US Mass Shooting: యూనివర్సిటీలో తుపాకుల మోత.. నిందితుడితో సహా ఆరుగురు మృతి
US Mass Shooting: అమెరికాలో తుపాకుల మోత మరోసారి భయాందోళనలు రేపింది. మిషిగన్, వర్జీనియా స్టేట్ యూనివర్సిటీల్లో జరిగిన వేర్వేరు కాల్పుల ఘటనల్లో నిందితుడితో సహా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు.
US Mass Shooting
US Mass Shooting: అమెరికాలోని మిచిగన్‌లో వెలుగుచూసిన రక్తాపాతం తీవ్ర కలకలం రేపింది. డేట్రాయిట్‌కు వాయవ్యంగా ఉన్న ఒక ఇంట్లో దుండగుడు జరిపిన కాల్పుల్లో 16 ఏళ్ల బాలుడు, 45 ఏళ్ల పురుషుడు, 40 ఏళ్ల మహిళ అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. ఈ ఘటనలో 13 ఏళ్ల బాలిక తీవ్ర గాయాలతో ప్రాణాపాయ స్థితి నుంచి కోలుకుంటోంది.
హత్యలకు పాల్పడిన 39 ఏళ్ల చాడ్ హిక్‌మన్ అనే నిందితుడి కోసం పోలీసులు భారీ స్థాయిలో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో సమీపంలోని మరో ఇంట్లో 53 ఏళ్ల వ్యక్తి మృతదేహం లభించింది. చివరకు అటవీ ప్రాంతంలో ఇంకో మహిళ మృతదేహంతో పాటు నిందితుడు కూడా శవమై కనిపించాడు. నిందితుడు గతంలో తీవ్రమైన నేర చరిత్ర కలిగిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు.
కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానున్న తరుణంలో వర్జీనియా స్టేట్ యూనివర్సిటీ ప్రాంగణంలో జరిగిన కాల్పుల ఘటన విద్యార్థులను, వారి తల్లిదండ్రులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. సోమవారం నుంచి తరగతులు ప్రారంభం కానుండగా, హాస్టళ్లలో వేలాది మంది విద్యార్థులు చేరిన సమయంలో ఈ దారుణం జరిగింది.
క్యాంపస్ వసతి గృహాల వెలుపల అనేక మంది నిందితులు జరిపిన ఈ కాల్పుల్లో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. బాధితుల్లో ఒక విద్యార్థి కూడా ఉన్నట్లు అధికారులు ధ్రువీకరించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే క్యాంపస్‌ను లాక్‌డౌన్ చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.
ఐదు వేలకు పైగా విద్యార్థులు చదువుకునే ఈ చారిత్రాత్మక యూనివర్సిటీలో భద్రతా ఏర్పాట్లు పెంచినప్పటికీ ఇలాంటి ఘటన జరగడం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఎఫ్‌బిఐ ఇతర దర్యాప్తు సంస్థల సాయంతో పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. వర్జీనియా గవర్నర్, ప్రజాప్రతినిధులు బాధితులకు తమ సానుభూతిని తెలియజేశారు. ఈ దారుణ ఘటనలతో క్యాంపస్‌లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.




