లక్ష రూపాయలు ఎఫ్డీ చేస్తే.. 10 ఏళ్లలతో ఎంత అవుతుందో తెలుసా? ఆశ్చర్యాన్ని కలిగించే లెక్కలు
Recharge plan: పెట్టుబడి పెట్టాలనుకునే చాలామంది ఇప్పటికీ ఫిక్స్డ్ డిపాజిట్ (FD)ను నమ్మకమైన ఆప్షన్‌గా ఎంచుకుంటున్నారు.
లక్ష రూపాయలు ఎఫ్డీ చేస్తే.. 10 ఏళ్లలతో ఎంత అవుతుందో తెలుసా? ఆశ్చర్యాన్ని కలిగించే లెక్కలు
Recharge plan: పెట్టుబడి పెట్టాలనుకునే చాలామంది ఇప్పటికీ ఫిక్స్డ్ డిపాజిట్ (FD)ను నమ్మకమైన ఆప్షన్‌గా ఎంచుకుంటున్నారు. ముఖ్యంగా షేర్ మార్కెట్లో రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడని వారికి FD ఒక ప్రత్యామ్నాయం. ఉదాహరణకు రూ. లక్షను 10 ఏళ్ల పాటు FDలో పెడితే 6%, 7%, 8% వడ్డీ రేట్ల వద్ద ఎంత వస్తుందో ఇప్పుడు చూద్దాం.
రూ. లక్షను 10 ఏళ్లకు FD చేస్తే ఎంత వస్తుంది?
మీరు లక్ష రూపాయలను 10 సంవత్సరాల కాలానికి క్యూములేటివ్ FDలో పెట్టారని అనుకుందాం. ఇందులో వచ్చే వడ్డీని మధ్యలో తీసుకోకుండా తిరిగి FDలోనే కలుపుతారు. దీంతో వడ్డీపై కూడా వడ్డీ వస్తుంది. దీన్నే చక్రవడ్డీ లేదా కంపౌండింగ్ అంటారు. 10 ఏళ్లకు 7% వార్షిక వడ్డీ లభిస్తే, త్రైమాసిక చక్రవడ్డీని పరిగణనలోకి తీసుకున్నప్పుడు రూ. లక్ష, రూ. 2 లక్షలకు చేరుతుంది. అంటే మీ పెట్టుబడి దాదాపు రెట్టింపు అవుతుంది.
6%, 7%, 8% వడ్డీకి ఎంత వస్తుంది?
వడ్డీ రేటులో చిన్న తేడా ఉన్నా దీర్ఘకాలంలో దాని ప్రభావం గణనీయంగా ఉంటుంది. రూ. 1 లక్షను 10 సంవత్సరాల పాటు క్యూములేటివ్ FDలో పెట్టి, త్రైమాసిక చక్రవడ్డీని పరిగణనలోకి తీసుకుంటే లెక్కలు ఇలా ఉంటాయి.
* 6 శాతం వడ్డీకి రూ. 1.81 లక్షలు
* 7 శాతం వడ్డీకి లెక్కిస్తే రూ. 2 లక్షలు
* ఇక 8 శాతం వడ్డీకి లెక్కగడితే రూ. 2.21 లక్షలు అవుతుంది.
అంటే 6% వడ్డీతో పోలిస్తే 8% వడ్డీ లభిస్తే 10 ఏళ్ల తర్వాత సుమారు రూ. 39,000 ఎక్కువ పొందే అవకాశం ఉంటుంది. అందుకే దీర్ఘకాలిక FD చేసే సమయంలో వడ్డీ రేటును కూడా జాగ్రత్తగా పరిశీలించాలి.
కంపౌండింగ్ వల్ల ప్రయోజనం ఏమిటి?
క్యూములేటివ్ FDలో వచ్చే వడ్డీని మీరు ప్రతి నెలా లేదా ప్రతి త్రైమాసికంలో తీసుకోరు. ఆ వడ్డీని అసలు మొత్తానికి కలుపుతూ ఉంటారు. తర్వాతి కాలంలో వచ్చే వడ్డీ అసలు డబ్బుతో పాటు ఇప్పటికే జమ అయిన వడ్డీపైనా లెక్కిస్తారు. ఉదాహరణకు మొదట రూ. లక్షపై వడ్డీ వస్తుంది. ఆ వడ్డీ కూడా పెట్టుబడిలో కలిసిన తర్వాత, తర్వాతి కాలానికి రూ. లక్షకంటే ఎక్కువ మొత్తంపై వడ్డీ లెక్కిస్తారు. ఇలా సంవత్సరాలు గడిచే కొద్దీ కంపౌండింగ్ ప్రభావం పెరుగుతుంది. అందుకే దీర్ఘకాలిక పెట్టుబడుల్లో వడ్డీ రేటుతో పాటు కంపౌండింగ్ విధానం కూడా చాలా ముఖ్యం.
ప్రతి నెలా వడ్డీ కావాలంటే?
మీకు FD నుంచి ప్రతినెలా ఆదాయం కావాలంటే క్యూములేటివ్ FD కాకుండా మంత్లీ ఇంట్రెస్ట్ పేఅవుట్ FDని సెలక్ట్ చేసుకోవచ్చు. ఇందులో వచ్చే వడ్డీని నిర్ణీత వ్యవధిలో మీ బ్యాంక్ ఖాతాలోకి జమ చేస్తారు. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. వడ్డీని తిరిగి FDలో కలపకపోవడంతో దానిపై మళ్లీ వడ్డీ వచ్చే అవకాశం ఉండదు. అందువల్ల 10 ఏళ్ల తర్వాత చేతికి వచ్చే మెచ్యూరిటీ మొత్తం క్యూములేటివ్ FDతో పోలిస్తే తక్కువగా ఉండవచ్చు. అయితే పెట్టుబడి కొనసాగుతున్న సమయంలోనే మీకు క్రమం తప్పకుండా వడ్డీ ఆదాయం వస్తుంది.
10 ఏళ్ల FD చేసే ముందు ఇవి చూడండి
దీర్ఘకాలిక FD చేయడానికి ముందు వడ్డీ రేటు మాత్రమే కాకుండా కొన్ని ముఖ్యమైన అంశాలను కూడా పరిశీలించాలి. FD క్యూములేటివ్దా, మంత్లీ పేఅవుట్దా అనేది ముందుగా తెలుసుకోవాలి. అలాగే అవసరమైతే మెచ్యూరిటీకి ముందే డబ్బులు తీసుకునే అవకాశం ఉందా, అలా తీసుకుంటే పెనాల్టీ లేదా తక్కువ వడ్డీ వర్తిస్తుందా అనే విషయాలను బ్యాంకు నిబంధనల్లో చూడాలి.
అదే సమయంలో FD ద్వారా వచ్చే వడ్డీ పన్ను పరిధిలోకి రావచ్చు. మీ ఆదాయం, వర్తించే ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ ఆధారంగా పన్ను ప్రభావం ఉండొచ్చు. కాబట్టి రూ. లక్షను 10 ఏళ్లకు FDలో పెట్టే ముందు వడ్డీ రేటుతో పాటు పన్ను, మెచ్యూరిటీ మొత్తం, ముందస్తు ఉపసంహరణ నిబంధనలు అన్నింటినీ పరిశీలించడం మంచిది.




