TVS : ఈ స్కూటరుకు బ్రహ్మరథం పడుతున్న జనాలు.. ఏకంగా 10 లక్షల మంది కొనేశారు
TVS : టీవీఎస్ మోటార్స్ భారత ఈవీ మార్కెట్లో 10 లక్షల ఎలక్ట్రిక్ స్కూటర్ల అమ్మకాలతో చారిత్రాత్మక రికార్డు సృష్టించింది. ఓలా, బజాజ్, ఏథర్ కంపెనీలను వెనక్కి నెట్టి నంబర్-1 గా నిలిచింది.
TVS iQube
TVS : కొన్నేళ్ల క్రితం వరకు భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలు అంటే భవిష్యత్తులో వచ్చే టెక్నాలజీ అని మాత్రమే అందరూ భావించేవారు. రోజువారీ వాడకానికి ఇవి సెట్ అవ్వవని చాలా మంది అనుకున్నారు. కానీ ఇప్పుడు సీన్ పూర్తిగా మారిపోయింది. ప్రతి నెల ఎలక్ట్రిక్ స్కూటర్లు, బైక్‌ల అమ్మకాలు సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. ఈ విప్లవాత్మక మార్పునకు దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టీవీఎస్ మోటార్ సాధించిన విజయమే ఒక పెద్ద ఉదాహరణ. తాజాగా ఈ కంపెనీ ఏకంగా 10 లక్షల ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాల మైలురాయిని అందుకొని సరికొత్త చరిత్ర సృష్టించింది.
టీవీఎస్ కంపెనీ జనవరి 2020లో తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ TVS iQubeతో ఈవీ మార్కెట్‌లోకి అడుగుపెట్టింది. ప్రారంభంలో కేవలం కొన్ని నగరాల్లోనే అందుబాటులో ఉండటం వల్ల అమ్మకాలు చాలా నెమ్మదిగా సాగాయి. ఆ సమయంలో కంపెనీ మార్కెట్ షేర్ కేవలం 1 శాతంగా మాత్రమే ఉండేది. మొదటి లక్ష వాహనాలను విక్రయించడానికి టీవీఎస్ కంపెనీకి దాదాపు 3 ఏళ్ల సమయం పట్టింది. కానీ ఆ తర్వాత వినియోగదారుల్లో నమ్మకం పెరగడం, డీలర్ నెట్‌వర్క్ దేశవ్యాప్తంగా విస్తరించడంతో అమ్మకాల స్పీడ్ అంచనాలకు మించి పెరిగింది. తర్వాతి లక్ష స్కూటర్లు కేవలం 10 నెలల్లోనే అమ్ముడవడం గమనార్హం.
2023, 2024లో అంతర్జాతీయంగా సప్లై చైన్ సమస్యల వల్ల ఈవీ పరిశ్రమ వృద్ధి కాస్త నెమ్మదించినప్పటికీ.. టీవీఎస్ మాత్రం వెనక్కి తగ్గలేదు. ఏప్రిల్ 2025 నాటికి 3 లక్షల అమ్మకాల మార్కును దాటిన ఈ కంపెనీ, ఆ తర్వాత సరికొత్త ఈవీ ప్లాట్‌ఫారమ్‌లు, మోడళ్లను మార్కెట్లోకి తెచ్చింది. ముఖ్యంగా అక్టోబర్ నుంచి డిసెంబర్ 2025 మధ్య కాలంలో కేవలం మూడు నెలల వ్యవధిలోనే 7 లక్షల నుంచి 8 లక్షల యూనిట్ల మార్కును దాటేసి రికార్డు వేగంతో దూసుకెళ్లింది. ఈ క్రమబద్ధమైన వృద్ధితో 2025 చివరి నాటికి బజాజ్, ఏథర్, ఓలా వంటి గట్టి పోటీదారులను వెనక్కి నెట్టి దేశంలోనే అతిపెద్ద ఈవీ తయారీ సంస్థగా అవతరించింది.
ప్రస్తుతం 2026లో టీవీఎస్ 10 లక్షల ఈవీ అమ్మకాల చారిత్రాత్మక రికార్డును అధికారికంగా పూర్తి చేసుకుంది. గడిచిన మే 2026లో కంపెనీ ఏకంగా 51,605 ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించింది. టీవీఎస్ చరిత్రలోనే ఇది అత్యధిక నెలవారీ అమ్మకాలు కావడం విశేషం. భారతదేశ ఎలక్ట్రిక్ టూ-వీలర్ మార్కెట్ చరిత్రలోనే ఇది రెండో అతిపెద్ద నెలవారీ విక్రయంగా రికార్డు సృష్టించింది. 2020లో కేవలం 1 శాతంగా ఉన్న కంపెనీ మార్కెట్ వాటా ప్రస్తుతం 20 శాతానికి పైగా పెరిగిపోయింది.
ఈ 2026 సంవత్సరంలో ఇప్పటివరకు టీవీఎస్ కంపెనీ 2.19 లక్షలకు పైగా ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించింది. ఇదే వేగం కొనసాగి, రాబోయే దసరా, దీపావళి పండుగ సీజన్లలో డిమాండ్ మరింత పెరిగితే.. ఈ ఏడాది ఒక్కరినే ఏకంగా 5 లక్షల ఈవీ అమ్మకాల కొత్త రికార్డును టీవీఎస్ అందుకోవడం ఖాయమని నిపుణులు అంచనా వేస్తున్నారు. దేశంలో పెరుగుతున్న పెట్రోల్ ధరలు, గల్ఫ్ దేశాలలో ఉన్న ఉద్రిక్తతల వల్ల చమురు భయాలు ఎక్కువ కావడంతో.. సామాన్యులు లాంగ్ టర్మ్ ప్రయోజనాల కోసం ఎలక్ట్రిక్ వాహనాల వైపే మొగ్గు చూపుతున్నారు.




