Air India: ఉచిత టిక్కెట్లతో ఉద్యోగుల దందా.. షాకైన టాటా యాజమాన్యం! వేలాది మందిపై వేటుకు సిద్ధం?

Air India: ఎయిర్ ఇండియాలో భారీ టిక్కెట్ల కుంభకోణం వెలుగుచూసింది. సంస్థ కల్పించే ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని దుర్వినియోగం చేసిన 4,000 మంది ఉద్యోగులపై టాటా గ్రూప్ కఠిన చర్యలకు సిద్ధమౌతుంది. జీతాల నుంచి రికవరీ, ప్రయాణాలపై బ్యాన్ వంటి సంచలన నిర్ణయాలతో యాజమాన్యం తీసుకుంటున్న దిద్దుబాటు చర్యల పూర్తి వివరాలు ఈ స్టోరీలో చదవండి.

Ganesh
Published on: 15 March 2026 5:25 PM IST
Air India
X

Air India: ఉచిత టిక్కెట్లతో ఉద్యోగుల దందా.. షాకైన టాటా యాజమాన్యం! వేలాది మందిపై వేటుకు సిద్ధం?

Air India: టాటా గ్రూప్ ఆధ్వర్యంలోని ఎయిర్ ఇండియాలో అనూహ్యమైన అంతర్గత కుంభకోణం వెలుగుచూసింది. సంస్థ తన ఉద్యోగులకు ఇచ్చే ఉచిత ప్రయాణ వెసులుబాటును (ELT) వేలాది మంది సిబ్బంది అడ్డదారిలో దుర్వినియోగం చేసినట్లు తేలింది. ఈ అక్రమాలకు పాల్పడిన సుమారు 4,000 మంది ఉద్యోగులపై యాజమాన్యం కఠిన చర్యలకు ఉపక్రమించింది. కుంభకోణం ఏమిటంటే.. ఎయిర్ ఇండియా నిబంధనల ప్రకారం, ప్రతి ఉద్యోగికి ఏడాదికి 14 ఉచిత రిటర్న్ టిక్కెట్లు లభిస్తాయి. వీటిని కేవలం సదరు ఉద్యోగి లేదా వారి కుటుంబ సభ్యులు (తల్లిదండ్రులు, భార్యాపిల్లలు) మాత్రమే ఉపయోగించుకోవాలి. అయితే కంపెనీ నిర్వహించిన అంతర్గత దర్యాప్తులో షాకింగ్ నిజాలు బయటపడ్డాయి.. అవి ఏంటంటే..

వేలాది మంది ఉద్యోగులు తమకు ఏమాత్రం రక్తసంబంధం లేని వ్యక్తులను 'బంధువుల'గా చూపి ఉచితంగా టిక్కెట్లు పొందినట్లు వెల్లడైంది. అలాగే మరికొందరు ఏకంగా తమకు వచ్చిన ఉచిత టిక్కెట్లను బయటి వ్యక్తులకు భారీ ధరలకు అమ్ముకుని అక్రమంగా సొమ్ము చేసుకున్నట్లు తేలింది. మొత్తం 24,000 మంది సిబ్బందిలో దాదాపు 16 శాతం మంది ఈ అక్రమాల్లో భాగస్వాములైనట్లు నివేదికలు చెబుతున్నాయి. విచిత్రమేమిటంటే, ఈ స్కామ్‌లో దొరికిపోయిన వారిలో ఎక్కువ మంది ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణ తర్వాత (టాటా గ్రూప్ బాధ్యతలు చేపట్టాక) చేరిన వారే కావడం గమనార్హం. గత ఆర్థిక సంవత్సరం నుంచి ఈ దందా గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్నట్లు సమాచారం.

చర్యలు షురూ.. రికవరీకి ఆదేశాలు..

ఈ వ్యవహారాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టాటా యాజమాన్యం తక్షణమే దిద్దుబాటు చర్యలు చేపట్టింది. మోసపూరితంగా పొందిన టిక్కెట్ల విలువను సదరు ఉద్యోగుల జీతాల నుంచి నేరుగా వసూలు చేస్తున్నట్లు సమాచారం. నిబంధనలు ఉల్లంఘించిన వారికి భవిష్యత్తులో ఉచిత టిక్కెట్ల సౌకర్యం లేకుండా బ్యాన్ విధిస్తున్నారు. అలాగే ఇకపై ఎవరైనా నామినీని చేర్చుకోవాలంటే కచ్చితమైన చట్టపరమైన ఆధారాలు, రక్తసంబంధ నిరూపణ పత్రాలు సమర్పించడం తప్పనిసరి చేశారు.

Ganesh

Ganesh

Next Story