ఆధార్ కార్డులో పేరు మార్చాలా? కొత్త రూల్స్ ఇవే.. ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరి!
ఆధార్ కార్డులో పేరు మార్చాలంటే కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. చిన్న మార్పులు, పెళ్లి, పూర్తి పేరు మార్పుకు వేర్వేరు పత్రాలు అవసరం.
Aadhaar Name Change Rules
ఆధార్ కార్డులో పేరు తప్పుగా నమోదైందా? పెళ్లి తర్వాత ఇంటిపేరు మార్చుకోవాలనుకుంటున్నారా? లేదా పూర్తిగా కొత్త పేరు పెట్టుకోవాలనుకుంటున్నారా? అయితే ఇకపై అన్ని రకాల పేరు మార్పులకు ఒకే విధానం ఉండదు. పేరు మార్పు స్వభావాన్ని బట్టి అవసరమైన పత్రాలు, అఫిడవిట్, గెజిట్ నోటిఫికేషన్ వంటి వాటిని సమర్పించాల్సి ఉంటుంది. యూఐడీఏఐ 2026లో సవరించిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్‌లో ఈ నిబంధనలను స్పష్టం చేసింది. ఈ కొత్త విధానం సెప్టెంబర్ 18, 2026 నుంచి అమల్లోకి వచ్చింది.
చిన్నపాటి పేరు మార్పులకు ప్రత్యేక నిబంధనలు
పేరులో స్వల్ప మార్పులను యూఐడీఏఐ ప్రత్యేక కేటగిరీగా పరిగణిస్తోంది. పేరులో ఉన్న సంక్షిప్త రూపాన్ని పూర్తిగా రాయడం, మధ్య పేరు లేదా ఇంటిపేరు చేర్చడం లేదా తొలగించడం, పేర్ల క్రమాన్ని మార్చడం వంటి మార్పులు ఈ కేటగిరీలోకి వస్తాయి.
అలాగే ఉచ్చారణ ఒకేలా ఉండే పేర్లలో చిన్న అక్షర దోషాలను సరిచేయడం, పేరులోని చుక్కలను తొలగించడం, అనవసరంగా పెద్ద అక్షరాల్లో నమోదైన పేరును సరిచేయడం వంటి మార్పులను కూడా స్వల్ప మార్పులుగానే పరిగణిస్తారు.
పెళ్లి, విడాకుల తర్వాత ఇంటిపేరు మార్చాలంటే..
వివాహం లేదా విడాకుల కారణంగా ఇంటిపేరు మార్చుకోవాలనుకునే వారికి ప్రత్యేక నిబంధనలు ఉన్నాయి. ఇందుకోసం సంబంధిత అఫిడవిట్‌తో పాటు గుర్తింపు ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుంది.
పేరు మార్పు వివాహం లేదా విడాకుల కారణంగానే జరిగిందని, వ్యక్తి గుర్తింపులో ఎలాంటి మార్పు లేదని అఫిడవిట్‌లో పేర్కొనాల్సి ఉంటుంది.
ఆధార్‌లో పేరు తప్పుగా నమోదైతే ఏం చేయాలి?
ఎన్‌రోల్‌మెంట్ సమయంలో లేదా గతంలో ఆధార్ అప్‌డేట్ చేసేటప్పుడు సమర్పించిన పత్రంలో పేరు సరిగ్గానే ఉన్నప్పటికీ, డేటా ఎంట్రీ సమయంలో ఆధార్‌లో పేరు తప్పుగా నమోదైతే దాన్ని డేటా ఎంట్రీ పొరపాటుగా పరిగణిస్తారు.
ఇలాంటి సందర్భాల్లో పెద్దలు సంబంధిత అఫిడవిట్‌తో పాటు గుర్తింపు ధ్రువీకరణ పత్రం లేదా సంబంధ ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుంది. మైనర్లకు ప్రత్యేకంగా పేర్కొన్న అఫిడవిట్‌తో పాటు అవసరమైన గుర్తింపు లేదా సంబంధ ధ్రువీకరణ పత్రాలను ఇవ్వాలి.
ఇంగ్లిష్‌లో పేరు సరిగ్గా ఉండి, ప్రాంతీయ భాషలో మాత్రం పేరు తప్పుగా నమోదైన సందర్భానికి కూడా ప్రత్యేక నిబంధన ఉంది.
పూర్తిగా పేరు మార్చాలంటే గెజిట్ నోటిఫికేషన్ తప్పనిసరి
వ్యక్తి పేరును పూర్తిగా మార్చడం లేదా వ్యక్తి గుర్తింపులో మార్పుగా పరిగణించే స్థాయిలో పేరు మార్చడం ‘మేజర్ నేమ్ చేంజ్’ కేటగిరీలోకి వస్తుంది. ఇలాంటి సందర్భాల్లో పేరు మార్పుకు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్‌ను సమర్పించాల్సి ఉంటుంది.
అంటే చిన్నపాటి అక్షర దోషం లేదా పేరులో స్వల్ప మార్పుకు అవసరమైన పత్రాలు వేరుగా ఉంటే, పూర్తిగా పేరు మార్చే సందర్భంలో గెజిట్ నోటిఫికేషన్ వంటి అదనపు ఆధారాలు అవసరం అవుతాయి.
ఆధార్‌లో పేరు ఎలా మార్చుకోవాలి?
ముందుగా మీ పేరు మార్పు ఏ కేటగిరీలోకి వస్తుందో గుర్తించాలి. ఆ తర్వాత ఆ కేటగిరీకి అవసరమైన గుర్తింపు పత్రాలు, సంబంధ ధ్రువీకరణ పత్రాలు, అఫిడవిట్ లేదా గెజిట్ నోటిఫికేషన్‌ను సిద్ధం చేసుకోవాలి.
తర్వాత ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ లేదా అప్‌డేట్ కేంద్రాన్ని సందర్శించి దరఖాస్తుతో పాటు అవసరమైన పత్రాలను సమర్పించాలి. ధ్రువీకరణ ప్రక్రియ పూర్తయిన తర్వాత లభించే రసీదును భద్రంగా ఉంచుకోవాలి. ఆ రసీదులోని వివరాలతో ఆధార్ అప్‌డేట్ స్థితిని తెలుసుకోవచ్చు.
ప్రస్తుతం ఆధార్‌లో పేరు మార్పు కోసం మైఆధార్ ద్వారా ఆన్‌లైన్‌లో నేరుగా అప్‌డేట్ చేసుకునే అవకాశం లేదని పేర్కొనబడింది. కాబట్టి పేరు మార్పు అవసరమైన వారు సంబంధిత పత్రాలతో ఆధార్ అప్‌డేట్ కేంద్రాన్ని సంప్రదించాల్సి ఉంటుంది.




