Volvo: కారులోనే గూగుల్ జెమిని ఏఐ.. వోల్వో నుంచి కళ్లుచేదిరే లగ్జరీ కార్లు
Volvo: ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ వోల్వో తన మోస్ట్ పాపులర్ 40-సిరీస్ లైన్అప్ను సరికొత్త అప్డేట్లతో మార్కెట్లోకి తీసుకొచ్చింది.
Volvo
Volvo: ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ వోల్వో తన మోస్ట్ పాపులర్ 40-సిరీస్ లైన్అప్ను సరికొత్త అప్డేట్లతో మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఎక్స్‌సీ40, ఈఎక్స్40, ఈసీ40 మోడళ్లలో ఆకర్షణీయమైన డిజైన్, అడ్వాన్సుడ్ గూగుల్ జెమినీ ఏఐ టెక్నాలజీ, అత్యున్నత సేఫ్టీ ఫీచర్లను జోడించి కస్టమర్లను విశేషంగా ఆకట్టుకుంటోంది.
సరికొత్త లుక్‌తో మెరిసిపోతున్న ఎక్స్టీరియర్ డిజైన్
వోల్వో 40-సిరీస్ కార్లలో ప్రధానంగా ఎక్స్టీరియర్ డిజైన్‌ను ఎంతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. ఈ మూడు కార్లలోనూ అధునాతన మ్యాట్రిక్స్ ఎల్ఈడీ హెడ్‌లాంప్స్ అమర్చారు. వోల్వో సిగ్నేచర్ స్టైల్ అయిన థోర్స్ హామర్ డీఆర్ఎల్ను అలాగే కొనసాగించారు. ఫ్రంట్ బంపర్‌ను రీడిజైన్ చేయడం ద్వారా కార్లు మరింత మోడర్న్ లుక్‌తో కనిపిస్తున్నాయి. పెట్రోల్ వేరియంట్ ఎక్స్‌సి40లో సరికొత్త గ్రిల్ అమర్చగా, ఎలక్ట్రిక్ మోడళ్లు అయిన ఈఎక్స్40, ఈసీ40లలో క్లోజ్డ్ గ్రిల్ డిజైన్‌ను అందించారు. వెనుక వైపు కొత్త ఎల్ఈడీ టెయిల్ లైట్లు, అప్డేటెడ్ బంపర్లతో పాటు 18 నుంచి 20 అంగుళాల అలాయ్ వీల్స్ ఆకట్టుకుంటున్నాయి.
కారులోనే గూగుల్ జెమిని ఏఐ టెక్నాలజీ
కేబిన్ లోపల టెక్నాలజీ విప్లవానికి వోల్వో శ్రీకారం చుట్టింది. 11.2 అంగుళాల పెద్ద ఇన్ఫోటైన్మెంట్ డిస్ప్లేను ఈ కార్లలో పొందుపరిచారు. ఈ సిస్టమ్‌లో గూగుల్ జెమిని ఏఐ వాయిస్ అసిస్టెంట్‌ను అనుసంధానించడం ఇక్కడ అత్యంత కీలకమైన అంశం. దీనివల్ల డ్రైవర్, ప్రయాణికులు అత్యంత సహజమైన రీతిలో వాయిస్ కమాండ్స్ ఇస్తూ కారు ఫీచర్లను నియంత్రించవచ్చు. కొత్త సీట్ కవర్లు, ప్రీమియం ఇంటీరియర్ ట్రిమ్స్ కేబిన్ వాతావరణాన్ని మరింత లగ్జరీగా మార్చేశాయి.
సేఫ్టీలో నెక్స్ట్ లెవెల్ అడ్వాన్స్డ్ ఫీచర్లు
వోల్వో కార్లు అంటేనే సేఫ్టీకి మారుపేరు. ఈ కొత్త మోడళ్లలో ప్రమాదాలను ముందుగానే గుర్తించి అప్రమత్తం చేసే ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, స్టీరింగ్ అసిస్ట్ సిస్టమ్ లను స్టాండర్డుగా అందించారు. అదనపు భద్రత కోరుకునే వారి కోసం లెవెల్-2 అడాస్ (ADAS), 360-డిగ్రీ కెమెరా సదుపాయాలను ఎంచుకునే వెసులుబాటు కల్పించారు. అంతేకాకుండా, కార్లకు ఓవర్-ది-ఎయిర్ (OTA) సాఫ్ట్వేర్ అప్డేట్లు లభిస్తాయి. దీనివల్ల భవిష్యత్తులో వచ్చే కొత్త టెక్నాలజీని సులభంగా అప్డేట్ చేసుకోవచ్చు.
పవర్ఫుల్ పెట్రోల్, ఎలక్ట్రిక్ ఇంజిన్ ఆప్షన్లు
ఇంజిన్ పనితీరు విషయానికి వస్తే.. ఎక్స్‌సి40 మోడల్ 2.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో వస్తోంది. ఇది 163 హెచ్‌పి, 197 హెచ్‌పి పవర్ అవుట్‌పుట్ ఇచ్చే రెండు వేరియంట్లలో లభిస్తుంది. 7-స్పీడ్ డ్యూయల్ క్లచ్ గేర్‌బాక్స్ దీని సొంతం. ఇక ఎలక్ట్రిక్ వేరియంట్లు అయిన ఈఎక్స్40, ఈసీ40 మోడళ్లలో 66 కేడబ్ల్యూహెచ్ నుంచి 79 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ఆప్షన్లు ఉన్నాయి. ఇవి గరిష్టంగా 442 హెచ్‌పి పవర్, 670 ఎన్ఎమ్ టాప్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఒకే ఛార్జ్‌పై ఈసీ40 మోడల్ 584 కిలోమీటర్లు, ఈఎక్స్40 మోడల్ 575 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తాయని సంస్థ స్పష్టం చేసింది.




