World Biofuel Day 2026: పెట్రోల్, డీజిల్‌కు ప్రత్యామ్నాయం ఇదే.. ఆగస్టు 10నే బయోఫ్యూయెల్ డే ఎందుకో తెలుసా?
World Biofuel Day 2026: వరల్డ్ బయోఫ్యూయెల్ డే సందర్భంగా బయోఫ్యూయెల్స్ ప్రాధాన్యత, ఇథనాల్, బయోడీజిల్, బయో-సీఎన్జీ ప్రయోజనాలు తెలుసుకోండి.
World Biofuel Day 2026
World Biofuel Day 2026: ప్రతేడాది ఆగస్టు 10వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా వరల్డ్ బయోఫ్యూయెల్ డే నిర్వహిస్తుంటారు. నేడు ప్రపంచాన్ని తీవ్రంగా వేధిస్తున్న వాతావరణ మార్పుల సంక్షోభం, పెరుగుతున్న పర్యావరణ కాలుష్యం నేపథ్యంలో ఈ రోజు కేవలం ఒక దినోత్సవంగా కాకుండా మానవాళి భవిష్యత్తుకు స్పష్టమైన దిశానిర్దేశం చేసే అత్యంత కీలకమైన వేదికగా మారింది. పెట్రోల్, డీజిల్ వంటి సాంప్రదాయ శిలాజ ఇంధనాలు పరిమితంగా ఉండటమే కాకుండా, వాటి వినియోగం వల్ల పెరిగే కార్బన్ ఉద్గారాలు పర్యావరణ సమతుల్యతను దెబ్బతీస్తున్నాయి. ఇటువంటి సమయంలో బయోడీజిల్, ఇథనాల్, బయోగ్యాస్ వంటి బయోఫ్యూయెల్స్ ప్రకృతి మనకు అందించిన సురక్షితమైన హరిత ప్రత్యామ్నాయాలుగా నిలుస్తున్నాయి.
చారిత్రక నేపధ్యం, భారత ప్రభుత్వ చొరవ
ఈ ప్రత్యేక రోజు వెనుక ఒక ఆసక్తికరమైన చారిత్రక సంఘటన ఉంది. డీజిల్ ఇంజిన్ పితామహుడైన సర్ రుడోల్ఫ్ డీజిల్ 1893 ఆగస్టు 10న మొదటిసారిగా వేరుశనగ నూనెతో ఒక యాంత్రిక ఇంజిన్‌ను విజయవంతంగా నడిపించి చూపించారు. ఒక వృక్షసంబంధిత నూనెతో ఇంజిన్ నడవడం ఆ కాలంలో ఒక అద్భుతం. రాబోయే శతాబ్దంలో సాంప్రదాయ ఇంధనాల స్థానాన్ని మొక్కలు, సేంద్రీయ వ్యర్థాల నుంచి తయారు చేసే ఇంధనాలే భర్తీ చేస్తాయని ఆయన ఆనాడే జోస్యం చెప్పారు. ఆయన గొప్ప పరిశోధనకు గుర్తుగా, బయోఫ్యూయెల్స్ పై అవగాహన పెంచడానికి భారత ప్రభుత్వ పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ 2015 నుంచి అధికారికంగా ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తోంది.
భారతదేశానికి బయోఫ్యూయెల్స్ ప్రాముఖ్యత
వేగంగా అభివృద్ధి చెందుతున్న భారతదేశానికి బయెఫ్యూయెల్ ఇంధన రంగం ఎంతో ప్రాధాన్యత కలిగినది. భారత్ తన ముడి చమురు అవసరాలలో 85% పైగా విదేశాల నుంచే దిగుమతి చేసుకుంటోంది. దీని కోసం ప్రతి సంవత్సరం లక్షల కోట్ల రూపాయల విదేశీ కరెన్సీని వెచ్చించాల్సి వస్తోంది. దేశీయంగా జైవిక ఇంధనాల ఉత్పత్తిని పెంచడం ద్వారా ముడి చమురు దిగుమతులను తగ్గించుకోవచ్చని, దీనివల్ల విదేశీ మారక ద్రవ్యం ఆదా అవ్వడమే కాకుండా భారత్ ఇంధన రంగంలో స్వయం సమృద్ధి సాధిస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు.
రైతాంగానికి అదనపు ఆదాయం - గ్రామీణ ఆర్థిక ప్రగతి
జైవిక ఇంధనాల తయారీకి కావలసిన ముడి సరుకు మన పొలాల్లో, పరిసరాల్లో పుష్కలంగా లభిస్తుంది. చెరకు, జొన్న, మొక్కజొన్న, పాడైన ధాన్యం, పంట వ్యర్థాలు, పత్తి కట్టెలు, వ్యర్థ వంటనూనెల నుంచి ఇథనాల్, బయోడీజిల్‌ను తయారు చేస్తున్నారు. రైతులు తమ పొలాల్లో మిగిలిపోయే వ్యర్థాలను ఇథనాల్ కర్మాగారాలకు విక్రయించడం ద్వారా పంట దిగుబడితో పాటు అదనపు ఆదాయాన్ని పొందుతున్నారు. ఇది కేవలం ఇంధన ప్రత్యామ్నాయంగానే కాక గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే ప్రధాన సాధనంగా మారింది.
బయోఫ్యూయెల్ రకాలు, మోడ్రన్ టెక్నాలజీ
ఉత్పత్తి ఆధారంగా జైవిక ఇంధనాలను ప్రధానంగా క్రింది రకాలుగా వర్గీకరించవచ్చు:
* బయో-ఇథనాల్ : చెరకు, మొక్కజొన్న వంటి చక్కెర, పిండి పదార్థాల ఆధారిత పంటలను కిణ్వ ప్రక్రియ ద్వారా ప్రాసెస్ చేసి దీనిని తయారు చేస్తారు. దీనిని పెట్రోల్‌లో కలిపి వాహనాల్లో వాడుతున్నారు.
* బయో-డీజిల్ : నాన్-ఎడిబుల్ వెజిటబుల్ ఆయిల్స్, జంతువుల కొవ్వు, వాడేసిన వంటనూనెల నుండి దీనిని తయారు చేస్తారు. దీనిని నేరుగా డీజిల్ వాహనాల్లో వాడవచ్చు.
* అధునాతన జైవిక ఇంధనాలు (2G & 3G): పంట వ్యర్థాలు, కర్ర పొడి (2G), నాచు/ఆల్గే (3G) నుంచి మోడ్రన్ టెక్నాలజీతో ఈ ఇంధనాలను తయారు చేస్తున్నారు.
* బయో-సిఎన్జీ : పేడ, ఆహార వ్యర్థాలు, వ్యర్థ జలాల శుద్ధి ద్వారా మిథేన్ వాయువును శుద్ధి చేసి సిఎన్జీ వాహనాలు, పరిశ్రమలలో ఉపయోగిస్తున్నారు.
భారత ప్రభుత్వ విప్లవాత్మక పథకాలు
జైవిక ఇంధన రంగాన్ని ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వం జాతీయ జైవిక ఇంధన విధానం(National Policy on Biofuels) ద్వారా పెట్రోల్‌లో 20% ఇథనాల్ బ్లెండింగ్ లక్ష్యాన్ని నిర్దేశించుకోగా, ఇప్పటికే దేశంలో E20 ఇంధన విక్రయాలు వేగవంతమయ్యాయి. గోబర్-ధన్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో పేడ, సేంద్రీయ వ్యర్థాల నుంచి బయో-సిఎన్జీ తయారు చేస్తూ పారిశుధ్యంతో పాటు రైతులకు ఆర్థిక ప్రయోజనం చేకూరుస్తున్నారు. ఎఫ్ఎస్ఎస్ఏఐ (FSSAI) ప్రారంభించిన రూకో (Repurpose Used Cooking Oil) ద్వారా హోటళ్లలోని వాడేసిన నూనెను సేకరించి బయోడీజిల్‌గా మారుస్తున్నారు. అలాగే పీఎం జీ-వన్ (PM JI-VAN Scheme) పథకం ద్వారా 2G ఇథనాల్ ప్రాజెక్టులకు ఆర్థిక సాయం అందిస్తున్నారు.




