సింగిల్ ఛాసిస్.. రూ.382 కోట్ల భారీ ధర.. షాకిస్తోన్న ఫెరారీ సూపర్ కార్..!

Ferrari Electric Car: ఆటోమొబైల్ రంగంలో సరికొత్త చరిత్ర సృష్టిస్తూ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఫెరారీ తన తొలి ఆల్-ఎలక్ట్రిక్ సూపర్ కార్ ను మార్కెట్లోకి తీసుకొచ్చింది.

Venkat
Published on: 18 Aug 2026 9:51 PM IST
Ferrari Electric Car
X

సింగిల్ ఛాసిస్.. రూ.382 కోట్ల భారీ ధర.. షాకిస్తోన్న ఫెరారీ సూపర్ కార్..!

Ferrari Electric Car: ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం ఫెరారీ ఇప్పటివరకు తమ శక్తివంతమైన పెట్రోల్ ఇంజిన్ కార్లతో ప్రపంచాన్ని ఏలింది. అయితే కాలానికి తగినట్టుగా మారుతూ ఆ సంస్థ తాజాగా తన మొట్టమొదటి ఆల్-ఎలక్ట్రిక్ సూపర్‌కార్ 'Ferrari Luce' ను రూపొందించింది. ఈ సరికొత్త కారు మొదటి ప్రొడక్షన్ యూనిట్ అయిన 'ఛాసిస్ 0' ను ఇటీవల జరిగిన వేలంలో ఉంచారు. మొదట్లో ఈ కారు ధర సుమారు 1.1 మిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా వేశారు. కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న బిలియనీర్ల మధ్య జరిగిన హోరాహోరీ పోటీ కారణంగా దీని ధర ఏకంగా 40 మిలియన్ డాలర్లకు అంటే మన భారతీయ కరెన్సీలో సుమారు రూ.382 కోట్లకు చేరుకుంది. ఈ వేలం ద్వారా వచ్చిన మొత్తం సొమ్మును 'ద ఫెరారీ ఫౌండేషన్' ద్వారా భవిష్యత్ విద్యారంగ అవసరాలకు వినియోగించనున్నారు.

ఆపిల్ మాజీ డిజైనర్ ప్రత్యేక రూపకల్పన..

ఈ అత్యాధునిక ఎలక్ట్రిక్ కారు రూపకల్పన వెనుక ఆపిల్ సంస్థ మాజీ చీఫ్ డిజైన్ ఆఫీసర్ జోనీ ఐవ్ హస్తం ఉంది. ఆయనకు చెందిన 'లవ్‌ఫ్రమ్' డిజైన్ స్టూడియోతో కలిసి ఫెరారీ ఈ కారును అత్యంత వినూత్నంగా తీర్చిదిద్దింది. కారు బాహ్య భాగంలో ప్రత్యేకమైన మడ్రెపెర్లా సెమీ-గ్లోస్ పెయింట్ ను వాడారు. ఇది కాంతి పడే కోణాన్ని బట్టి ఆకుపచ్చ అలాగే వివిధ రంగుల్లో మారుతూ కనువిందు చేస్తుంది. ఇంటీరియర్ విషయానికి వస్తే స్విట్జర్లాండ్‌కు చెందిన అత్యుత్తమ లెదర్ తో పాటు కస్టమ్ వీల్స్ అందించారు. ఈ పెయింటింగ్, కస్టమైజేషన్ ప్రక్రియ అత్యంత క్లిష్టంగా ఉండటం వల్ల ఏ రెండు లూస్ కార్లు కూడా ఒకేలా ఉండవు.

కోట్లు పోసి కొనుగోలు చేసినప్పటికీ ఈ కారు డెలివరీ కోసం కొనుగోలుదారుడు 2027 తొలి త్రైమాసికం వరకు వేచి ఉండాలి. డెలివరీకి ముందు ఇటలీలోని మారనెలో నగరంలో ఉన్న ఫెరారీ ప్రధాన కార్యాలయంలో ఈ కారుకు తుది మెరుగులు దిద్దనున్నారు. ఇక పనితీరు పరంగా చూస్తే ఇందులో నాలుగు ఎలక్ట్రిక్ మోటార్లు అమర్చారు. ఇవి కలిసి ఏకంగా 1035 హార్స్‌పవర్ శక్తిని ఉత్పత్తి చేస్తాయి. కేవలం 2.5 సెకన్లలోనే ఈ బరువైన కారు సున్నా నుంచి వంద కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. దీని గరిష్ట వేగం గంటకు 310 కిలోమీటర్లు కాగా.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 530 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు.

సాంప్రదాయ ఇంజిన్ శబ్దం లేని లోటును తీర్చడానికి ఫెరారీ ప్రత్యేక గిటార్ టెక్నాలజీని ఈ కారులో జోడించింది. రూ.382 కోట్ల భారీ ధర పలికిన ఈ సూపర్ కార్ ఆటోమొబైల్ చరిత్రలో సరికొత్త అధ్యాయానికి తెరతీసింది.

Venkat

Venkat

2013లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌, పలు పత్రికల్లో 13 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాస్తుంటాను. స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాస్తుంటాను.

Next Story