Aditya Birla Group: ఒడిశాలో మరో రూ.12 వేల కోట్ల పెట్టుబడికి ఆదిత్య బిర్లా సిద్ధం
ఒడిశాలో అల్యూమినా రిఫైనరీ విస్తరణకు ఆదిత్య బిర్లా గ్రూప్ అదనంగా రూ.12 వేల కోట్లు పెట్టుబడి పెట్టనుంది.
Aditya Birla to Invest Rs 12,000 Crore in Odisha Expansion
Aditya Birla Group : ఆదిత్య బిర్లా గ్రూప్ ఒడిశాలో భారీ పెట్టుబడులకు శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని రాయగడ జిల్లాలో నిర్మిస్తున్న అల్యూమినా రిఫైనరీ విస్తరణ కోసం అదనంగా రూ.12,000 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది. దీంతో ఈ ప్రాజెక్టులో మొత్తం పెట్టుబడి రూ.20,000 కోట్లకు చేరనుంది.
ఈ ప్రతిపాదనపై ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీతో ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార్ మంగళం బిర్లా సమావేశమై చర్చించారు. ప్రస్తుతం ఏడాదికి 10 లక్షల టన్నుల సామర్థ్యంతో రూపొందిస్తున్న రిఫైనరీని 30 లక్షల టన్నుల సామర్థ్యానికి విస్తరించాలని సంస్థ నిర్ణయించింది.
ఈ ప్రాజెక్టును హిండాల్కో ఇండస్ట్రీస్ అభివృద్ధి చేస్తోంది. అదనపు పెట్టుబడితో రిఫైనింగ్ సామర్థ్యం పెరగడమే కాకుండా ప్రత్యక్ష, పరోక్షంగా వేలాది ఉద్యోగ అవకాశాలు ఏర్పడనున్నాయని కంపెనీ తెలిపింది. స్థానిక పరిశ్రమలు, సేవా రంగం, అనుబంధ వ్యాపారాలకు కూడా ఈ ప్రాజెక్టు ఊతమివ్వనుంది.
రిఫైనరీ విస్తరణతో ఒడిశాలో అల్యూమినియం ఆధారిత అనుబంధ పరిశ్రమలు మరింత అభివృద్ధి చెందుతాయని ప్రభుత్వం భావిస్తోంది. ముడి ఖనిజాల సరఫరా రాష్ట్రానికే పరిమితం కాకుండా విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీ కేంద్రంగా ఒడిశాను తీర్చిదిద్దడమే లక్ష్యమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
ప్రాజెక్టు అమలుకు అవసరమైన భూమి, మౌలిక వసతులు, విద్యుత్, నీటి సరఫరా, అనుమతులు తదితర అన్ని అంశాల్లో ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.
సమావేశంలో అల్యూమినా రిఫైనరీతో పాటు రాగి శుద్ధి యూనిట్లు, ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డులు, అధునాతన అల్యూమినియం ఉత్పత్తులు, టెక్నికల్ టెక్స్టైల్స్, పెయింట్స్, ఆభరణాల తయారీ, పునరుత్పాదక ఇంధనం, రసాయనాలు, సిమెంట్, వస్త్ర పరిశ్రమల్లో పెట్టుబడుల అవకాశాలపై కూడా చర్చించారు.
ఇప్పటికే ఒడిశాలో గనులు, అల్యూమినా రిఫైనరీలు, అల్యూమినియం స్మెల్టర్లు, తయారీ యూనిట్లలో రూ.40 వేల కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టిన హిండాల్కో, రానున్న రోజుల్లో మరింత విస్తరణకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.




