Yamaha FZ Blue Flex : యమహా కొత్త బైక్.. E85 ఫ్యూయల్‌తో రన్!
Yamaha FZ Blue Flex : ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఇండియా యమహా మోటార్ దేశీయ మార్కెట్లోకి తన సరికొత్త 'ఎఫ్‌జెడ్ బ్లూ ఫ్లెక్స్' (FZ Blue Flex) మోటార్
Yamaha FZ Blue Flex
Yamaha FZ Blue Flex : ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఇండియా యమహా మోటార్ దేశీయ మార్కెట్లోకి తన సరికొత్త 'ఎఫ్‌జెడ్ బ్లూ ఫ్లెక్స్' (FZ Blue Flex) మోటార్‌సైకిల్‌ను అధికారికంగా విడుదల చేసింది. ఢిల్లీలో దీని ఎక్స్-షోరూమ్ ధరను రూ. 1,24,240 గా నిర్ణయించారు. యమహా సంస్థ నుండి ఇథనాల్ ఆధారిత ఇంధనాలతో నడిచేలా ప్రత్యేకంగా రూపొందించిన మొట్టమొదటి ఫ్లెక్స్-ఫ్యూయల్ మోడల్ ఇదే కావడం విశేషం.
ఇంజన్, పనితీరు
యమహా ఎఫ్‌జెడ్ బ్లూ ఫ్లెక్స్ బైక్‌లో అందరికీ సుపరిచితమైన 149cc, సింగిల్-సిలిండర్, ఎయిర్-కూల్డ్, ఫ్యూయల్-ఇంజెక్టెడ్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. అయితే, రోజువారీ వినియోగంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎక్కువ మొత్తంలో ఇథనాల్ మిశ్రమం ఉండే ఇంధనాలపై నడిచేలా ఈ ఇంజన్‌ను కంపెనీ అప్‌గ్రేడ్ చేసింది. ఈ ఇంజన్ 7,250 ఆర్‌పిఎమ్ వద్ద 11.7 బిహెచ్పి పవర్‌ను, అలాగే 6,000 ఆర్‌పిఎమ్ వద్ద 12.8 ఎన్ఎమ్ పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది నమ్మకమైన 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో అనుసంధానించబడి ఉంటుంది.
అదిరిపోయే డిజైన్, బాడీ ఫీచర్లు
లుక్స్ , డిజైన్ పరంగా ఈ సరికొత్త బైక్ ప్రస్తుత స్టాండర్డ్ ఎఫ్‌జెడ్ సిరీస్ శైలిలోనే ఉంటుంది. ఇందులో ఇంటిగ్రేటెడ్ పొజిషన్ ల్యాంప్స్‌తో కూడిన ఫుల్-ఎల్ఈడి (LED) ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్, ఏరోడైనమిక్ ఎక్స్టెన్షన్స్, ఫాక్స్ ఎయిర్ వెంట్స్‌తో ఉన్న మస్కులర్ ఫ్యూయల్ ట్యాంక్‌ను అమర్చారు. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాన్ని అందించేందుకు సింగిల్-పీస్ సీట్, ఆకర్షణీయమైన ఎల్ఈడి టైల్ ల్యాంప్‌ను అందించారు. అలాగే రైడింగ్ కంఫర్ట్ కోసం ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్క్స్, వెనుక వైపు స్వింగ్ఆర్మ్ సస్పెన్షన్స్ ఇచ్చారు. దీనికి తోడు భద్రతను మరింత మెరుగుపరచడానికి డిస్క్ బ్రేకులతో పాటు అత్యాధునిక ఏబీెస్ (ABS) సిస్టమ్‌ను కూడా జోడించారు.
లభ్యత, రంగులు
ఈ మోటార్‌సైకిల్ ప్రస్తుతం ఒకే ఒక ఆకర్షణీయమైన 'మెటాలిక్ బ్లాక్' (Metallic Black) కలర్ ఆప్షన్లో మాత్రమే అందుబాటులోకి రానుంది. ప్రాథమికంగా దీనిని ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ , తమిళనాడు రాష్ట్రాల్లోని ఎంపిక చేసిన యమహా 'బ్లూ స్క్వేర్' (Blue Square) డీలర్‌షిప్‌ల ద్వారా మాత్రమే వినియోగదారులకు విక్రయించనున్నారు.
పర్యావరణ హితం.. యమహా వ్యూహం
ఈ లాంచ్ సందర్భంగా యమహా మోటార్ ఇండియా గ్రూప్ చైర్మన్ హాజిమే అటావో మాట్లాడుతూ, కార్బన్ ఉద్గారాలను తగ్గించడం (కార్బన్ న్యూట్రాలిటీ) అనేది ఏదో ఒకే సాంకేతికతపై ఆధారపడి సాధ్యం కాదని, దీనికి బహుళ మార్గాల విధానం అవసరమని పేర్కొన్నారు. భారత ప్రభుత్వం తీసుకొస్తున్న బయో-ఫ్యూయల్ విధానాలకు అనుగుణంగా, సంస్థ గ్లోబల్ సస్టైనబిలిటీ లక్ష్యానికి చేరుకోవడానికి ఈ బ్లూ ఫ్లెక్స్ టెక్నాలజీ ఎంతగానో దోహదపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. భారతదేశంలో ఇథనాల్ బ్లెండింగ్ ఇంధన వాడకం వేగంగా పుంజుకుంటున్న తరుణంలో, పర్యావరణానికి తక్కువ హాని కలిగించే, అలాగే 85% వరకు ఇథనాల్ కలిగిన ఇంధనాన్ని వాడుకునే వెసులుబాటును కల్పిస్తూ యమహా తెచ్చిన ఈ ఎఫ్‌జెడ్ బ్లూ ఫ్లెక్స్ వాహనదారులకు ఒక అద్భుతమైన ప్రత్యామ్నాయంగా మారనుంది.




