Schemes: కేంద్ర ప్రభుత్వ పథకాలపై కీలక అప్టేడ్
Schemes: మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన PMJJBY, PMSBY, APY పథకాలు 11 ఏళ్లు పూర్తి చేసుకున్నాయి.
Schemes: కేంద్ర ప్రభుత్వ పథకాలపై కీలక అప్టేడ్
Central Govt Schemes: ప్రతి సామాన్యుడి కల.. తన కుటుంబానికి ఒక భద్రత ఉండాలి. ఆపద కాలంలో ఆర్థిక అండ దొరకాలి. ఈ కలను నిజం చేస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన , అటల్ పెన్షన్ యోజన విజయవంతంగా 11 ఏళ్లు పూర్తి చేసుకున్నాయి. ఈ 11 ఏళ్ల ప్రస్థానంలో ఈ పథకాలు కేవలం కాగితాలకే పరిమితం కాకుండా, లక్షలాది కుటుంబాల్లో వెలుగులు నింపాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు.
జన సురక్ష ప్రభంజనం
దేశవ్యాప్తంగా అణగారిన, బలహీన వర్గాలకు తక్కువ ధరకే బీమా, పెన్షన్ అందించడమే లక్ష్యంగా 2015లో ప్రారంభమైన ఈ పథకాలు అనేక మైలురాళ్లు సాధించాయి. ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటివరకు సుమారు రూ. 25,160 కోట్ల విలువైన క్లెయిమ్‌లను ప్రభుత్వం పరిష్కరించింది. PMJJBY 27 కోట్లకు పైగా నమోదు చేసింది. PMSBY 58 కోట్లు, APY 9 కోట్ల మందికి పైగా చందాదారులు నమోదు కావడం విశేషం. ఆర్థిక మంత్రి వివరణ ప్రకారం, అత్యవసర సమయాల్లో ఈ పథకాలు బాధిత కుటుంబాలకు కొండంత అండగా నిలిచాయి: PMJJBY ద్వారా 10.7 లక్షల కుటుంబాలకు రూ. 21,500 కోట్లకు పైగా లబ్ధి చేకూరింది. PMSBY ద్వారా 1.84 లక్షల కుటుంబాలకు దాదాపు రూ. 3,660 కోట్ల క్లెయిమ్‌లు అందాయి.
ఇంటి వద్దకే సేవలు
ఈ సందర్భంగా ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి మాట్లాడుతూ.. ఒకప్పుడు బీమా లేదా పెన్షన్ కోసం బ్యాంకులు, పోస్టాఫీసుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉండేదని, కానీ ఇప్పుడు ఆ అవసరం లేదని తెలిపారు. పౌరులు తమ ఇంటి నుండే సులభంగా నమోదు చేసుకునే వెసులుబాటు కలిగింది. క్లెయిమ్ ప్రక్రియను పూర్తిగా డిజిటలైజేషన్ చేయడం వల్ల, మధ్యవర్తుల ప్రమేయం లేకుండా బాధిత కుటుంబాలకు సకాలంలో డబ్బు అందుతోంది. తక్కువ ప్రీమియంతో ఎక్కువ భద్రత కల్పించే ఈ పథకాలు నేడు దేశంలోని ప్రతి మూలకు చేరుకున్నాయి.




