Upcoming Cars: కొత్త కారు కొనాలనుకుంటున్నారా? నవంబర్‌లో రాబోతున్న 7 మోడల్స్.. వాటి ధరలు ఇవే
Upcoming Cars: భారత కార్ల మార్కెట్‌లో నవంబర్ 2026లో కొత్త మోడళ్ల సందడి నెలకొనే అవకాశం ఉంది.
Mercedes Benz
Upcoming Cars: భారత కార్ల మార్కెట్‌లో నవంబర్ 2026లో కొత్త మోడళ్ల సందడి నెలకొనే అవకాశం ఉంది. ముఖ్యంగా ఎలక్ట్రిక్ కార్లపై ఆసక్తి పెరుగుతున్న నేపథ్యంలో పలు కంపెనీలు కొత్త ఈవీలను తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. బడ్జెట్ ధరలో చిన్న ఎలక్ట్రిక్ కార్ల నుంచి కోటి రూపాయలకు పైగా ధర పలికే లగ్జరీ MPV వరకు మొత్తం ఏడు మోడళ్లు చర్చలో ఉన్నాయి. అయితే వీటిలో కొన్ని కార్ల లాంచ్ తేదీలు ఇంకా ఖరారు కాలేదు. మరికొన్ని మోడళ్లు 2027లో వచ్చే అవకాశం కూడా ఉంది.
1. మెర్సిడెస్ బెంజ్ GLC ఎలక్ట్రిక్
భారత లగ్జరీ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ విభాగంలో మెర్సిడెస్ బెంజ్ GLC ఎలక్ట్రిక్ మోడల్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఈ వాహనాన్ని నవంబర్ 4న భారత మార్కెట్లో అధికారికంగా విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందులో 94kWh కెపాసిటీ కలిగిన బ్యాటరీ ప్యాక్, డ్యూయల్ ఎలక్ట్రిక్ మోటార్లు అలాగే ఆల్-వీల్ డ్రైవ్ (AWD) సిస్టమ్ పొందుపరిచారు. WLTP ప్రామాణిక పరీక్షల ప్రకారం ఒకే ఒక్కసారి ఛార్జ్ చేస్తే సుమారు 715 కిలోమీటర్ల సుదీర్ఘ దూరం ప్రయాణించవచ్చని భావిస్తున్నారు. అత్యంత ప్రైవేట్, డిజిటల్ స్క్రీన్లు, అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సేఫ్టీ ఫీచర్లతో రానున్న ఈ కారు అంచనా ఎక్స్-షోరూమ్ ధర రూ. 80 లక్షల నుంచి రూ. 85 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంది.
2. డెన్జా D9
ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ BYDకి చెందిన ప్రీమియం లగ్జరీ బ్రాండ్ 'డెన్జా' నుంచి D9 ఎలక్ట్రిక్ ఎమ్‌పీవీ భారత మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతోంది. నవంబర్ 13న ఈ కారు లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. 7-సీటర్ లేఅవుట్‌తో రానున్న ఈ మోడల్‌లో వెనుక సీట్ల ప్రయాణికులకు రాచరికపు అనుభూతిని అందించేలా మసాజ్ ఫంక్షన్ ఉన్న కెప్టెన్ సీట్లు, భారీ పనోరమిక్ సన్‌రూఫ్, ప్రీమియం ఆడియో సిస్టమ్ వంటివి అమర్చారు. పెద్ద బ్యాటరీ ప్యాక్‌తో వస్తున్న ఈ లగ్జరీ ఎమ్‌పీవీ అంచనా ధర రూ. 1 కోటి నుంచి రూ. 1.10 కోట్ల వరకు ఉండే అవకాశం ఉంది.
3. JSW చెరీ iCar V23
రెట్రో స్టైలింగ్, బాక్సీ ఆఫ్‌రోడ్ డిజైన్ ఇష్టపడే ఆటోమొబైల్ ప్రేమికులను లక్ష్యంగా చేసుకుని JSW చెరీ iCar V23 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ వస్తోంది. ఈ మోడల్‌ను నవంబర్ 15న విడుదల చేయవచ్చని పరిశ్రమ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఎత్తైన ఎస్‌యూవీ ఆకారం, ఎల్‌ఈడీ రౌండ్ హెడ్‌లైట్లు, డిజిటల్ ఇన్‌ఫోటైన్‌మెంట్ టచ్‌స్క్రీన్ ఈ కారు ప్రధాన ఆకర్షణలుగా ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో టూ-వీల్ డ్రైవ్ (2WD), ఆల్-వీల్ డ్రైవ్ (AWD) ఆప్షన్లలో లభిస్తుండగా, భారతీయ ఎడిషన్ వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. దీని అంచనా ధర రూ. 20 లక్షల నుంచి రూ. 25 లక్షల వరకు ఉంటుంది.
4. జేకూ J5 EV
కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో కొత్త డిజైన్‌తో వస్తున్న జేకూ J5 EV మార్కెట్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. నవంబర్ నెలలోనే విడుదల కానుందని భావిస్తున్న ఈ మోడల్‌లో విశాలమైన కేబిన్ స్పేస్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, అత్యాధునిక టచ్‌స్క్రీన్ ఫీచర్లు పొందుపరిచారు. పట్టణ ప్రయాణాలకు, వీకెండ్ డ్రైవ్‌లకు అనుకూలంగా ఉండే ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ అంచనా ధర సుమారు రూ. 20 లక్షలుగా నిర్ణయించే అవకాశం ఉంది.
5. విన్ఫాస్ట్ VF3
వియత్నాం ఆటో దిగ్గజం విన్ఫాస్ట్ నుంచి మినీ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ 'VF3' నవంబర్ 25న భారత రోడ్లపైకి అడుగుపెట్టే సూచనలు కనిపిస్తున్నాయి. చిన్న సైజు, క్యూట్ బాక్సీ డిజైన్, టైట్ పార్కింగ్ ప్రదేశాల్లో సులభంగా హ్యాండిల్ చేసే వీలుండడం ఈ కారుకి పెద్ద ప్లస్ పాయింట్. రద్దీగా ఉండే సిటీ ప్రయాణాలకు అనువుగా రూపొందించిన ఈ పాకెట్ ఫ్రెండ్లీ మినీ ఎస్‌యూవీ ప్రారంభ ధర రూ. 10 లక్షల పరిధిలో అందుబాటులోకి రానుంది.
6. మహీంద్రా థార్ E
భారతదేశపు మోస్ట్ మోస్ట్ అవైటెడ్ ఆఫ్‌రోడర్ మహీంద్రా థార్ ఎలక్ట్రిక్ వెర్షన్ 'థార్ E' పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఐకానిక్ థార్ మజిక్యులర్ రూపాన్ని నిలబెట్టుకుంటూనే పూర్తి ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్, 4x4 ఆఫ్‌రోడింగ్ సామర్థ్యాలను ఇందులో జోడించనున్నారు. దీని అంచనా ధర రూ. 20 లక్షల నుంచి రూ. 25 లక్షల మధ్య ఉండే అవకాశం ఉన్నప్పటికీ, కంపెనీ అధికారిక లాంచ్ తేదీపై స్పష్టత ఇవ్వలేదు. ఇది నవంబర్ లేదా 2027 నాటికి రోడ్లపైకి రావచ్చు.
7. హ్యుందాయ్ HE1i
హ్యుందాయ్ సంస్థ సరసమైన ధరలో ఎంట్రీ-లెవెల్ ఎలక్ట్రిక్ విభాగాన్ని ఆక్రమించేందుకు 'HE1i' (కోడ్‌నేమ్) కాంపాక్ట్ ఎలక్ట్రిక్ కారును తీర్చిదిద్దుతోంది. కనెక్టెడ్ కార్ ఫీచర్లు, డిజిటల్ డిస్‌ప్లేలు, అడ్వాన్స్డ్ ADAS సేఫ్టీ సిస్టమ్‌తో ఈ కారు రూపుదిద్దుకుంటోంది. ప్రారంభ ధర సుమారు రూ. 10 లక్షలుగా ఉండే అవకాశం ఉన్న్పటికీ, అధికారిక లాంచ్ ప్రకటన నవంబర్ చివరిలో లేదా 2027 ప్రారంభంలో వచ్చే అవకాశం ఉంది.




