Reactor Blast: ఫార్మా కంపెనీలో ఘోర ప్రమాదం.. ఇద్దరు మృతి.. 11 మందికి గాయాలు
Reactor Blast: యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‌పోచంపల్లి మండలం దోతిగూడెంలోని హెజిలో ఫార్మా కంపెనీలో అర్ధరాత్రి ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.
Reactor Blast
Reactor Blast: యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‌పోచంపల్లి మండలం దోతిగూడెంలోని హెజిలో ఫార్మా కంపెనీలో అర్ధరాత్రి ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. భారీ శబ్దంతో రియాక్టర్ పేలి ఇద్దరు కార్మికులు అక్కడికక్కడే దుర్మరణం చెందగా, మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం తర్వాత ఎగిసిపడిన మంటలు, విషవాయువులు స్థానిక గ్రామాలను భయాందోళనకు గురిచేశాయి. శుక్రవారం రాత్రి సుమారు 10:30 గంటల సమయంలో దోతిగూడెంలో ఉన్న హెజిలో ఫార్మా పరిశ్రమలో ఉన్నట్టుండి భారీ పేలుడు సంభవించింది. రియాక్టర్ ఒక్కసారిగా పేలడంతో వచ్చిన పెద్ద శబ్దానికి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. కర్మాగారం నుంచి ఆకాశాన్నంటేలా మంటలు ఎగిసిపడటంతో పాటు దట్టమైన పొగ కమ్ముకుంది. ప్రమాద సమయంలో లోపల పదిమందికి పైగా కార్మికులు విధుల్లో ఉన్నారు. ప్రమాద తీవ్రతకు ఇద్దరు కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, తీవ్రంగా గాయపడిన మరో 11 మందిని అంబులెన్సుల్లో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
గ్రామాలను కమ్మేసిన దట్టమైన పొగ, రసాయన వాసన
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు శ్రమించారు. రసాయనాలు లీక్ కావడం వల్ల పరిసర ప్రాంతాల్లో పొగ మరింత దట్టంగా వ్యాపించింది. ఘాటైన రసాయనాల వాసన రావడంతో దోతిగూడెం, అంతమ్మగూడెం గ్రామాల ప్రజలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శ్వాస తీసుకోవడం కష్టంగా మారడంతో చిన్నపిల్లలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రమాద స్థలంలో ఇంకా సహాయక చర్యలు కొనసాగుతుండటంతో మృతుల సంఖ్యపై పూర్తి స్పష్టత రావాల్సి ఉంది.
మూడు నెలల వ్యవధిలోనే రెండోసారి ప్రమాదం
ఈ హెజిలో ఫార్మా కంపెనీలో ప్రమాదాలు జరగడం ఇది మొదటిసారి కాదు. గత మూడు నెలల కాలంలోనే రియాక్టర్ పేలడం ఇది రెండోసారి కావడం గమనార్హం. వరుస ప్రమాదాలు జరుగుతున్నా యాజమాన్యం సరైన నివారణ చర్యలు తీసుకోకపోవడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పరిశ్రమలో కనీస భద్రతా ప్రమాణాలు పాటించడం లేదని, అధికారుల పర్యవేక్షణ లోపం వల్లే కార్మికుల ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయని ఆరోపిస్తున్నారు.
సమగ్ర దర్యాప్తునకు డిమాండ్
ఫార్మా కంపెనీల నిర్లక్ష్యం వల్ల తమ ప్రాణాలకు రక్షణ లేకుండా పోతోందని పరిసర గ్రామాల ప్రజలు ఆందోళన బాటపట్టారు. అసలు ఈ ప్రమాదానికి గల కారణాలు ఏమిటి? నిబంధనల ప్రకారం భద్రతా చర్యలు తీసుకుంటున్నారా లేదా? అనే అంశాలపై ప్రభుత్వ అధికారులు సమగ్ర విచారణ జరిపించాలని కోరుతున్నారు. బాధితులకు తగిన నష్టపరిహారం అందించి, నిబంధనలు ఉల్లంఘించిన కంపెనీపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.




