Powerful Hanuman Temples in India: జీవితంలో ఒక్కసారైనా దర్శించవలసిన అత్యంత శక్తివంతమైన హనుమ ఆలయాలు

Powerful Hanuman Temples in India: జీవితంలో మనకు కష్టాలు, నష్టాలు, సంకటాలు ఎదురైనపుడు మన అడుగులు తెలియకుండానే ఆంజనేయుడి ఆలయం వైపు పడతాయి.

Balachander
Published on: 23 April 2026 8:58 AM IST
Powerful Hanuman Temples in India
X

Powerful Hanuman Temples in India: జీవితంలో ఒక్కసారైనా దర్శించవలసిన అత్యంత శక్తివంతమైన హనుమ ఆలయాలు

Powerful Hanuman Temples in India: జీవితంలో మనకు కష్టాలు, నష్టాలు, సంకటాలు ఎదురైనపుడు మన అడుగులు తెలియకుండానే ఆంజనేయుడి ఆలయం వైపు పడతాయి. అంజనీపుత్రా పాహిమాం పాహిమాం...రక్షమాం రక్షమాం అంటూ ఆయన ముందు సాగిలపడతాం. ఎటువంటి భయాలనైనా, బాధలనైనా ఆయన తీరుస్తాడనే నమ్మకం. భారతదేశంలో హనుమంతుడి ఆలయం లేని గ్రామం బహుశా మనకు కనిపించదు. హనుమంతుడికి ఎన్ని ఆలయాలు ఉన్నప్పటికీ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న ఐదు ఆలయాలు ప్రత్యేకమే చెప్పాలి. మహిమాన్వితమైన అత్యంత శక్తివంతమైన ఈ ఆలయాలను జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాలని అంటారు.

స్త్రీ రూపంలో హనుమంతుడు - గిరిజాబంధ్ (ఛత్తీస్‌గఢ్)

హనుమంతుడు అంటే మనకు బ్రహ్మచారి, మహావీరుడిగా తెలుసు. కానీ, ఈ క్షేత్రంలో హనుమంతుడు స్త్రీ వేషధారణలో దర్శనమిస్తారు. చూసేందుకు వింతగా ఉన్నప్పటికీ ఈ ఆలయం అత్యంత మహిమాన్వితమైనదిగా చెబుతారు. స్వామివారి భుజాలపై రామలక్ష్మణులు, పాదాల కింద అహిరావణ, మహిరావణులు ఉండటం విశేషం. సంతాన సమస్యలతో బాధపడేవారు, కష్టాల సుడిగుండాల్లో చిక్కుకున్నవారు స్వామిని దర్శించుకుంటే వాటినుంచి బయటపడతారని చెబుతారు.

నిద్రపోతున్న హనుమ - ప్రయాగ్‌రాజ్ (ఉత్తరప్రదేశ్)

ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగమ తీరాన స్వామి వారు సుమారు 20 అడుగుల భారీ కాయంతో శయన ముద్రలో దర్శనం ఇవ్వడం ఈ క్షేత్రం ప్రత్యేకత. గంగానది ఉప్పొంగినప్పుడు స్వామి వారి పాదాలను తాకడం ఇక్కడి ప్రకృతి సిద్ధమైన అభిషేకం. ప్రతి ఏడాది ఇలా స్వామివారి పాదాలను గంగమ్మ తాకుతుంది. స్వామివారు సీతమ్మ జాడను తెలుసుకునేందుకు బయలుదేరినప్పటి నుంచి లంకను జయించేవరకు అలుపులేకుండా పనిచేస్తారు. ఆ తరువాత అలసిపోయిన హనుమయ్య ఇక్కడ విశ్రాంతి తీసుకున్నాడని పురాణాలు చెబుతున్నాయి.

శీర్షాసన హనుమాన్‌ - సావేర్ (మధ్యప్రదేశ్)

దీనిని 'ఉల్టా హనుమాన్' ఆలయం అంటారు. పాతాళ లోకానికి వెళ్లే సమయంలో స్వామి శీర్షాసన ముద్రలో వెళ్లారట. అందుకే ఇక్కడ విగ్రహం తల కిందకు, కాళ్లు పైకి ఉంటాయి. ఈ వింత రూపాన్ని చూడటం ఒక అద్భుత అనుభూతి. అహిరావణుడిని అంతం చేయడానికి ఈ రూపం ధరించినట్టుగా పురాణాలు చెబుతున్నాయి.

రెండు విగ్రహాల అభయం - మహావీర్ మందిర్ (బీహార్)

సాధారణంగా ఒక గర్భాలయంలో ఒక విగ్రహం ఉంటుంది. కానీ, పాట్నాలోని మహావీర్‌ మందిర్‌లో రెండు హనుమాన్‌ విగ్రహాలు పక్కపక్కనే ఉంటాయి. ఒకటి దుష్టశిక్షణకు, మరొకటి భక్త రక్షణకు ప్రతీకలు. సామాజిక సేవలో కూడా ఈ ఆలయం తిరుమల తర్వాత అంతటి ఖ్యాతిని గడించింది.

104 అడుగుల గంభీర రూపం - హనుమత్ ధామ్ (ఉత్తరప్రదేశ్)

గార నది ఒడ్డున, నది మధ్యలో వెలసిన ఈ 104 అడుగుల ఎత్తైన విగ్రహం భక్తులలో ధైర్యాన్ని నింపుతుంది. తన హృదయంలో సీతారాములను చూపిస్తున్న స్వామి వారి ముద్ర ఇక్కడ భక్తులను కట్టిపడేస్తుంది. ఇక్కడికి వచ్చే భక్తుల్లో ధైర్యం నింపడంతో పాటు కష్టాల నుంచి గట్టెక్కిస్తాడని భక్తులు విశ్వసిస్తారు.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story