Job Change: 2027లో ఉద్యోగం మారాలని 68.4% మంది ప్లాన్
Job Change: 2027లో ఉద్యోగం మారాలని 68.4% మంది భారతీయ నిపుణులు భావిస్తున్నారు. కెరీర్ వృద్ధి, జీతం, ఏఐ నైపుణ్యాలపై ఫౌండిట్ సర్వే కీలక వివరాలు.
Job Change: 2027లో ఉద్యోగం మారాలని 68.4% మంది ప్లాన్
Job Change: దేశంలో ఉద్యోగ మార్కెట్లో అనిశ్చితి కొనసాగుతున్నప్పటికీ, భారతీయ నిపుణులు కొత్త అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారు. వచ్చే ఏడాది (2027) ఉద్యోగం మారాలని 68.4 శాతం మంది నిపుణులు యోచిస్తున్నట్లు ఫౌండిట్ విడుదల చేసిన తాజా సర్వే వెల్లడించింది. కెరీర్లో ఎదుగుదల, అధిక వేతనం, భవిష్యత్తుకు అవసరమైన నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడం ఉద్యోగ మార్పునకు ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి.
ఫౌండిట్ రూపొందించిన కెరీర్ రీసెట్ సర్వే 2027 దేశవ్యాప్తంగా 9,951 మంది నిపుణుల నుంచి సేకరించిన అభిప్రాయాల ఆధారంగా రూపొందించారు. మెరుగైన ఉద్యోగం లభిస్తుందనే నమ్మకం 94.1 శాతం మందిలో ఉన్నట్లు సర్వే పేర్కొంది.
ఉద్యోగ మార్పునకు ప్రధాన కారణం కెరీర్ వృద్ధి
ఉద్యోగం మారాలని భావిస్తున్న వారిలో 40.3 శాతం మంది కెరీర్లో ఎదుగుదలను ప్రధాన కారణంగా పేర్కొన్నారు. 29.7 శాతం మంది అధిక జీతం కోసం కొత్త ఉద్యోగాలను అన్వేషించాలని భావిస్తున్నారు. మరో 20.3 శాతం మంది మెరుగైన పని-జీవిత సమతుల్యత కోసం ఉద్యోగ మార్పు కోరుకుంటున్నారు.
ఈ గణాంకాలను పరిశీలిస్తే, ఉద్యోగులు కేవలం వేతన పెంపునే కాకుండా కెరీర్ అభివృద్ధి, వ్యక్తిగత జీవితానికి తగిన సమయం లభించే ఉద్యోగాలపై కూడా ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది.
31 శాతం జీతం పెరిగితేనే ఉద్యోగ మార్పు!
ఉద్యోగ మార్పులో జీతం కూడా కీలక పాత్ర పోషిస్తోంది. కనీసం 31 శాతం వేతన పెంపు లభిస్తేనే ఉద్యోగం మారడాన్ని పరిశీలిస్తామని 51.5 శాతం మంది నిపుణులు వెల్లడించారు. అంటే మెరుగైన అవకాశాలతో పాటు గణనీయమైన వేతన పెంపును కూడా ఉద్యోగులు ఆశిస్తున్నారు.
మరోవైపు, 18.1 శాతం మంది ప్రస్తుత సంస్థల్లోనే కొనసాగుతూ కొత్త అవకాశాల కోసం ఎదురుచూడాలని భావిస్తున్నారు. కేవలం 3.7 శాతం మంది మాత్రమే ప్రస్తుత సంస్థలోనే ఉండి తమ కెరీర్ను అభివృద్ధి చేసుకోవాలని యోచిస్తున్నట్లు సర్వే తెలిపింది.
ఏఐ నైపుణ్యాలపై పెరుగుతున్న ఆసక్తి
కృత్రిమ మేధస్సు (AI) ఉద్యోగాల స్వరూపాన్ని మారుస్తున్న నేపథ్యంలో, 82.1 శాతం మంది దీనిని కెరీర్ అవకాశంగా చూస్తున్నట్లు సర్వే వెల్లడించింది. వీరిలో 67 శాతం మంది ఇప్పటికే తమ ఏఐ నైపుణ్యాలను మెరుగుపరుచుకునే ప్రయత్నాల్లో ఉన్నారు.
భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకోవాలంటే కొత్త సాంకేతిక పరిజ్ఞానంపై పట్టు సాధించడం, నిరంతరం నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడం అవసరమని నిపుణులు భావిస్తున్నట్లు ఈ వివరాలు సూచిస్తున్నాయి.
ఉద్యోగులకు వృద్ధి అవకాశాలు కల్పించాలి: ఫౌండిట్ సీఈఓ
2027లోకి అడుగుపెడుతున్న భారతీయ ఉద్యోగుల్లో కెరీర్ వృద్ధి, దీర్ఘకాలిక ఉపాధి అవకాశాలపై స్పష్టమైన మార్పు కనిపిస్తోందని ఫౌండిట్ సీఈఓ తరుణ్ సిన్హా తెలిపారు. ఉద్యోగ మార్కెట్లో అనిశ్చితి ఉన్నప్పటికీ, కొత్త అవకాశాలను అన్వేషించాలనే విశ్వాసం బలంగా ఉందన్నారు.
జీతాల అంచనాలు ఎక్కువగా ఉన్నప్పటికీ, తక్షణ ఆర్థిక ప్రయోజనాల కంటే కెరీర్ వృద్ధికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం గమనార్హమని పేర్కొన్నారు. ఏఐ నైపుణ్యాలపై పెరుగుతున్న ఆసక్తి, మారుతున్న ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా నిరంతరం నేర్చుకోవాల్సిన అవసరాన్ని నిపుణులు గుర్తిస్తున్నారనడానికి సంకేతమని వివరించారు.
ఉద్యోగులను ఆకర్షించడం మాత్రమే కాకుండా, వారికి అర్థవంతమైన కెరీర్ వృద్ధి అవకాశాలు కల్పించడం, భవిష్యత్తుకు అవసరమైన నైపుణ్యాలను అభివృద్ధి చేయడం యజమానుల ముందున్న ప్రధాన సవాలని తరుణ్ సిన్హా అభిప్రాయపడ్డారు.




