Ultraviolette: ఒక్కసారి ఛార్జ్ చేస్తే 343 కి.మీ రేంజ్.. రాడార్ టెక్నాలజీతో వచ్చేసిన నయా బైక్
అల్ట్రావయోలెట్ తన పవర్‌ఫుల్ ఎలక్ట్రిక్ బైక్ X-47 వీనమ్ డెలివరీలను దేశవ్యాప్తంగా ప్రారంభించింది. సింగిల్ ఛార్జ్‌తో 343 కిలోమీటర్ల రేంజ్ ఇచ్చే ఈ బైక్ ధర రూ.2.65 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు ఉంది.
Ultraviolette X47 Venom
Ultraviolette: ఎలక్ట్రిక్ బైక్ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'అల్ట్రావయోలెట్ X-47 వీనమ్ డెలివరీలు దేశవ్యాప్తంగా మొదలయ్యాయి. అక్టోబర్ 22, 2026న ఈ బైక్‌ను లాంచ్ చేసిన కంపెనీ, ముందుగా ప్రకటించినట్లుగానే నవంబర్‌లో తన రిటైల్, ఎక్స్‌పీరియన్స్ సెంటర్ల ద్వారా కస్టమర్లకు అందజేయడం ప్రారంభించింది. బుకింగ్స్‌కు అద్భుతమైన స్పందన వచ్చిందని కంపెనీ తెలిపినా, కచ్చితమైన సంఖ్యను మాత్రం వెల్లడించలేదు. కొత్త VX-100 ఆర్కిటెక్చర్‌పై నిర్మించిన ఈ బైక్ పాత మోడల్ కంటే పెద్ద బ్యాటరీ, మెరుగైన పర్ఫార్మెన్స్, తక్కువ బరువుతో రావడం విశేషం.
రూ.2.65 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు ధరలు
X-47 వీనమ్ మొత్తం నాలుగు వేరియంట్లలో లభిస్తోంది. వీటి ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధరలు మొదటి 5,000 యూనిట్లకు మాత్రమే వర్తిస్తాయని కంపెనీ స్పష్టం చేసింది. వేరియంట్ల వారీగా ధరలు, రేంజ్ ఇలా ఉన్నాయి:
X-47 వీనమ్ (7.5 kWh): 227 కి.మీ రేంజ్ – రూ.2,65,000
X-47 వీనమ్+ (7.5 kWh): 227 కి.మీ రేంజ్ – రూ.3,15,000
X-47 వీనమ్ రికాన్ (11 kWh): 343 కి.మీ రేంజ్ – రూ.3,75,000
X-47 వీనమ్ రికాన్+ (11 kWh): 343 కి.మీ రేంజ్ – రూ.4,00,000
పాత మోడళ్లతో పోలిస్తే వీనమ్ ధర రూ.1,000, వీనమ్+ ధర రూ.6,000, రికాన్ ధర రూ.16,000 పెరిగాయి. కానీ టాప్ వేరియంట్ వీనమ్ రికాన్+ ధర మాత్రం పాత దానికంటే (రూ.4.09 లక్షలు) రూ.9,000 తక్కువగా ఉండటం గమనార్హం.
సింగిల్ ఛార్జ్‌తో 343 కి.మీ రేంజ్
అప్‌డేటెడ్ స్పెసిఫికేషన్ల ప్రకారం, చిన్న 7.5 kWh బ్యాటరీ మోడల్ బరువు 180 కిలోలు కాగా, ఐడీసీ సర్టిఫైడ్ రేంజ్ 227 కిలోమీటర్లు ఇస్తుంది. పెద్ద 11 kWh బ్యాటరీ మోడల్ బరువు 195 కిలోలు ఉండగా, ఏకంగా 343 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుంది. పాత X-47 మోడళ్ల బరువు (197 కిలోలు, 208 కిలోలు)తో పోలిస్తే ఈ కొత్త వీనమ్ బరువు వరుసగా 17 కిలోలు, 13 కిలోలు తగ్గింది. బరువు తగ్గి, బ్యాటరీ సామర్థ్యం పెరగడంతో బైక్ పనితీరు మరింత మెరుగైంది.
5.9 సెకన్లలోనే 100 కి.మీ వేగం
వేగం విషయంలోనూ X-47 వీనమ్ దూసుకుపోతుంది. దీని రెండు బ్యాటరీ వేరియంట్ల టాప్ స్పీడ్ గంటకు 155 కిలోమీటర్లు కాగా, కేవలం 5.9 సెకన్లలోనే 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. పాత మోడల్ టాప్ స్పీడ్ 145 km/h ఉండేది, 100 స్పీడ్ అందుకోవడానికి 8 సెకన్లకు పైగా పట్టేది. ఈ కొత్త బైక్ 30 kW (దాదాపు 40 hp) పీక్ పవర్‌ను, వెనుక చక్రంపై 550 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
7-అంగుళాల టచ్‌స్క్రీన్, ఫాస్ట్ ఛార్జింగ్
సూపర్ కార్లలో ఉండే హైటెక్ సేఫ్టీ ఫీచర్లను ఈ బైక్‌లో ఇచ్చారు. ఇందులోని UV హైపర్‌సెన్స్ రాడార్ ఇంటెలిజెన్స్ ద్వారా బ్లైండ్-స్పాట్ మానిటరింగ్, లేన్-చేంజ్ అసిస్టెన్స్, ఓవర్‌టేక్ అలర్ట్, రియర్-కొలిజన్ అలర్ట్ లాంటి ఫీచర్లు పనిచేస్తాయి. వీటితో పాటు ఇంటర్‌ఫేస్ Xపై నడిచే 7-అంగుళాల టచ్‌స్క్రీన్, ఇన్-బిల్ట్ మ్యాపిల్స్ నావిగేషన్, రియర్-కెమెరా పార్క్ అసిస్ట్, క్రూజ్ కంట్రోల్ ఉన్నాయి. బైక్ కదిలినా, పడిపోయినా, టో చేసినా వెంటనే అలర్ట్ వస్తుంది. 100V ఆర్కిటెక్చర్‌పై నడిచే ఈ బైక్ 12 kW DC ఫాస్ట్ ఛార్జింగ్‌కు కూడా సపోర్ట్ చేస్తుంది.




