Volkswagen : 455 కి.మీ రేంజ్.. అదిరిపోయే లుక్.. పోలో క్రేజ్‌ను ఎలక్ట్రిక్ పవర్‌తో కలిపేసిన కంపెనీ
Volkswagen : ఫోక్స్‌వ్యాగన్ పోలో ఇప్పుడు ఎలక్ట్రిక్ వెర్షన్‌లో (ID. Polo) లాంచ్ అయింది. 455 కి.మీ రేంజ్, 52 kWh బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లతో వచ్చింది.
Volkswagen ID. Polo
Volkswagen : ప్రముఖ వాహన తయారీ సంస్థ ఫోక్స్‌వ్యాగన్ తన ఐకానిక్ మోడల్ పోలోను సరికొత్త ఎలక్ట్రిక్ అవతారంలో ప్రపంచానికి పరిచయం చేసింది. గత 51 ఏళ్లుగా ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది హృదయాలను గెలుచుకున్న పోలో, ఇప్పుడు ID. Polo పేరుతో ఈవీ మార్కెట్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అదిరిపోయే రేంజ్, అత్యాధునిక ఫీచర్లతో వచ్చిన ఈ కారు ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ విభాగంలో గేమ్ ఛేంజర్‌గా మారుతుందని ఆటో మొబైల్ నిపుణులు భావిస్తున్నారు.
డిజైన్, కొలతలు
కొత్త ID. Polo చూడటానికి పాత పోలో లాగే ఉన్నా, దీని బాడీ ప్యానెల్స్, డిజైన్ ఎలిమెంట్స్ పూర్తిగా కొత్తవి. MEB+ ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి తయారైన ఈ కారు పొడవు 4,053 మిమీ, వెడల్పు 1,816 మిమీగా ఉంది. పాత మోడల్ కంటే ఇది వెడల్పుగా ఉండటంతో పాటు, 2,600 మిమీ వీల్‌బేస్‌ను కలిగి ఉంది. దీనివల్ల కారు లోపల స్థలం ఎక్కువగా ఉండటమే కాకుండా, కింది భాగంలో బ్యాటరీ ప్యాక్ పెట్టడానికి వీలుగా ఉంది. 19 అంగుళాల అలాయ్ వీల్స్, హిడెన్ రియర్ డోర్ హ్యాండిల్స్ దీనికి ప్రీమియం లుక్ ఇస్తున్నాయి.
అత్యాధునిక ఇంటీరియర్
ఫోక్స్‌వ్యాగన్ ఈసారి కస్టమర్ల ఫీడ్‌బ్యాక్‌ను సీరియస్‌గా తీసుకుని ఇంటీరియర్‌లో మార్పులు చేసింది. టచ్ ప్యాడ్‌ల బదులు ఫిజికల్ బటన్లను తిరిగి ప్రవేశపెట్టింది. క్లైమేట్ కంట్రోల్, స్టీరింగ్ వీల్ కంట్రోల్స్, విండో కంట్రోల్స్ కోసం ప్రాపర్ స్విచ్‌లను ఇచ్చారు. క్యాబిన్‌లో 10 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు 13 అంగుళాల భారీ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉన్నాయి. వైర్‌లెస్ ఛార్జింగ్, యాంబియంట్ లైటింగ్, 12 రకాలుగా అడ్జస్ట్ చేసుకునే ఎలక్ట్రిక్ సీట్లు వంటి సౌకర్యాలు ఇందులో ఉన్నాయి. బూట్ స్పేస్ కూడా 441 లీటర్ల వరకు ఉండటం గమనార్హం.
బ్యాటరీ, రేంజ్
ID. Polo రెండు రకాల బ్యాటరీ ఆప్షన్లతో రానుంది. ఒకటి 37 kWh LFP ప్యాక్ (రేంజ్ 329 కి.మీ) కాగా, మరొకటి 52 kWh NMC యూనిట్. ఈ పెద్ద బ్యాటరీ వెర్షన్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 455 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. ఛార్జింగ్ స్పీడ్ కూడా అద్భుతంగా ఉంది. కేవలం 24 నుంచి 27 నిమిషాల్లోనే 10 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా, ఇది వీహికల్-టు-లోడ్ (V2L) ఫీచర్‌ను కూడా సపోర్ట్ చేస్తుంది, అంటే కారు బ్యాటరీ ద్వారా ఇతర ఎలక్ట్రిక్ వస్తువులను కూడా నడపవచ్చు.
పవర్, స్పీడ్
ఈ కారు మూడు రకాల పవర్ అవుట్‌పుట్‌లతో అందుబాటులో ఉండనుంది.. 114 hp, 133 hp, 208 hp. స్పీడ్ ఇష్టపడే వారి కోసం ప్రత్యేకంగా GT ట్రిమ్‌ను కూడా కంపెనీ ప్లాన్ చేస్తోంది, ఇది ఏకంగా 223 hp పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఫ్రంట్ వీల్ డ్రైవ్ సెటప్‌తో వచ్చే ఈ కారు, సిటీ రోడ్లపై, హైవేలపై అద్భుతమైన పర్ఫార్మెన్స్‌ను ఇస్తుందని ఫోక్స్‌వ్యాగన్ ధీమా వ్యక్తం చేస్తోంది. ప్రస్తుతానికి ఐరోపా మార్కెట్లో విడుదలైన ఈ కారు, త్వరలోనే భారత్ వంటి ఆసియా దేశాల్లో కూడా అడుగుపెట్టే అవకాశం ఉంది.




