Job Cuts : వోక్స్‌వ్యాగన్ సంచలన నిర్ణయం.. లక్ష మంది ఉద్యోగుల తొలగింపు..!
Job Cuts : ప్రపంచ ఆటోమొబైల్ రంగాన్ని కుదిపేసేలా జర్మన్ కార్ల దిగ్గజం వోక్స్‌వ్యాగన్ ఏజీ (Volkswagen AG) ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. గ్లోబల్ ఆటోమొబైల్
Volkswagen
Job Cuts : ప్రపంచ ఆటోమొబైల్ రంగాన్ని కుదిపేసేలా జర్మన్ కార్ల దిగ్గజం వోక్స్‌వ్యాగన్ ఏజీ (Volkswagen AG) ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. గ్లోబల్ ఆటోమొబైల్ మార్కెట్‌లో చైనా కంపెనీల నుండి ఎదురవుతున్న తీవ్రమైన పోటీ, మార్కెట్ వాటా పడిపోతుండటం , తగ్గుతున్న లాభాల నేపథ్యంలో వోక్స్‌వ్యాగన్ సీఈఓ ఆలివర్ బ్లూమ్ కంపెనీని పూర్తిగా పునర్‌వ్యవస్థీకరించే పనిలో పడ్డారు. దీనిలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా ఏకంగా లక్ష మంది ఉద్యోగులను తొలగించడంతో పాటు, జర్మనీలోని నాలుగు ప్రధాన తయారీ ఫ్యాక్టరీలను శాశ్వతంగా మూసివేయడానికి కంపెనీ ప్రణాళికలు సిద్ధం చేసినట్లు ప్రముఖ అంతర్జాతీయ పత్రిక 'మేనేజర్ మ్యాగజైన్' నివేదించింది. కంపెనీ వ్యయ నియంత్రణ కోసం గతంలో ప్రతిపాదించిన 50,000 ఉద్యోగాల కోతను ఇప్పుడు ఏకంగా రెట్టింపు చేస్తూ, రాబోయే కొన్నేళ్లలో సుమారుగా 15 శాతం మంది సిబ్బందిని ఇంటికి పంపాలని యాజమాన్యం భావిస్తోంది.
'ఆడి' ప్లాంట్‌ను కూడా క్లోజ్..
అంతటితో ఆగకుండా, ఆటోమొబైల్ రంగానికి పుట్టినిల్లయిన జర్మనీలోని హనోవర్, జ్వికావ్, ఎమ్డెన్‌లలో ఉన్న వోక్స్‌వ్యాగన్ సొంత ప్లాంట్లతో పాటు, గ్రూప్ అనుబంధ సంస్థకు చెందిన నెకార్‌సుల్మ్‌లోని 'ఆడి' ప్లాంట్‌ను కూడా మూసివేసేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ప్రస్తుతం ఈ ఫ్యాక్టరీలలో తయారవుతున్న వాహన నమూనాల (Models) ప్రొడక్షన్ టైమ్‌లైన్ ముగియగానే, ఆయా యూనిట్లను పూర్తిగా షట్‌డౌన్ చేయనున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద వాహన తయారీ సంస్థలలో ఒకటిగా ఉన్న వోక్స్‌వ్యాగన్ గ్రూప్ కింద ఆడి, పోర్షే, బెంట్లీ, క్యూప్రా, జెట్టా, సీట్, స్కోడా , ప్రముఖ బైక్ బ్రాండ్ డుకాటి వంటి ఎన్నో లగ్జరీ బ్రాండ్‌లు ఉన్నాయి. అయితే ప్రస్తుత సంక్షోభం కారణంగా, రాబోయే ఐదేళ్లలో కంపెనీ తన మొత్తం పెట్టుబడులను (Investments) 15 శాతం మేర తగ్గించుకోవాలని నిర్ణయించింది. దీనివల్ల కంపెనీ భవిష్యత్తు పెట్టుబడుల పరిమితి దాదాపు €130 బిలియన్లకు (భారత కరెన్సీలో సుమారు రూ. 1.40 లక్షల కోట్లకు) పరిమితం కానుంది.
కొత్తగా విధించిన కఠినమైన దిగుమతి సుంకాలు
యూరప్‌లోనే అగ్రగామిగా వెలుగొందుతున్న వోక్స్‌వ్యాగన్ ఇంతటి కఠిన నిర్ణయం తీసుకోవడం వెనుక బలమైన అంతర్జాతీయ కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాహనాల (EV) మార్కెట్లోకి చైనాకు చెందిన బియాండ్ యువర్ డ్రీమ్స్ (BYD) వంటి కంపెనీలు చౌకైన ధరలకే అధునాతన కార్లతో దూసుకురావడం వోక్స్‌వ్యాగన్‌కు గట్టి ఎదురుదెబ్బగా మారింది. దశాబ్దాలుగా చైనా మార్కెట్‌ను ఏలిన వోక్స్‌వ్యాగన్ అక్కడ మూడో స్థానానికి పడిపోయింది. దీనికి తోడు, పెట్రోల్,డీజిల్ వాహనాల నుండి ఎలక్ట్రిక్ వాహనాల సాంకేతికత వైపు మారడానికి (EV Transition) కంపెనీ ఊహించిన దానికంటే భారీగా ఖర్చు చేయాల్సి వస్తోంది. అలాగే అమెరికాతో పాటు పలు ఇతర దేశాలు విదేశీ వాహనాలపై కొత్తగా విధించిన కఠినమైన దిగుమతి సుంకాలు , పన్నుల విధానాలు కూడా వోక్స్‌వ్యాగన్ అంతర్జాతీయ వ్యాపార లాభాలను గరిష్టంగా దెబ్బతీశాయి. ఈ పరిణామాల నేపథ్యంలో సంస్థను బతికించుకోవడానికి వ్యయ నియంత్రణే ఏకైక మార్గమని భావిస్తూ వోక్స్‌వ్యాగన్ ఈ చారిత్రాత్మక పునర్‌వ్యవస్థీకరణకు శ్రీకారం చుట్టింది.




