CM Vijay: స్టాలిన్ ఆస్తులు బయటపెట్టాలి.. సీఎం విజయ్ సంచలన సవాల్!

CM Vijay : తమిళనాడు రాజకీయాల్లో సీఎం విజయ్, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ మధ్య మాటల యుద్ధం మరింత ముదురుతోంది.

G Krishna
Updated on: 25 Sept 2026 7:40 PM IST
CM Vijay
X

CM Vijay: స్టాలిన్ ఆస్తులు బయటపెట్టాలి.. సీఎం విజయ్ సంచలన సవాల్!

CM Vijay: తమిళనాడు రాజకీయాల్లో సీఎం విజయ్, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ మధ్య మాటల యుద్ధం మరింత ముదురుతోంది. మదురాంతకం ఉపఎన్నిక ప్రచారంలో పాల్గొన్న విజయ్.. స్టాలిన్ రాజకీయాల్లోకి రాకముందు, వచ్చిన తర్వాత ఉన్న ఆస్తుల వివరాలను బయటపెట్టాలని సవాల్ చేశారు. అవినీతిపై తమ పార్టీ ప్రశ్నలు కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. అయితే, తన ఆరోపణలకు సంబంధించి నిర్దిష్ట ఆధారాలను విజయ్ ఈ సభలో వెల్లడించలేదు.

‘అవినీతిని సహించం’.. విజయ్ ఘాటు వ్యాఖ్యలు

మదురాంతకం ప్రచార సభలో విజయ్ మాట్లాడుతూ.. అవినీతికి పాల్పడుతున్న వారిని తమ ప్రభుత్వం వదిలిపెట్టదని అన్నారు. ప్రజలను ఇకపై మోసం చేయలేరంటూ ప్రత్యర్థి పార్టీలపై విమర్శలు చేశారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయకుండా సాధారణ కుటుంబాల నుంచి వచ్చిన వ్యక్తులు కూడా పాలన అందించగలరని పేర్కొన్నారు. ప్రజల సొమ్మును తాము ముట్టుకోబోమని, ఇతరులు కూడా ముట్టుకోకుండా చూస్తామని విజయ్ అన్నారు. గత ప్రభుత్వాల పాలనలో అవినీతికి సంబంధించిన అంశాలను తమ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రస్తావించిందని చెప్పారు. అయితే ఆధారాలు చూపించాలని, కొన్ని అంశాలు కోర్టు పరిధిలో ఉన్నందున వాటిపై చర్చించకూడదని అభ్యంతరాలు వ్యక్తమయ్యాయని విజయ్ పేర్కొన్నారు.

స్టాలిన్‌ను నేరుగా టార్గెట్ చేసిన విజయ్

తన ప్రసంగంలో విజయ్ నేరుగా స్టాలిన్‌ను ఉద్దేశించి పలు ప్రశ్నలు సంధించారు. రాజకీయాల్లోకి రాకముందు, వచ్చిన తర్వాత తన ఆస్తుల వివరాలను ప్రజల ముందు ఉంచగలరా? ప్రజాధనాన్ని ఎప్పుడూ దుర్వినియోగం చేయలేదని చెప్పగలరా? తమ పార్టీ అవినీతికి దూరంగా ఉంటుందని హామీ ఇవ్వగలరా? అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నలే తమ పార్టీ ప్రచారంలో ప్రధాన అంశాలని విజయ్ చెప్పారు. దశాబ్దాలుగా తమిళనాడు రాజకీయ వ్యవస్థను తాను గమనిస్తున్నానని, అందుకే పాత విషయాలను పదేపదే ప్రస్తావిస్తున్నాననే విమర్శలను పట్టించుకోబోనని స్పష్టం చేశారు.

‘స్వీట్ అంకుల్’ అంటూ స్టాలిన్‌పై సెటైర్

విజయ్ తన ప్రసంగంలో స్టాలిన్‌ను ‘స్వీట్ అంకుల్’గా సంబోధించడం ఆసక్తికరంగా మారింది. స్టాలిన్ గెలిచినా, ఓడినా ఆయన తనకు ‘స్వీట్ అంకుల్’గానే ఉంటారని వ్యాఖ్యానించారు. అదే సమయంలో డీఎంకే తమ టీవీకేను ప్రధాన ప్రత్యర్థిగా గుర్తించడం ప్రారంభించిందని విజయ్ అన్నారు. సాధారణ కుటుంబాల నుంచి వచ్చిన ప్రజలే తమ పార్టీకి బలమని పేర్కొన్నారు. తమిళనాడులోని సంప్రదాయ రాజకీయ పార్టీలకు ప్రత్యామ్నాయంగా టీవీకే ఎదిగిందని విజయ్ తన ప్రసంగంలో చెప్పుకున్నారు.

ఉపఎన్నికలతో వేడెక్కిన తమిళనాడు

మదురాంతకం, ధారాపురం అసెంబ్లీ స్థానాలకు అక్టోబర్ 6న ఉపఎన్నికలు జరగనున్నాయి. ఈ రెండు స్థానాల్లోనూ టీవీకే, డీఎంకే, ఏఐఏడీఎంకేతో పాటు వామపక్ష పార్టీలు కూడా పోటీలో ఉన్నాయి. మదురాంతకంలో టీవీకే తరఫున మరగతం కుమారవేల్ బరిలో ఉన్నారు. ఆమె గత అసెంబ్లీ ఎన్నికల్లో ఏఐఏడీఎంకే తరఫున గెలిచి, ఆ తర్వాత ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి టీవీకేలో చేరారు.

ఈ పరిణామాల నేపథ్యంలో మదురాంతకం ఉపఎన్నిక ప్రచారం ప్రధాన పార్టీల మధ్య తీవ్ర మాటల యుద్ధానికి వేదికగా మారింది. విజయ్ ప్రభుత్వంపై స్టాలిన్ కూడా ఇటీవల పలు విమర్శలు చేశారు. టీవీకే ప్రభుత్వం పాలన, రాజకీయ వ్యవహారశైలిపై స్టాలిన్ ఆరోపణలు చేశారు. మరోవైపు ఏఐఏడీఎంకే నేత ఎడప్పాడి పళనిస్వామి కూడా విజయ్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు.

ఇలాంటి పరిస్థితుల్లో విజయ్ తాజాగా స్టాలిన్ ఆస్తుల వివరాలను బహిర్గతం చేయాలంటూ చేసిన సవాల్ తమిళనాడు రాజకీయాల్లో చర్చకు దారితీసింది. ఉపఎన్నిక ప్రచారం ముందుకు సాగుతున్న కొద్దీ అవినీతి, ఆస్తులు, గత పాలన, ఎమ్మెల్యేల ఫిరాయింపులు వంటి అంశాలు ప్రధాన ప్రచార అస్త్రాలుగా మారుతున్నాయి.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.