ఎయిర్ ఇండియాకు కొత్త సీఈఓగా టెవోల్డే గెబ్రెమరియం.. క్యాంప్‌బెల్ విల్సన్ స్థానంలో నియామకం
ఎయిర్ ఇండియా కొత్త సీఈఓ, ఎండీగా టెవోల్డే గెబ్రెమరియంను నియమించింది. క్యాంప్‌బెల్ విల్సన్ స్థానంలో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు.
Air India CEO
ఎయిర్ ఇండియా కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ), మేనేజింగ్ డైరెక్టర్‌గా టెవోల్డే గెబ్రెమరియంను నియమించినట్లు ఎయిర్ ఇండియా ఆగస్టు 5న ప్రకటించింది. ఇప్పటివరకు సీఈఓ, ఎండీగా ఉన్న క్యాంప్‌బెల్ విల్సన్ స్థానంలో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు.
ఎయిర్ ఇండియా రూపాంతర ప్రయాణంలో ఈ నాయకత్వ మార్పు కీలక దశ అని సంస్థ పేర్కొంది. ప్రపంచస్థాయి ప్రముఖ విమానయాన సంస్థగా ఎదగాలనే లక్ష్యంతో కొనసాగుతున్న మార్పులను గెబ్రెమరియం ముందుకు తీసుకెళ్లనున్నారు.
ఎయిర్ ఇండియాలో చేరకముందు గెబ్రెమరియం దశాబ్దానికి పైగా ఇథియోపియన్ ఎయిర్‌లైన్స్ గ్రూప్ సీఈఓగా పనిచేశారు. ఆయన నాయకత్వంలో సంస్థ భారీ స్థాయిలో విస్తరించింది. ప్రాంతీయ విమానయాన సంస్థగా ఉన్న ఇథియోపియన్ ఎయిర్‌లైన్స్‌ను ఆఫ్రికాలో అతిపెద్ద, లాభదాయకమైన విమానయాన గ్రూప్‌గా తీర్చిదిద్దడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఆ కాలంలో సంస్థ ఆదాయం నాలుగు రెట్లకు పైగా పెరగగా, విమానాల సంఖ్య దాదాపు మూడు రెట్లు పెరిగింది.
టాటా సన్స్, ఎయిర్ ఇండియా చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ గెబ్రెమరియం నియామకాన్ని స్వాగతించారు. సమర్థవంతమైన, లాభదాయకమైన విమానయాన సంస్థను నిర్మించిన అనుభవం ఆయనకు ఉందని, ఎయిర్ ఇండియాను ప్రముఖ అంతర్జాతీయ విమానయాన సంస్థగా తీర్చిదిద్దడంలో ఆయన అనుభవం కీలకంగా ఉంటుందని పేర్కొన్నారు.
ఎయిర్ ఇండియా బోర్డు తదుపరి సీఈఓ ఎంపిక కోసం ప్రపంచవ్యాప్తంగా అంతర్గత, బాహ్య అభ్యర్థులను పరిశీలించినట్లు తెలిపింది. సమగ్ర పరిశీలన అనంతరం నాయకత్వ సామర్థ్యం, కార్యకలాపాల నిర్వహణలో అనుభవం ఉన్న గెబ్రెమరియంను ఏకగ్రీవంగా ఎంపిక చేసినట్లు వెల్లడించింది.
ఎయిర్ ఇండియా నాయకత్వ బాధ్యతలు అప్పగించడం గౌరవంగా భావిస్తున్నానని గెబ్రెమరియం తెలిపారు. సంస్థకు ఉన్న గొప్ప వారసత్వాన్ని కొనసాగిస్తూ, ప్రపంచస్థాయి విమానయాన సంస్థగా ఎయిర్ ఇండియాను తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని చెప్పారు.
ఇదిలా ఉంటే, క్యాంప్‌బెల్ విల్సన్ సేవలను ఎయిర్ ఇండియా ప్రశంసించింది. 2022లో టాటా గ్రూప్ ఎయిర్ ఇండియాను ప్రభుత్వ నుంచి కొనుగోలు చేసిన తర్వాత ఆయన సీఈఓ, ఎండీగా బాధ్యతలు చేపట్టారు. విల్సన్ హయాంలో సంస్థలో విలీనం, సమీకరణ ప్రక్రియను పూర్తి చేయడంతో పాటు విమానాల ఆధునికీకరణ, కొత్త కార్పొరేట్ పాలన విధానాల అమలు వంటి కీలక మార్పులు జరిగాయి.




