Krishna Janmashtami: చెరసాలలో కన్నయ్య జననం..కంసుడి చావుకు నాంది పలికిన ఆ నింగి అశరీరవాణి కథ ఇదే!

Krishna Janmashtami: భద్రపద మాసంలో వచ్చే కృష్ణ పక్ష అష్టమి తిథి మనకు అత్యంత పవిత్రమైనది.

CR Reddy
Published on: 4 Sept 2026 8:20 AM IST
Krishna Janmashtami
X

Krishna Janmashtami  

Krishna Janmashtami: భద్రపద మాసంలో వచ్చే కృష్ణ పక్ష అష్టమి తిథి మనకు అత్యంత పవిత్రమైనది. కంసుడి కఠినమైన చెరసాలలో జగన్నాథుడు శ్రీకృష్ణుడిగా జన్మించిన పవిత్ర ఘట్టం. ద్వాపర యుగంలో మధురా నగరాన్ని ఏలుతున్న భోజవంశరాజు ఉగ్రసేనుడిని పదవి నుంచి దించి ఆయన కుమారుడు కంసుడు అక్రమంగా రాజ్య సింహాసనాన్ని చేజిక్కించుకున్నాడు. కంసుడికి తన చెల్లెలు దేవకి అంటే ఎంతో ప్రాణం. ఆమెకు యాదవ వీరుడైన వసుదేవుడితో వైభవంగా వివాహం జరిపించి గారభంగా అత్తవారింటికి సాగనంపుతున్న సమయంలో ఒక్కసారిగా పిడుగుపాటులా ఆకాశవాణి వినిపించింది. దేవకి గర్భంలో జన్మించే ఎనిమిది సంతానమే నిన్ను అంతమొందిస్తుందని ఆ దివ్యవాణి హెచ్చరించింది. దాంతో భయాందోళనకు గురైన కంసుడు వెంటనే వసుదేవుడిని చంపబోయాడు. తన పిల్లలను కంసుడికి అప్పగిస్తానని వసుదేవుడు వాగ్దానం చేయడంతో వారిద్దరినీ మధురలోని చెరసాలలో బంధించాడు.

ఏడు సంతానాల సంహారం

వసుదేవుడు ఇచ్చిన మాట ప్రకారం దేవకికి పుట్టిన ఏడుగురు పిల్లలను కంసుడికి అప్పగించగా, కంసుడు కనీసం జాలి లేకుండా ఆ పసికందులను రాతికేసి కొట్టి చంపేశాడు. ఎనిమిదోసారి దేవకి గర్భం ధరించినప్పుడు ఆమె ముఖంలో దివ్యమైన కాంతి, కళ్లలో వింత తేజస్సు కనిపించాయి. తనను అంతమొందించే శత్రువు రాబోతున్నాడని గ్రహించిన కంసుడు చెరసాల చుట్టూ కాపలాను మరింత కఠినతరం చేశాడు. దైవిక ఘడియలు దగ్గరపడుతున్న వేళ దేవతలందరూ ఆకాశం నుంచి ఆ దివ్య గర్భాన్ని స్తుతించారు.

రోహిణి నక్షత్రంలో జగన్నాథుని జననం

అర్ధరాత్రి వేళ ఆకాశంలో నల్లటి మబ్బులు పట్టి ఉరుములు, మెరుపులు ప్రారంభమయ్యాయి. సరిగ్గా రోహిణి నక్షత్రం, అష్టమి తిథి కలయికలో అర్ధరాత్రి వేళ శంఖు చక్ర గదాధరుడై శ్రీమహావిష్ణువు దేవకి, వసుదేవులకు దర్శనమిచ్చాడు. తనను వెంటనే గోకులంలోని యశోద వద్దకు చేర్చి, అక్కడ జన్మించిన యోగమాయను ఇక్కడికి తీసుకురావాలని ఆదేశించాడు. భగవంతుడి లీల వల్ల చెరసాల తలుపులు తమంతట తామే తెరుచుకున్నాయి. రక్షకులు మూర్ఛపోయారు. యమునా నది మార్గం సుగమం చేయగా, వసుదేవుడు పసికందును బుట్టలో పెట్టుకుని గోకులం చేర్చాడు. యశోద పక్కన ఉన్న బాలికను తీసుకుని తిరిగి చెరసాలకు చేరుకున్నాడు.

కంసుడికి యోగమాయ షాక్

పాపాయి ఏడుపు విన్న రక్షకులు మేల్కొని వెంటనే కంసుడికి సమాచారం అందించారు. కంసుడు పరుగున వచ్చి ఆ పసిపాపను లాక్కుని రాతికేసి కొట్టడానికి పైకి లేపాడు. ఆ క్షణంలో ఆ చిన్నారి యోగమాయగా మారి ఆకాశంలోకి ఎగిరిపోయింది. 'ఓరి మూర్ఖుడా! నన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నావు, నిన్ను చంపే శక్తి ఇప్పటికే భూమిపై జన్మించింది, ఆయన సురక్షితంగా ఉన్నాడు' అని ఉరుములేని పిడుగులా హెచ్చరించి మాయమైంది. ఆ మాటలతో కంసుడి గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున ఈ వ్రత కథను పఠించడం వల్ల సర్వపాపాలు తొలగిపోతాయి. అధర్మంపై ధర్మం సాధించిన ఈ విజయ గాథ మనందరిలో భక్తి భావాన్ని, విశ్వాసాన్ని నింపుతుంది.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.