VinFast VF 5: టాటా పంచ్, నెక్సాన్ లకు షాక్.. ఇండియాలో విన్‌ఫాస్ట్ కొత్త ఈవీ కార్
VinFast VF 5: బడ్జెట్ ధరలో అధునాతన ఫీచర్లు, మంచి రేంజ్‌తో రానున్న విన్‌ఫాస్ట్ విఎఫ్ 5 ఇండియాలోకి అడుగుపెడితే టాటా ఈవీల హవాకు ఖచ్చితంగా బ్రేక్ పడే అవకాశం ఉంది.
VinFast VF 5
VinFast VF 5: ఇండియన్ ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్‌లో తన పట్టును బలపరుచుకోవడానికి విన్ ఫాస్ట్ వేగంగా పావులు కదుపుతోంది. ఇప్పటికే విఎఫ్ 6, విఎఫ్ 7 మోడళ్లను భారతదేశంలో విడుదల చేసిన ఈ కంపెనీ, ఇప్పుడు బి-సెగ్మెంట్ ఈవీ మార్కెట్‌పై ప్రత్యేకంగా దృష్టి సారించింది. బెంగళూరులోని మహాలక్ష్మి మెట్రో స్టేషన్ సమీపంలో ఈ సెకండ్ జనరేషన్ ఈవీ టెస్టింగ్ చేస్తూ కనిపించింది. వియత్నాంలో విన్‌ఫాస్ట్ హేరియో గ్రీన్ పేరుతో, అంతర్జాతీయ మార్కెట్లలో విఎఫ్ 5 పేరుతో పిలిచే ఈ ఎస్‌యూవీ, టాటా పంచ్ ఈవీ, నెక్సాన్ ఈవీలతో పాటు మహీంద్రా మోడళ్లకు సైతం గట్టి పోటీ ఇవ్వనుంది.
సరికొత్త డిజైన్..అదిరిపోయే లుక్
బెంగళూరులో కనిపించిన టెస్టింగ్ వెహికల్ డిజైన్ పరంగా పాత వర్షన్ కంటే చాలా భిన్నంగా, మరింత ప్రీమియం లుక్‌లో మెరుస్తోంది. ముందు భాగంలో రీడిజైన్ చేసిన ప్రొజెక్టర్ హెడ్‌లైట్ సెటప్, క్లామ్‌షెల్ బోనెట్ డిజైన్ వల్ల కారుకు మస్క్యులర్ స్టాన్స్ లభించింది. వెనుక వైపు కొత్త కనెక్టెడ్ ఎల్‌ఈడీ టెయిల్ లైట్ సెటప్ కారుకి స్పోర్టీ లుక్ ఇస్తోంది. 16 ఇంచుల స్టీల్ వీల్స్‌తో రోడ్డుపై పరీక్షించినప్పటికీ, షోరూమ్‌లలో విడుదలయ్యే సమయానికి 17 ఇంచుల అల్లాయ్ వీల్స్‌తో వచ్చే అవకాశం ఉంది. 3,967 మిమీ పొడవు, 2,514 మిమీ వీల్‌బేస్, 160 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్‌తో సబ్-4 మీటర్ ఎస్‌యూవీ విభాగంలోకి ఇది గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనుంది.
లగ్జరీ ఇంటీరియర్.. అద్భుతమైన టెక్నాలజీ
ఈ సెకండ్ జనరేషన్ విఎఫ్ 5 ఇంటీరియర్‌ను చూస్తే విన్‌ఫాస్ట్ ఎంత శ్రద్ధ తీసుకుందో అర్థమవుతుంది. పాత వర్షన్లలో ఉన్న కర్వ్డ్ డాష్‌బోర్డ్ స్థానంలో ఈసారి ఫ్లాట్ డాష్‌బోర్డ్ అమర్చారు. డ్రైవర్ సౌకర్యం కోసం సరికొత్త స్టీరింగ్ వీల్, రెక్టాంగ్యులర్ ఫ్రీ-స్టాండింగ్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్ ఏర్పాటు చేశారు. సెంటర్ కాన్సోల్, ఫ్రంట్ ఆర్మ్‌రెస్ట్‌తో పాటు టీఎఫ్‌టీ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వెంటిలేటెడ్ సీట్లు, సన్‌రూఫ్, వెనుక వైపు ఏసీ వెంట్లు లాంటి ప్రీమియం ఫీచర్లు లభించే అవకాశం ఉంది.
బ్యాటరీ సామర్థ్యం.. 326 కిలోమీటర్ల రేంజ్
విన్‌ఫాస్ట్ విఎఫ్ 5 ఈవీ బ్యాటరీ ఆప్షన్ల విషయానికి వస్తే ఇది 29.6 కేడబ్ల్యూహెచ్, 37.23 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌లతో రానుంది. వీటిని 134 బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేసే ఎలక్ట్రిక్ మోటార్‌కు అనుసంధానించారు. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 260 కిలోమీటర్ల నుంచి 326 కిలోమీటర్ల వరకు ప్రయాణించే రేంజ్ ఇస్తుందని కంపెనీ పేర్కొంటోంది. 2026 చివరి నాటికి భారత మార్కెట్లోకి తెచ్చే 5 కొత్త ఈవీ మోడళ్ల ప్రణాళికలో భాగంగా ఈ విఎఫ్ 5 కూడా విడుదల కానుంది.




