Parama Ekadashi : మూడేళ్లకోసారి వచ్చే పరమ ఏకాదశి.. ఒక్క రోజు ఈ పూజ చేస్తే ఏడు జన్మల పాపాలు పటాపంచల్
Parama Ekadashi : జూన్ 11న గురువారం నాడు వచ్చే పవిత్ర పరమ ఏకాదశి పూజా విధానం, పిండి దీపాల విశిష్టత, దరిద్ర బాధలు తొలగించే అద్భుతమైన పరిహారాల పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Parama Ekadashi : హిందూ సంప్రదాయంలో ఏకాదశి వ్రతానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. అయితే పురుషోత్తమ మాసం (అధిక మాసం)లో వచ్చే ఏకాదశికి ఉండే శక్తే వేరు. ఈ ఏడాది జూన్ 11వ తేదీన గురువారంతో కలిసి వస్తున్న పరమ ఏకాదశి అత్యంత అరుదైనదిగా పండితులు చెబుతున్నారు. ప్రతి మూడేళ్లకు ఒకసారి మాత్రమే వచ్చే ఈ తిథి, శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైన గురువారంతో కలిసి రావడం వల్ల దీని విశిష్టత కోటి రెట్లు పెరిగింది. ఈ పవిత్రమైన రోజున లక్ష్మీ సమేత విష్ణుమూర్తిని, కలియుగ దైవమైన వేంకటేశ్వర స్వామిని భక్తిశ్రద్ధలతో కొలిస్తే జీవితంలోని కష్టాలన్నీ తీరిపోయి, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని ప్రగాఢ నమ్మకం.
ఉదయకాల పూజా విధానం, నియమాలు
ఈ పవిత్రమైన రోజున ముఖ్యంగా మహిళలు ఉదయాన్నే బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి చన్నీటితో తలస్నానం చేయాలి. ఇళ్లను శుభ్రం చేసుకుని, లక్ష్మీదేవి ఆహ్వానానికి గుర్తుగా ఇంటి గుమ్మానికి పసుపు రాసి, కుంకుమ బొట్లు పెట్టి, అందమైన ముగ్గులు వేసుకోవాలి. పూజ గదిలోని దేవుడి పటాలను గంధం, కుంకుమతో అలంకరించి దీపారాధన సిద్ధం చేసుకోవాలి. ఈ రోజున పూజ చేసే స్త్రీలు తమ కాళ్లకు పసుపు, కుంకుమలు రాసుకోవడం ఎంతో శుభకరం. అలాగే విష్ణువుకు ఇష్టమైన పసుపు రంగు వస్త్రాలను ధరించడం వల్ల జాతకంలో గురు బలం పెరుగుతుంది.
తులసి దళాల ప్రాముఖ్యత, స్వామివారి అలంకరణ
గోవిందుని పూజలో తులసి దళాలకు ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. తులసి ఆకులు లేని విష్ణు పూజ సంపూర్ణ ఫలితాన్ని ఇవ్వదు. అందుకే పూజకు ముందే తులసి ఆకులను సిద్ధం చేసుకోవాలి. ఈ రోజున భక్తితో స్వామివారి పాదాల చెంత కేవలం రెండు తులసి ఆకులు ఉంచినా సరే, కోరిన కోర్కెలు నెరవేరుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. పూజా పీఠంపై వేంకటేశ్వర స్వామి చిత్రపటానికి తులసి మాల వేసి, రాగి చెంబులో శుద్ధమైన నీటిని, అక్షింతలను సిద్ధం చేసుకొని స్వామివారిని ధ్యానించాలి.
పిండి దీపాల అద్భుత మహిమ, నైవేద్యం
పరమ ఏకాదశి నాడు పిండి దీపాలు వెలిగించడం అత్యంత విశేషమైన ఫలితాలను ఇస్తుంది. బియ్యప్పిండిలో తగినంత బెల్లం తురుము, పచ్చి ఆవు పాలు, శుద్ధమైన ఆవు నెయ్యి కలిపి రెండు ప్రమిదలను తయారు చేయాలి. వీటికి కుంకుమ బొట్లు పెట్టి, ఆవు నెయ్యి వేసి, ఒక్కో దీపంలో ఐదు వత్తుల చొప్పున వేసి స్వామివారి ముందు వెలిగించాలి. అనంతరం ఓం నమో భగవతే వాసుదేవాయ అనే శక్తివంతమైన మంత్రాన్ని 21 లేదా 108 సార్లు జపించాలి. స్వామివారికి నైవేద్యంగా అరటి పండ్లు, వడపప్పు, పానకం లేదా చిన్న బెల్లం ముక్కను సమర్పించి, కర్పూర హారతితో పూజను ముగించాలి.
ఉపవాస దీక్ష, ఖచ్చితమైన నిషేధాలు
ఏకాదశి రోజున రోజంతా కఠిన ఉపవాసం ఉండటం ఉత్తమం. ఒకవేళ ఆరోగ్య కారణాల వల్ల అది సాధ్యం కాని వారు పాలు, పండ్లు తీసుకుంటూ సాయంత్రం వేళ సాత్విక ఆహారం తినవచ్చు. ఈ రోజున అన్నం తినడం పూర్తిగా నిషిద్ధం. ఏకాదశి నాడు అన్నంలో మురాసురుడు అనే రాక్షసుడు నివసిస్తాడని, ఆ రోజు అన్నం తింటే బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంటుందని పురాణాల నమ్మకం. అలాగే ఈ రోజున తలకు నూనె పెట్టడం, గోళ్లు లేదా జుట్టు కత్తిరించడం వంటి పనులు అస్సలు చేయకూడదు, ఇవి దరిద్రాన్ని పెంచుతాయి. వంకాయ, ఉల్లిపాయ, వెల్లుల్లి, మునగకాయలను కూడా ఈరోజు వంటల్లో వాడకూడదు.
అప్పులు, దరిద్ర బాధలు తొలగించే ప్రత్యేక పరిహారాలు
జీవితంలో ఉన్న రకరకాల సమస్యల నుంచి బయటపడటానికి ఈ రోజు కొన్ని సులభమైన పరిహారాలు చేయవచ్చు. అప్పుల బాధలతో సతమతమవుతున్న వారు రావి చెట్టుకు నీరు పోసి, ఐదు ప్రదక్షిణలు చేసి, నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే ధనప్రాప్తి కలుగుతుంది. రాగి చెంబులోని నీటిని విష్ణు గాయత్రీ మంత్రంతో అభిమంత్రించి ఇల్లంతా చల్లితే దరిద్రం పోయి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది. గృహ దోషాలు, నరదిష్టి పోవడానికి ఇంటి గుమ్మంపై గోమూత్రం చల్లాలి. సంతానం లేని వారు నల్లని ఆవుకు ఐదు అరటి పండ్లు తినిపించడం వల్ల సత్ఫలితం ఉంటుంది. సాయంత్రం 6 గంటల తర్వాత ఇంటి గుమ్మం ఇరువైపులా దీపాలు వెలిగించి, పేదలకు అన్నదానం చేయడం వల్ల కోటి రెట్ల పుణ్యం లభిస్తుంది.




