CNG Cars: కొత్త సీఎన్‌జీ కారు కొనే ప్లాన్ ఉందా? కాస్త ఆగండి.. త్వరలో రాబోతున్న టాప్ మోడల్స్ ఇవే

CNG Cars: దేశీయ ఆటోమొబైల్ మార్కెట్లో సీఎన్‌జీ కార్లకు రోజురోజుకూ ఆదరణ విపరీతంగా పెరుగుతోంది.

CR Reddy
Published on: 12 Sept 2026 11:05 AM IST
CNG Cars
X

CNG Cars

CNG Cars: దేశీయ ఆటోమొబైల్ మార్కెట్లో సీఎన్‌జీ కార్లకు రోజురోజుకూ ఆదరణ విపరీతంగా పెరుగుతోంది. ఇంధన ధరల భారం నుంచి ఉపశమనం పొందేందుకు వాహనదారులు ప్రత్యామ్నాయ ఇంధన కార్ల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ కార్ల తయారీ సంస్థలు సరికొత్త సీఎన్‌జీ ఎస్‌యూవీలను మార్కెట్లోకి ప్రవేశపెట్టేందుకు వేగంగా అడుగులు వేస్తున్నాయి. భారతీయ ఆటోమొబైల్ పరిశ్రమలో ప్రత్యామ్నాయ ఇంధన వాహనాల వాటా వేగంగా విస్తరిస్తోంది. ప్రయాణీకుల వాహనాల మొత్తం రిటైల్ విక్రయాలలో ప్రత్యామ్నాయ ఇంధన కార్ల వాటా 41.9 శాతానికి చేరుకోగా, అందులో సీఎన్‌జీ వాహనాల విక్రయాలే ఏకంగా 25.2 శాతంగా నమోదు కావడం గమనార్హం. ప్రస్తుతం మార్కెట్లో మారుతి సుజుకి సంస్థకు చెందిన ఎర్టిగా, బ్రెజా, ఫ్రాంక్స్, గ్రాండ్ విటారా వంటి మోడళ్లు సీఎన్‌జీ విభాగంలో మంచి ఆదరణ పొందుతున్నాయి. అయితే ఈ ఆధిపత్యానికి సవాలు విసురుతూ కియా, హ్యుందాయ్, టాటా సంస్థలు సరికొత్త మోడళ్లను మార్కెట్లోకి తీసుకువస్తున్నాయి.

కియా కారెన్స్, కారెన్స్ క్లావిస్ సీఎన్‌జీ మోడల్స్

దక్షిణ కొరియా ఆటోమొబైల్ దిగ్గజం కియా తమ పాపులర్ MPV మోడల్ అయిన కారెన్స్ తో పాటు కారెన్స్ క్లావిస్ వేరియంట్లలో ఫ్యాక్టరీ ఫిట్టెడ్ సీఎన్‌జీ ఆప్షన్లను ప్రవేశపెడుతోంది. వీటిలో 1.5 లీటర్ నాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌ను అమర్చారు. ఇది 93 బీహెచ్‌పీ పవర్, 123 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ వాహనాలు కేజీ సీఎన్‌జీకి సుమారు 22 కిలోమీటర్ల నుంచి 25 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తాయని అంచనా వేస్తున్నారు.

హ్యుందాయ్ బయోన్ సీఎన్‌జీ ఎంట్రీ

హ్యుందాయ్ సంస్థ తమ సరికొత్త మిడ్‌సైజ్ ఎస్‌యూవీ బయోన్ ఆధారిత మోడల్‌ను త్వరలోనే లాంచ్ చేయనుంది. ఇందులో ప్రజాదరణ పొందిన క్రెటా కారులోని 1.5 లీటర్ నాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌ను ఫ్యాక్టరీ ఫిట్టెడ్ సీఎన్‌జీ కిట్‌తో అందించనున్నారు. కారు అడుగు భాగంలో సీఎన్‌జీ ట్యాంక్ అమర్చడం ద్వారా లగేజ్ నిల్వ చేయడానికి తగినంత బూట్ స్పేస్ లభించేలా డిజైన్ చేస్తున్నారు. 4 మీటర్ల కంటే ఎక్కువ పొడవు ఉన్న విభాగంలో హ్యుందాయ్ అందిస్తున్న తొలి సీఎన్‌జీ మోడల్ ఇదే కావడం విశేషం.

ట్విన్ సిలిండర్ టెక్నాలజీతో టాటా కర్వ్ సీఎన్‌జీ

టాటా మోటార్స్ తమ ప్రసిద్ధ కూపే ఎస్‌యూవీ కర్వ్‌లో సీఎన్‌జీ వేరియంట్‌ను మార్కెట్లోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది. పంచ్ సీఎన్‌జీ తరహాలోనే ఇందులో కూడా టాటా పేటెంట్ పొందిన ట్విన్ సిలిండర్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. దీనివల్ల డిక్కీలో లగేజ్ పెట్టుకోవడానికి విస్తారమైన స్థలం లభిస్తుంది. 1.2 లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్‌తో రానున్న ఈ మోడల్ పవర్, మైలేజ్ రెండింటిలోనూ వినియోగదారులను ఆకట్టుకోనుంది. కొత్త టెక్నాలజీ, ఎక్కువ బూట్ స్పేస్, మెరుగైన మైలేజ్‌తో రాబోతున్న ఈ కొత్త సీఎన్‌జీ కార్లు వాహనదారులకు అద్భుతమైన ఎంపికగా మారనున్నాయి. కాబట్టి కొత్త సీఎన్‌జీ కారు కొనుగోలు చేయాలనుకునే వారు కొన్ని రోజులు వేచి చూడటం మంచిది.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.