వెర్షన్‌లోని 0.76 కిలోవాట్ అవర్ లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ సహాయంతో లీటరుకు 29.97 కిలోమీటర్ల ఏఆర్‌ఏఐ ధృవీకరించిన మైలేజ్‌ను అందిస్తోంది.

సురక్షితమైన ఫీచర్లు, ఆధునిక సాంకేతికత

కారు లోపల సాంకేతిక సదుపాయాలకు కొదవ లేదు. ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే సపోర్ట్ చేసే 9-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్‌ఫోటైన్‌మెంట్ సిస్టమ్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, ఎల్ఈడీ హెడ్‌లాంప్స్, 17-ఇంచ్ అలాయ్ వీల్స్ అమర్చారు. భద్రతకు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఈబీడీతో కూడిన ఏబీఎస్, ఈఎస్పీ (ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్) అందించారు. టయోటా ఐ-కనెక్ట్ సాఫ్ట్‌వేర్ డ్రైవింగ్ అనుభవాన్ని మరింత సులభతరం చేస్తుంది.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story