Odometer Fraud : పాత కారు కొంటున్నారా.? ఓడోమీటర్ మోసాల పట్ల జాగ్రత్త.! ఈ విషయాలు తెలుసుకోండి..!

Odometer Fraud : ఈ రోజుల్లో కొత్త కారు ధరలు ఆకాశాన్ని తాకడంతో చాలామంది పాత కార్ల (Used Cars) వైపు మొగ్గు చూపుతున్నారు. ఆన్‌లైన్ , ఆఫ్‌లైన్ ప్లాట్‌ఫామ్‌ల

G Krishna
Published on: 4 May 2026 12:19 PM IST
used-cars
X

used-cars

Odometer Fraud : ఈ రోజుల్లో కొత్త కారు ధరలు ఆకాశాన్ని తాకడంతో చాలామంది పాత కార్ల (Used Cars) వైపు మొగ్గు చూపుతున్నారు. ఆన్‌లైన్ , ఆఫ్‌లైన్ ప్లాట్‌ఫామ్‌ల వల్ల పాత కారును కొనుగోలు చేయడం గతంలో కంటే సులభమైంది. అయితే, ఇదే తరుణంలో మోసాలు కూడా పెరిగాయి. ముఖ్యంగా తక్కువ ధర , తక్కువ మైలేజీ చూపిస్తూ కస్టమర్లను ఆకర్షించి, ఓడోమీటర్ రీడింగ్‌ను తారుమారు చేసే ముఠాలు పెరిగిపోయాయి. మీరు మోసపోకుండా ఉండాలంటే కారు కొనే ముందు ఈ క్రింది ముఖ్యమైన విషయాలను తప్పనిసరిగా తనిఖీ చేయాలి.

సర్వీస్ హిస్టరీని క్షుణ్ణంగా పరిశీలించండి

కారు వాస్తవ పరిస్థితిని తెలుసుకోవడానికి సర్వీస్ చరిత్ర (Service History) అత్యంత నమ్మదగిన ఆధారం. వాహనం ఏదైనా అధీకృత సర్వీస్ సెంటర్‌కు వెళ్ళిన ప్రతిసారీ, దాని మైలేజ్ రీడింగులను కంపెనీ రికార్డులలో నమోదు చేస్తారు. మీరు ఆన్‌లైన్ ద్వారా లేదా నేరుగా సర్వీస్ సెంటర్‌కు వెళ్లి ఆ రికార్డులను తనిఖీ చేయవచ్చు. కంపెనీ రికార్డుల్లో ఉన్న మైలేజీకి, ప్రస్తుతం కారు మీటర్‌లో కనిపిస్తున్న రీడింగ్‌కు ఏవైనా వ్యత్యాసాలు ఉంటే, ఆ కారును కొనకపోవడమే మంచిది.

టెస్ట్ డ్రైవ్ సమయంలో మీటర్‌ను గమనించండి

కారును కొనే ముందు కేవలం ఇంజిన్ శబ్దాన్ని మాత్రమే కాకుండా, ఓడోమీటర్ పనితీరును కూడా నిశితంగా గమనించాలి. టెస్ట్ డ్రైవ్ చేస్తున్నప్పుడు మీటర్ రీడింగ్ సక్రమంగా పెరుగుతుందో లేదో చూడండి. ఒకవేళ రీడింగ్ అసాధారణంగా లేదా అడపాదడపా మారుతున్నట్లు అనిపించినా, మీటర్ డయల్ వదులుగా ఉన్నట్లు కనిపించినా అది ట్యాంపరింగ్‌కు సంకేతం కావచ్చు.

డాష్‌బోర్డ్ , లోపలి మార్పులపై చెకింగ్..

కారు డాష్‌బోర్డ్‌ను జాగ్రత్తగా పరిశీలించడం వల్ల చాలా విషయాలు తెలుస్తాయి. మీటర్ రీడింగ్‌ను మార్చడానికి కొంతమంది అదనపు వైర్లు లేదా అనవసరమైన స్విచ్‌లను అమర్చుతుంటారు. డాష్‌బోర్డ్ చుట్టూ మీకు ఏవైనా అదనపు బటన్లు లేదా అసాధారణమైన వైరింగ్ కనిపిస్తే వెంటనే యజమానిని ప్రశ్నించండి. అలాగే మీటర్ కన్సోల్ విప్పినట్లుగా మార్కులు ఏవైనా ఉన్నాయేమో చూడటం మర్చిపోవద్దు.

RC , కారు ఏజ్ చెక్ చేయండి..

రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ (RC) ద్వారా కారు ఎప్పుడు కొన్నారో స్పష్టంగా తెలుస్తుంది. ఉదాహరణకు, కారు కొని ఏడెనిమిది ఏళ్లు అవుతున్నా, రీడింగ్ మాత్రం కేవలం 10,000 లేదా 20,000 కిలోమీటర్లే ఉంటే అది ఖచ్చితంగా అనుమానించదగ్గ విషయమే. కారు వయస్సుకు, అది తిరిగిన మైలేజీకి పొంతన లేకపోతే దాని వెనుక ఏదో మతలబు ఉందని గ్రహించాలి.

మెకానిక్ సలహా తప్పనిసరి

అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఒక అనుభవజ్ఞుడైన మెకానిక్‌తో కారును తనిఖీ చేయించడం. ఒక సాధారణ వ్యక్తి గుర్తించలేని ఇంజిన్ అరుగుదల, వైరింగ్ మార్పులు , మీటర్ ట్యాంపరింగ్‌ను నిపుణులైన మెకానిక్ సులభంగా పసిగట్టగలడు. మెకానిక్ ఇచ్చే గ్రీన్ సిగ్నల్ తర్వాతే తుది నిర్ణయం తీసుకోవడం వల్ల మీ సొమ్ము వృథా కాకుండా చూసుకోవచ్చు. ఈ జాగ్రత్తలు పాటించడం ద్వారా మీరు పాత కారు కొనుగోలులో మోసపోకుండా, మంచి కారును సరైన ధరకే సొంతం చేసుకోవచ్చు.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.

Next Story