Nellore: విద్యుత్ భవనంలో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ ఘనంగా
Nellore: విద్యుత్ భవనంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఉన్నతాధికారులు పాల్గొని రాజ్యాంగ విలువలపై ప్రసంగించారు.
Nellore
Nellore: విద్యుత్ భవనంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ఎక్స్-ఆఫిషియో స్పెషల్ చీఫ్ సెక్రటరీ కె. విజయానంద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా మరియు ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ శివశంకర్ లోతేటి సమక్షంలో విగ్రహ ఆవిష్కరణ జరిగింది.
ఈ సందర్భంగా కె. విజయానంద్ మాట్లాడుతూ, డాక్టర్ అంబేద్కర్ రూపొందించిన భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అత్యంత సమగ్రమైన రాజ్యాంగాలలో ఒకటిగా నిలిచిందని తెలిపారు. భిన్న సంస్కృతులు, భాషలు, మతాలు కలిగిన భారతదేశాన్ని ఒకే దారిలో నడిపించే శక్తి రాజ్యాంగంలో ఉందని పేర్కొన్నారు. రాజ్యాంగ విలువలను కాపాడుకోవడం ముఖ్యమని, ప్రజాసేవలో ఉన్న అధికారులు ఆ సూత్రాలను పాటించాలని సూచించారు.
జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా మాట్లాడుతూ, అంబేద్కర్ రచించిన రాజ్యాంగం దేశ ప్రజాస్వామ్యానికి పునాది వేసిందని తెలిపారు. ప్రతి పౌరుడికి రక్షణగా నిలుస్తూ సమానత్వాన్ని బలపరుస్తుందని పేర్కొన్నారు. ప్రభుత్వ అధికారులు రాజ్యాంగ స్ఫూర్తిని ప్రతిబింబించేలా విధులు నిర్వహించాలని సూచించారు.
అదేవిధంగా శివశంకర్ లోతేటి మాట్లాడుతూ, విద్యుత్ భవనంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం సంస్థకు గౌరవకరమైన విషయమని తెలిపారు. అంబేద్కర్ ఆలోచనలు సమాజానికి మార్గదర్శకమని, సమానత్వం, న్యాయం వంటి విలువలను ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో డైరెక్టర్ (టెక్నికల్) కె. గురవయ్య, జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు, ట్రైనీ కలెక్టర్ పవన్ కుమార్, చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ జనార్దన్ నాయుడు, జిల్లా సూపరింటెండింగ్ ఇంజనీర్ కె. రాఘవేంద్రం తదితరులు పాల్గొన్నారు.




