3 ఏళ్ల FDపై ఏ బ్యాంకు అత్యధిక వడ్డీ ఇస్తోంది.? సీనియర్ సిటిజన్లకు ఎక్కడ ఎక్కువ లాభం.?

Fixed Deposit: స్థిరమైన ఆదాయం పొందాలనుకునే వారికి ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) మంచి పెట్టుబడి మార్గం. ముఖ్యంగా సీనియర్ సిటిజన్లకు బ్యాంకులు సాధారణ ఖాతాదారుల కంటే అదనపు వడ్డీని అందిస్తున్నాయి.

Mokshith
Published on: 25 Nov 2026 2:53 PM IST
Fixed Deposit
X

3 ఏళ్ల FDపై ఏ బ్యాంకు అత్యధిక వడ్డీ ఇస్తోంది.? సీనియర్ సిటిజన్లకు ఎక్కడ ఎక్కువ లాభం.?

Fixed Deposit: స్థిరమైన ఆదాయం పొందాలనుకునే వారికి ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) మంచి పెట్టుబడి మార్గం. ముఖ్యంగా సీనియర్ సిటిజన్లకు బ్యాంకులు సాధారణ ఖాతాదారుల కంటే అదనపు వడ్డీని అందిస్తున్నాయి. ఎక్కువ కాలం పాటు డబ్బును లాక్ చేయకుండా మూడేళ్ల పాటు పెట్టుబడి పెట్టాలనుకుంటే FD మంచి ఎంపికగా చెప్పొచ్చు. అయితే ఏ బ్యాంకులో ఎక్కువ వడ్డీ లభిస్తుంది? సీనియర్ సిటిజన్లకు ఏ బ్యాంకు ఎక్కువ ప్రయోజనం అందిస్తోంది చూద్దాం.

మూడు ఏళ్ల FDపై అత్యధిక వడ్డీ ఇస్తున్న బ్యాంకు ఇదే

మూడేళ్ల ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై సీనియర్ సిటిజన్లకు అత్యధిక వడ్డీ అందిస్తున్న బ్యాంకుల్లో య‌స్ బ్యాంక్ ముందంజలో ఉంది. ఈ బ్యాంకు సాధారణ ఖాతాదారులకు 7.25 శాతం వడ్డీ అందిస్తుండగా, సీనియర్ సిటిజన్లకు 7.75 శాతం వడ్డీ ఇస్తోంది. అంటే సాధారణ ఖాతాదారులతో పోలిస్తే సీనియర్ సిటిజన్లకు 0.50 శాతం అదనపు వడ్డీ లభిస్తుంది. మూడేళ్ల పాటు తమ డబ్బును FDలో పెట్టుబడి పెట్టాలనుకునే వృద్ధులకు ఇది ఆకర్షణీయమైన అవకాశం.

ఇతర బ్యాంకుల్లో ఎంత వడ్డీ లభిస్తోంది?

మూడేళ్ల FDపై వివిధ బ్యాంకులు అందిస్తున్న వడ్డీ రేట్లను పరిశీలిస్తే.. య‌స్ బ్యాంక్ త‌ర్వాత యాక్సిస్ బ్యాంక్ సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు 7.10 శాతం వడ్డీ అందిస్తోంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంక్ రెండూ 7.05 శాతం వడ్డీని ఆఫర్ చేస్తున్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సీనియర్ సిటిజన్లకు 6.80 శాతం వడ్డీ ఇస్తోంది.

కెనెరా బ్యాంక్‌, బ్యాంక్ ఆఫ్ బ‌రోడా రెండింటిలోనూ ఈ వడ్డీ రేటు 6.75 శాతంగా ఉంది. సాధారణ ఖాతాదారుల వడ్డీ రేట్లను పరిశీలిస్తే.. ఎస్‌బీఐ, పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంక్ 6.30 శాతం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 6.55 శాతం, యాక్సిస్ బ్యాంక్ 6.60 శాతం, కెనెరా బ్యాంక్‌, బ్యాంక్ ఆఫ్ బ‌రోడా 6.25 శాతం చొప్పున వడ్డీ అందిస్తున్నాయి. య‌స్‌బ్యాంక్‌లో సాధారణ ఖాతాదారులకు 7.25 శాతం వడ్డీ లభిస్తోంది.

సూపర్ సీనియర్ సిటిజన్లకు మరింత ప్రయోజనం

కొన్ని బ్యాంకులు సాధారణ సీనియర్ సిటిజన్లతో పాటు సూపర్ సీనియర్ సిటిజన్లకు కూడా ప్రత్యేక వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం PNBలో సూపర్ సీనియర్ సిటిజన్లకు 7.05 శాతం వడ్డీ లభిస్తోంది. Bank of Barodaలో 6.85 శాతం వడ్డీ అందిస్తున్నారు.

అయితే అన్ని బ్యాంకులు సూపర్ సీనియర్ సిటిజన్లకు ప్రత్యేక వడ్డీ రేట్లను ప్రకటించలేదు. కాబట్టి పెట్టుబడి పెట్టే ముందు మీ వయసుకు వర్తించే వడ్డీ రేటు, బ్యాంకు నిబంధనలను తెలుసుకోవాలి.

FD చేయించే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి

సీనియర్ సిటిజన్లు FDలో పెట్టుబడి పెట్టే ముందు కేవలం వడ్డీ రేటును మాత్రమే చూడకూడదు. వడ్డీని నెలవారీగా తీసుకోవాలా? మూడు నెలలకు ఒకసారి తీసుకోవాలా? లేక మెచ్యూరిటీ సమయంలో తీసుకోవాలా? అనే విషయాలను ముందుగానే నిర్ణయించుకోవాలి. ఎందుకంటే వడ్డీ చెల్లింపు విధానాన్ని బట్టి వచ్చే ఆదాయంలో తేడా ఉంటుంది.

అలాగే గడువు ముగియకముందే FDని వెనక్కి తీసుకుంటే బ్యాంకులు ముందస్తు ఉపసంహరణ ఛార్జీలు లేదా పెనాల్టీ విధించే అవకాశం ఉంటుంది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే FDపై వచ్చే వడ్డీ ఆదాయం పన్ను పరిధిలోకి వస్తుంది. నిర్ణీత పరిమితిని దాటితే TDS కూడా కట్ అవుతుంది.

ముఖ్యంగా బ్యాంకులు తమ FD వడ్డీ రేట్లను ఎప్పటికప్పుడు మార్చుతుంటాయి. అందువల్ల పెట్టుబడి పెట్టే రోజున సంబంధిత బ్యాంకు అధికారిక వెబ్‌సైట్‌లో తాజా వడ్డీ రేట్లు, నిబంధనలను పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలి.

Mokshith

Mokshith

2015లో జ‌ర్న‌లిజం స్కూల్ ద్వారా నా కెరీర్‌ను ప్రారంభించాను. అనంత‌రం 2016 నుంచి ప‌లు మీడియా సంస్థ‌ల్లో ప‌నిచేశాను. మొద‌ట ప్రింట్ ఆ త‌ర్వాత డిజిట‌ల్‌లో క‌లిపి మొత్తం 10 ఏళ్ల అనుభ‌వం ఉంది. నేను ఎక్కువ‌గా లైఫ్‌స్టైల్‌, అంత‌ర్జాతీయం, టెక్నాల‌జీ, బిజినెస్‌, ఆస్ట్రాల‌జీకి సంబంధించి వార్త‌లు రాస్తుంటాను.