Discount Offer: ఎర్టిగా, స్కార్పియో కాదు.. ఆ లగ్జరీ ఎస్‌యూవీపై ఏకంగా రూ.1.50 లక్షల డిస్కౌంట్

Discount Offer: వినాయక చతుర్థి నుంచి ప్రారంభమయ్యే పండుగల సీజన్ సందర్భంగా కార్ల ప్రియులకు ఫోక్స్ వ్యాగన్ అదిరిపోయే వార్త అందించింది.

CR Reddy
Published on: 4 Sept 2026 9:04 AM IST
Volkswagen Tayron
X

Volkswagen Tayron

Discount Offer: దేశంలో పండుగల సీజన్ షురూ కావడంతో దిగ్గజ వాహన తయారీ సంస్థ ఫోక్స్ వ్యాగన్ తన కస్టమర్లకు బంపర్ కానుక ప్రకటించింది. తన పోర్ట్‌ఫోలియోలోని అత్యంత ప్రజాదరణ పొందిన లగ్జరీ ఎస్‌యూవీ టెరాన్ పై ఆకర్షణీయమైన డిస్కౌంట్లను ఇస్తోంది. ఈ కారులోని ఆర్-లైన్, లైఫ్ వేరియంట్లపై రూ.1.50 లక్షల వరకు లబ్ధి చేకూరనుంది. ఇందులో నేరుగా క్యాష్ డిస్కౌంట్ ఇవ్వనప్పటికీ, పాత కారును మార్చుకునే వారికి రూ.లక్ష వరకు ఎక్స్ఛేంజ్ బోనస్, పాత కస్టమర్లకు రూ.50,000 రాయల్టీ బోనస్ అందిస్తోంది. ఎక్స్ఛేంజ్ ఆఫర్ వద్దనుకుంటే రూ.20,000 స్క్రాపేజ్ బోనస్ పొందే వెసులుబాటు కల్పించింది. ఈ ప్రీమియం ఎస్‌యూవీ ప్రారంభ ఎక్స్ షోరూమ్ ధర రూ.41.99 లక్షలుగా ఉంది.

డిజైన్ విషయానికి వస్తే టెరాన్ ఆర్-లైన్ మోడల్ ఎంతో మస్క్యులర్ లుక్‌తో చూపుతిప్పుకోనివ్వకుండా చేస్తుంది. రెండు వైపులా ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన ఎల్ఈడీ లైట్ సిగ్నేచర్ దీనికి మరింత ఆకర్షణను తెచ్చిపెట్టింది. స్పోర్టీ ఆర్-లైన్ ప్యాకేజీతో పాటు పెద్దవిగా ఉండే 19 అంగుళాల కోవెంకట్రీ అల్లాయ్ వీల్స్ వాహన రూపాన్ని ఎంతో గ్రాండ్‌గా మార్చాయి. భద్రతకు పెద్దపీట వేసే ఫోక్స్ వ్యాగన్ ఈ కారుకు యూరో ఎన్‌సిఎపి క్రాష్ టెస్ట్‌లో 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ సాధించి పెట్టింది. ఐరోపాలో అత్యుత్తమ ఫ్యామిలీ కార్ కేటగిరీలో గోల్డెన్ స్టీరింగ్ వీల్ 2025 అవార్డును కూడా ఈ వాహనం దక్కించుకోవడం విశేషం.

కారు ఇంటీరియర్‌ను డ్రైవర్‌కు అత్యంత సౌకర్యవంతంగా తీర్చిదిద్దారు. డాష్‌బోర్డ్ మధ్యలో ఏర్పాటు చేసిన 15 అంగుళాల ఫ్లోటింగ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వైర్‌లెస్ ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటోలకు సపోర్ట్ చేస్తుంది. 2,789 మిమీ పొడవైన వీల్‌బేస్ ఉండటం వల్ల మూడు వరుసలలో కూర్చునే ప్రయాణికులకు కావలసినంత స్థలం లభిస్తుంది. ప్రయాణాన్ని మరింత ఆనందదాయకంగా మార్చడానికి వెంటీలేషన్, 10 పాయింట్ ప్రెజర్ మసాజ్ ఫంక్షన్ కలిగిన ఎర్గోయాక్టివ్ ప్లస్ లెదర్ సీట్లు ఏర్పాటు చేశారు.

ప్రయాణంలో లగ్జరీ అనుభూతిని పంచడానికి పానోరమిక్ సన్‌రూఫ్, 10.25 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ తో పాటు అత్యుత్తమమైన అడాస్ భద్రతా ప్యాకేజీని జోడించారు. కారు మూడో వరుస సీట్లను మడతబెడితే బూట్ స్పేస్ ఏకంగా 850 లీటర్ల వరకు పెరుగుతుంది. అన్ని వరుసలు ఉపయోగిస్తున్నప్పుడు కూడా 345 లీటర్ల భారీ నిల్వ స్థలం అందుబాటులో ఉంటుంది.మొత్తం 4,770 మిమీ పొడవు ఉన్న ఈ ఎస్‌యూవీ తన విభాగంలోనే విలక్షణమైన గుర్తింపును కలిగి ఉంది.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story