Wireless EV Charging Bus: టైర్ల ద్వారానే ఛార్జ్ అయ్యే ఎలక్ట్రిక్ బస్సు.. కేబుల్స్ అవసరం లేని కొత్త టెక్నాలజీ
Wireless EV Charging Bus: టైర్లలోని ప్రత్యేక కాయిల్స్‌తో రోడ్డుపైనే ఎలక్ట్రిక్ బస్సును ఛార్జ్ చేసే విండక్షన్ కొత్త టెక్నాలజీ ఎలా పనిచేస్తుందో తెలుసుకోండి.
Wireless EV Charging Bus: టైర్ల ద్వారానే ఛార్జ్ అయ్యే ఎలక్ట్రిక్ బస్సు.. కేబుల్స్ అవసరం లేని కొత్త టెక్నాలజీ
Wireless EV Charging Bus: ఎలక్ట్రిక్ బస్సులు ఛార్జింగ్ కోసం ప్రత్యేక స్టేషన్లకు వెళ్లడం లేదా కేబుళ్లకు కనెక్ట్ కావాల్సిన అవసరం లేకుండా.. తమ సాధారణ మార్గంలోనే బ్యాటరీని రీఛార్జ్ చేసుకుంటే ఎలా ఉంటుంది? ఈ ఆలోచనను నిజం చేసే దిశగా స్విస్ స్టార్టప్ విండక్షన్ ఓ కొత్త సాంకేతికతను అభివృద్ధి చేస్తోంది. ETH జ్యూరిచ్‌కు అనుబంధంగా పనిచేస్తున్న ఈ సంస్థ.. రోడ్డులోనే అమర్చిన ఛార్జింగ్ ప్లేట్ ద్వారా బస్సును వైర్‌లెస్‌గా ఛార్జ్ చేసే వ్యవస్థను రూపొందించింది.
విండక్షన్ అభివృద్ధి చేస్తున్న నమూనా ఎలక్ట్రిక్ బస్సు.. రోడ్డులో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఛార్జింగ్ ప్లేట్‌పై ఆగినప్పుడు, దాని టైర్లలో అమర్చిన ప్రత్యేక కాయిల్స్ ద్వారా విద్యుత్‌ను గ్రహిస్తుంది. ఇలా బస్సు సాధారణ బస్‌స్టాప్‌లో కొన్ని క్షణాలు ఆగిన సమయంలోనే బ్యాటరీకి శక్తిని అందించే విధంగా ఈ టెక్నాలజీని రూపొందిస్తున్నారు.
ఎలక్ట్రిక్ బస్సు టైర్ల ద్వారా ఎలా ఛార్జ్ అవుతుంది?
ఈ వ్యవస్థలో వైర్‌లెస్ పవర్ ట్రాన్స్‌ఫర్ టెక్నాలజీని ఉపయోగిస్తారు. రోడ్డులో ఏర్పాటు చేసిన ఛార్జింగ్ ప్లేట్ విద్యుత్ గ్రిడ్‌కు అనుసంధానమై ఉంటుంది. బస్సు ఆ ప్లేట్‌పైకి వచ్చినప్పుడు.. అందులోని కాయిల్స్ అయస్కాంత క్షేత్రాన్ని సృష్టిస్తాయి.
ఇదే సమయంలో బస్సు టైర్ల లోపల అమర్చిన ప్రత్యేక రిసీవింగ్ కాయిల్స్ ఈ అయస్కాంత క్షేత్రం నుంచి శక్తిని గ్రహిస్తాయి. అనంతరం ఆ విద్యుత్‌ను బస్సు బ్యాటరీకి పంపిస్తాయి. అంటే బయటకు కనిపించే ఛార్జింగ్ కేబుల్ లేకుండానే రోడ్డు నుంచి బస్సు బ్యాటరీకి విద్యుత్ చేరుతుంది.
విండక్షన్ టెక్నాలజీకి బాధ్యత వహిస్తున్న ETH జ్యూరిచ్ పూర్వ విద్యార్థి సిల్వాన్ ఫ్రికర్ ప్రకారం.. వాహనంలో భూమితో నిరంతరం సంబంధం కలిగి ఉండే ఏకైక భాగం చక్రం. అందుకే పవర్ ట్రాన్స్‌ఫర్ కోసం చక్రాన్ని ఉపయోగించే ఆలోచనను సంస్థ అభివృద్ధి చేసింది.
టైర్లలోనే కాయిల్స్ ఎందుకు?
సాధారణ వైర్‌లెస్ ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ వ్యవస్థల్లో ఒక కాయిల్‌ను రోడ్డులో, మరో కాయిల్‌ను వాహనం దిగువ భాగంలో ఏర్పాటు చేస్తారు. అయితే ఈ రెండు కాయిల్స్ మధ్య దూరం ఎక్కువగా ఉంటే.. విద్యుత్ బదిలీ సామర్థ్యంపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది.
విండక్షన్ ఈ సమస్యను తగ్గించేందుకు రిసీవింగ్ కాయిల్స్‌ను నేరుగా చక్రం లోపలే అమర్చే విధానాన్ని ఎంచుకుంది. దీనివల్ల రోడ్డులోని ఛార్జింగ్ ప్లేట్‌కు, బస్సు ఛాసిస్‌కు మధ్య ఉండే దూరం తగ్గుతుంది. ఫలితంగా విద్యుత్‌ను మరింత సమర్థంగా బదిలీ చేయవచ్చని కంపెనీ చెబుతోంది.
విండక్షన్ ప్రకారం.. ఈ వ్యవస్థ రోడ్డు నుంచి వాహనానికి 90 శాతానికి పైగా పవర్ ట్రాన్స్‌ఫర్ సామర్థ్యాన్ని సాధించింది. అంటే ఛార్జింగ్ సమయంలో బదిలీ అయ్యే విద్యుత్‌లో 10 శాతం కంటే తక్కువే నష్టపోతుందని కంపెనీ పేర్కొంటోంది.
ప్రత్యేక టైర్లు ఎందుకు అవసరం?
టైర్ నిరంతరం తిరుగుతూ ఉండటంతో.. దాని లోపల విద్యుత్ కాయిల్స్‌ను అమర్చడం సాధారణ టైర్లతో సాధ్యం కాదు. అందుకే విండక్షన్ తన సాంకేతికత కోసం భాగస్వాములతో కలిసి ప్రత్యేకమైన స్టీల్ రహిత టైర్లను అభివృద్ధి చేస్తోంది.
విండక్షన్ సీఈఓ లారిన్ ష్విట్టర్ వెల్లడించిన వివరాల ప్రకారం.. వ్యవస్థ సరిగ్గా పనిచేసేలా పూర్తిగా కొత్త డిజైన్‌తో ఈ టైర్లను తయారు చేస్తున్నారు. సాధారణ టైర్లతో పోలిస్తే వీటి ధర ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నప్పటికీ.. ఎలక్ట్రిక్ బస్సును కొనుగోలు చేసి, నిర్వహించడానికి అయ్యే మొత్తం వ్యయంతో పోలిస్తే ఈ అదనపు ఖర్చు పెద్దది కాదని కంపెనీ భావిస్తోంది.
ప్రయాణికులకు ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుంది?
ప్రస్తుతం ఈ టెక్నాలజీ నమూనా, పరీక్షల దశలోనే ఉంది. స్విట్జర్లాండ్‌లోని వింటర్‌థూర్‌లో విండక్షన్ ప్రత్యేక పరీక్షా మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేస్తోంది.
అన్నీ అనుకున్నట్లుగా జరిగితే 2028లో తొలి ప్రయాణికుల పైలట్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రయోగం విజయవంతమైతే.. భవిష్యత్తులో బస్‌స్టాప్‌ల వద్దే బస్సులను వైర్‌లెస్‌గా ఛార్జ్ చేసే విధానం పట్టణ ప్రజా రవాణాలో కీలక మార్పుగా మారే అవకాశం ఉంది.




