TVS Orbiter vs Hero Vida.. సిటీ రైడర్లకు ఏ ఈవీ స్కూటర్ బెస్ట్.?
భారతదేశంలో ద్విచక్ర వాహనదారుల ఆలోచనా విధానంలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి. నిత్యం నగరాల్లో ప్రయాణించే పసింజర్లు ఇప్పుడు హెవీ మోటార్‌సైకిళ్ల కంటే
TVS Orbiter vs Hero Vida
భారతదేశంలో ద్విచక్ర వాహనదారుల ఆలోచనా విధానంలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి. నిత్యం నగరాల్లో ప్రయాణించే పసింజర్లు ఇప్పుడు హెవీ మోటార్‌సైకిళ్ల కంటే ఎలక్ట్రిక్ స్కూటర్ల వైపే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. పెట్రోల్ ధరల భారం తగ్గడమే కాకుండా, నగర రద్దీలో సులువుగా ప్రయాణించడానికి ఇవి ఎంతో అనుకూలంగా ఉండటమే ఇందుకు కారణం. మీరు కూడా తక్కువ నిర్వహణ ఖర్చుతో, అత్యాధునిక ఫీచర్లు కలిగిన ఈవీ స్కూటర్ కోసం చూస్తుంటే టీవీఎస్ ఆర్బిటర్ (TVS Orbiter) , హీరో విడా (Hero Vida) బెస్ట్ ఆప్షన్లుగా నిలుస్తాయి.
బ్యాటరీ సామర్థ్యం, మైలేజ్ రేంజ్
డెయిలీ కామ్యూటర్ల అవసరాలకు తగ్గట్లుగా ఈ రెండు స్కూటర్లను డిజైన్ చేశారు. టీవీఎస్ ఆర్బిటర్‌లో పెద్ద ఫిక్స్డ్ బ్యాటరీ ప్యాక్‌ను అందించారు. దీని బేస్ వేరియంట్ 1.8 kWh బ్యాటరీతో 86 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుండగా, లాంగ్ రేంజ్ వేరియంట్ 3.1 kWh బ్యాటరీతో ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 158 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది.
మరోవైపు హీరో విడా స్కూటర్లలో రిమూవబుల్ (పోర్టబుల్) బ్యాటరీ సదుపాయం ఉండటం విశేషం. ఇళ్లతో పాటు అపార్ట్‌మెంట్లలో నివసించే వారు బ్యాటరీని సులువుగా బయటకు తీసి ఛార్జ్ చేసుకోవచ్చు. విడా లైనప్‌లో వేరియంట్‌ను బట్టి 2.2 kWh నుండి 4.4 kWh సామర్థ్యం గల బ్యాటరీలు లభిస్తాయి. ఇవి ఛార్జింగ్‌ను బట్టి 90 కిలోమీటర్ల నుంచి అత్యధికంగా 187 కిలోమీటర్ల రేంజ్ వరకు ఆఫర్ చేస్తున్నాయి.
రైడింగ్ ఫీచర్లు, రైడర్ సేఫ్టీ
రోజువారీ ప్రయాణాన్ని సులభతరం చేసేందుకు ఈ స్కూటర్లలో అత్యాధునిక టెక్నాలజీని జోడించారు. టీవీఎస్ ఆర్బిటర్‌లో ట్రాఫిక్ , హైవే ప్రయాణాలకు ఉపయోగపడే క్రూయిజ్ కంట్రోల్, ఎత్తుపల్లాల బాటలో ఉపయోగపడే హిల్-హోల్డ్ అసిస్ట్ , ఇరుకైన ప్రదేశాల్లో సహాయపడే రివర్స్ మోడ్ ఫీచర్లు ఉన్నాయి. అంతేకాకుండా స్మార్ట్‌ఎక్స్‌కనెక్ట్ బ్లూటూత్ డిస్‌ప్లే ద్వారా టర్న్-బై-టర్న్ నావిగేషన్, కాల్ అలర్టులు, జియో-ఫెన్సింగ్ , యాంటీ థెఫ్ట్ ట్రాకింగ్ వంటి భద్రతా ఫీచర్లు లభిస్తాయి. ఇందులో 34 లీటర్ల భారీ అండర్‌సీట్ స్టోరేజ్ సైతం ఉండటంతో సామాన్లు పెట్టుకోవడం మరింత సులువవుతుంది.
హీరో విడా స్కూటర్ విషయానికి వస్తే, ఇందులో 7 ఇంచీల విశాలమైన కలర్ టీఎఫ్‌టీ టచ్‌స్క్రీన్ డిస్‌ప్లేను అందించారు. విడా వరల్డ్ యాప్ సహాయంతో స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, లైవ్ వెహికల్ ట్రాకింగ్, రైడింగ్ అనలిటిక్స్ , రిమోట్ ఇమ్మోబిలైజేషన్ వంటి అడ్వాన్స్డ్ ఫీచర్లను వాడవచ్చు. వీటితో పాటు కీ-లెస్ ఎంట్రీ, ఫాలో-మీ-హోమ్ లైట్స్, ఓవర్-ది-ఎయిర్ (OTA) సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ లభిస్తాయి. విభిన్న రకాల రోడ్లకు అనుగుణంగా ఈకో, రైడ్, స్పోర్ట్ , బూస్ట్ వంటి రైడింగ్ మోడ్లను కూడా ఇందులో ఎంచుకోవచ్చు.
ధరల వివరాలు
బడ్జెట్ పరంగా చూస్తే ఈ రెండు స్కూటర్లు వేర్వేరు వేరియంట్లలో అందుబాటులో ఉన్నాయి. టీవీఎస్ ఆర్బిటర్ V1 బేస్ మోడల్ ధర సుమారు రూ. 1,00,650 నుంచి ప్రారంభమవుతుండగా, రేంజ్ ఎక్కువ ఇచ్చే ఆర్బిటర్ V2 టాప్ వేరియంట్ ధర రూ. 1,19,480 (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది.
హీరో విడా లైనప్‌లో అనేక వేరియంట్లు ఉన్నాయి. ఎంట్రీ లెవెల్ విడా VX2 Go మోడల్ ధర రూ. 84,999 నుండి ప్రారంభమవుతుండగా, మిడ్ వేరియంట్లు రూ. 95,000 నుంచి రూ. 1,30,000 మధ్యలో లభిస్తున్నాయి. అత్యుత్తమ బ్యాటరీ ప్యాక్ , అత్యధిక రేంజ్ కలిగిన టాప్-ఎండ్ విడా VX2 ప్లస్ (4.4 kWh) మోడల్ ధర రూ. 1,43,990 నుంచి రూ. 1,50,990 (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది. మీ బడ్జెట్ , నిత్యం మీరు ప్రయాణించే దూరాన్ని బట్టి వీటిలో తగిన మోడల్‌ను ఎంచుకోవచ్చు.




